ఉప్పల్ క్రికెట్ స్టేడియం వద్ద యూత్ కాంగ్రెస్ ఆందోళన.. ఉద్రిక్తత

ఉప్పల్ క్రికెట్ స్టేడియంలోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించిన యూత్ కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి.

ఉప్పల్ క్రికెట్ స్టేడియం వద్ద యూత్ కాంగ్రెస్ ఆందోళన.. ఉద్రిక్తత

RCB vs SRH IPL 2024: ఐపీఎల్ మ్యాచ్ టిక్కెట్లు బ్లాక్‌లో అమ్ముతున్నారని ఆరోపిస్తూ హైదరాబాద్ లోని ఉప్పల్ క్రికెట్ స్టేడియం వద్ద యూత్ కాంగ్రెస్ గురువారం ఆందోళన చేపట్టింది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావుకు వ్యతిరేకంగా నిరసనకారులు నినాదాలు చేశారు. స్టేడియంలోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించిన యూత్ కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఈరోజు రాత్రిజరగనున్న ఆర్సీబీ, ఎస్ఆర్‌హెచ్‌ మ్యాచ్ టిక్కెట్లను పెద్ద ఎత్తున బ్లాక్‌లో విక్రయించారని ఆందోళనకారులు ఆరోపించారు.

ఈ సందర్భంగా యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ శివసేన రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే విధంగా హెచ్‌సీఏ వ్యవహరిస్తోందని, టికెట్ల వ్యవహారంలో అనేక ఆరోపణలు వస్తున్నాయని అన్నారు. హెచ్‌సీఏ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు ఇంకా బీఆర్ఎస్ నేతల కనుసన్నల్లో నడుస్తున్నారని, హరీశ్ రావు బినామీగా ఉండి బ్లాక్ టికెట్స్ అమ్ముకుంటున్నారని ఆరోపించారు. వివిధ శాఖలకు ఇవ్వాల్సిన కాంప్లిమెంటరీ టికెట్లను సైతం అక్రమంగా విక్రయించారని విమర్శించారు. తక్షణమే హెచ్‌సీఏ ప్రెసిడెంట్ పదవి నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు.

పోలీసులకు ఫిర్యాదు
ఐపీఎల్ టికెట్స్ బ్లాక్‌లో విక్రయిస్తున్నారని హెచ్‌సీఏ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావుపై ఉప్పల్ పోలీసులకు శివసేన రెడ్డి ఫిర్యాదు చేశారు. IPL టికెట్ల విషయంలో అవకతవకలు జరిగాయని, ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని పోలీసులను కోరారు.

Also Read: ఉప్పల్‌లో ఆర్సీబీ, ఎస్ఆర్‌హెచ్‌ ఐపీఎల్ మ్యాచ్.. స్టేడియంకు వెళ్లేవారికి గుడ్ న్యూస్