World Cup 2023 BAN vs NZ ODI : రీ ఎంట్రీలో అదరగొట్టిన విలియమ్ సన్.. బంగ్లాదేశ్ చిత్తు.. కివీస్ హ్యాట్రిక్ విజయాలు.. మళ్లీ అగ్రస్థానం..
వన్డే ప్రపంచకప్‌లో న్యూజిలాండ్ వరుస విజయాలతో దూసుకెళ్తోంది. చెన్నై వేదికగా బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్‌లో గెలుపొందింది.

World Cup 2023 BAN vs NZ ODI
World Cup 2023 BAN vs NZ : వన్డే ప్రపంచకప్‌లో న్యూజిలాండ్ వరుస విజయాలతో దూసుకెళ్తోంది. చెన్నై వేదికగా బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో మళ్లీ అగ్రస్థానాన్ని సొంతం చేసుకుంది. బంగ్లాదేశ్ నిర్దేశించిన 246 పరుగుల లక్ష్యాన్ని 2 వికెట్లు కోల్పోయిన 42.5వ ఓవర్‌లో న్యూజిలాండ్ ఛేదించింది. గాయం కారణంగా కొన్నాళ్లు ఆటకు దూరమైన విలియమ్ సన్ (78 రిటైర్డ్ హర్ట్; 107 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్స్) రీ ఎంట్రీలో అదరగొట్టాడు. డారిల్ మిచెల్ (89 నాటౌట్; 67 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సులు) దూకుడుగా ఆడాడు. మిగిలిన వారిలో డేవాన్ కాన్వే (45; 59 బంతుల్లో 3ఫోర్లు) రాణించాడు. బంగ్లాదేశ్ బౌలర్లలో ముస్తాఫిజుర్ రెహమాన్, షకీబ్ అల్ హసన్ చెరో వికెట్ పడగొట్టారు.
అంతక ముందు మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 245 పరుగులు చేసింది. బంగ్లా బ్యాటర్లలో ముష్ఫికర్ రహీమ్ (66; 75 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లు) హాఫ్ సెంచరీతో ఆకట్టుకోగా షకీబ్ (40; 51 బంతుల్లో 3 ఫోర్లు 2 సిక్సర్లు), మహ్మదుల్లా (41; 49 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లు), హసన్ మిరాజ్ (30; 46 బంతుల్లో 4 ఫోర్లు) రాణించారు. న్యూజిలాండ్ బౌలర్లలో లాకీ ఫెర్గూసన్ 3 వికెట్లు పడగొట్టాడు. బౌల్ట్, హెన్రీ రెండేసి వికెట్లు తీశారు. మిచెల్ సాంట్నర్, ఫిలిప్స్ చెరో వికెట్ దక్కించుకున్నారు.
టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన బంగ్లాదేశ్‌కు వరుస షాకులు తగిలాయి. న్యూజిలాండ్ బౌలర్లు విజృంభించడంతో 56 పరుగులకే 4 వికెట్లు కష్టాల్లో పడింది. ఈ దశలో సీనియర్లు ఆటగాళ్లు షకీబ్ అల్ హసన్, ముప్ఫీకర్ రహీమ్ లు ఇన్నింగ్స్ నిర్మించే బాధ్యతను భుజాలపై వేసుకున్నారు. ఐదో వికెట్ కు 96 పరుగులు జోడించారు. అయితే.. షకీబ్, రహీమ్‌లు స్వల్ప వ్యవధిలో ఔట్ అయ్యారు. దీంతో బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ ముగిసేందుకు ఎంతో సేపు పట్టలేదు.
A winning start to back to back games in Chennai! @dazmitchell47 (89*) and Kane Williamson (78*) guide the team home to make it 3/3 so far at the @cricketworldcup. Scorecard | https://t.co/aNkBrDiAuv #CWC23 pic.twitter.com/IpRdQRTgxY
— BLACKCAPS (@BLACKCAPS) October 13, 2023