WPL 2026 : ఆమె లేకపోతే గెలిచేవాళ్లం కాదు.. ఆ రెండు పాయింట్లు.. స్మృతి మంధాన కామెంట్స్..
డబ్ల్యూపీఎల్ 2026 (WPL 2026) తొలి మ్యాచ్‌లో విజయం సాధించడం పట్ల స్మృతి మంధాన ఆనందాన్ని వ్యక్తం చేసింది.
WPL 2026 Smriti Mandhana comments after RCB beat MI (PIC Credit@wplt20)
- డబ్ల్యూపీఎల్ 2026లో ఘనంగా బోణీ కొట్టిన ఆర్‌సీబీ
- తొలి మ్యాచ్‌లో ముంబై పై ఆఖరి బంతికి విజయం
- నదైన్ డిక్లెర్క్ ఆల్‌రౌండ్ ప్రదర్శన
WPL 2026 : నదైన్ డిక్లెర్క్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతోనే మ్యాచ్‌లో తాము గెలిచామని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ స్మృతి మంధాన తెలిపింది. ఆర్‌సీబీ అంటేనే థ్రిల్లర్ మ్యాచ్‌లకు పెట్టింది పేరు అని, అయితే గతేడాది ఇలాంటి మ్యాచ్‌ల్లో తాము ఓడిపోయామంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించడంతో ఎంతో సంతోషంగా ఉందని అంది.
సజీవన్ సజన (25 బంతుల్లో 45 పరుగులు), నికోలా కేరీ (29 బంతుల్లో 40 పరుగులు), జి కమలినీ (28 బంతుల్లో 32 పరుగులు) రాణించడంతో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. ఆర్‌సీబీ బౌలర్లలో నదైన్ డిక్లెర్క్ నాలుగు వికెట్లు తీయగా.. లారెన్ బెల్, శ్రేయాంక పాటిల్ లు చెరో ఓ వికెట్ సాధించారు.
WPL 2026 : ఆ ఒక్క తప్పిదంతోనే ఓడిపోయాం.. లేదంటేనా.. హర్మన్ ప్రీత్ కౌర్ కామెంట్స్..
అనంతరం ఆఖరి బంతి వరకు ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో ఆర్‌సీబీ 7 వికెట్లు కోల్పోయి సరిగ్గా 20 ఓవర్లలో 155 పరుగుల లక్ష్యాన్ని అందుకుంది. ఆర్‌సీబీ బ్యాటర్లలో నదైన్ డిక్లెర్క్ (63 నాటౌట్; 44 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లు) సంచలన ఇన్నింగ్స్ ఆడింది. మిగిలిన వారిలో గ్రేస్ హారిస్ (25), అరుంధతి రెడ్డి (20) లు రాణించారు. ముంబై బౌలర్లలో నికోలా కారీ, అమేలియా కెర్ లు చెరో రెండు వికెట్లు తీశారు.
ఇక మ్యాచ్ అనంతరం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ స్మృతి మంధాన మాట్లాడింది. ఆఖరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో విజయం సాధించడం పట్ల ఆనందాన్ని వ్యక్తం చేసింది. సీజన్ తొలి మ్యాచే థ్రిల్లర్‌ను తలపించిందని, ఇలాంటి మ్యాచ్‌లకు ఆర్‌సీబీ పెట్టింది పేరు అని అంది.
నదైన్ డిక్లెర్క్ చాలా బాగా ఆడిందని మెచ్చుకుంది. ఇక పరిస్థితులు అనుకూలంగా లేకపోయినప్పటికి కూడా ప్లేయర్లు అందరూ సానుకూలంగానే ఉన్నారని చెప్పింది. ఇప్పుడు మనం గెలిచాం కాబట్టి ఇవన్నీ చెప్పడం సులభం అని నేను అనుకుంటున్నాను. ఏదీ ఏమైనప్పటికి కూడా ఈ టోర్నీకి మా సన్నద్దత బాగుంది. అందరూ మంచి ఫామ్‌లో ఉన్నారు అని స్మృతి అంది.
బౌలింగ్, బ్యాటింగ్ విభాగాలలో నదైన్ డిక్లెర్క్ పూర్తి బాధ్యత తీసుకుందని చెప్పుకొచ్చింది. వన్డే ప్రపంచకప్‌లో ఆమె మాకు ప్రత్యర్థిగా ఆడినప్పుడు కూడా ఇలాగే చేసింది. ఇదే విషయాన్ని నేను కోచ్‌కు చెబుతూనే ఉన్నాను. ఈ మ్యాచ్‌లోనే నదైన్ అదే పని చేసింది. క్యాచ్ మిస్ అయినప్పుడు ముంబై ప్లేయర్ సజన లాగే నదైన్ కూడా కొన్ని పరుగులు రాబట్టాలని కోరుకున్నాం అని స్మృతి చెప్పింది. ఏదీ ఏమైనప్పటికి రెండు పాయింట్లు సాధించినందుకు ఎంతో సంతోషంగా ఉందని అంది.
