ఇందులో చైనాను వెనక్కినెట్టేసి అగ్రస్థానంలోకి వచ్చిన భారత్.. అసలు కథ ఇదే.
ఈ కీలక మార్పునకు ప్రధానంగా మూడు కారణాలున్నాయి.

స్మార్ట్ఫోన్ల తయారీ రంగంలో భారత్ ఒక చరిత్రాత్మక ఘట్టాన్ని లిఖించింది. అమెరికాకు స్మార్ట్‌ఫోన్లను అత్యధికంగా సరఫరా చేసిన దేశంగా చైనాను వెనక్కి నెట్టి భారత్ అగ్రస్థానంలో నిలిచింది. ఈ పురోగతికి ప్రధాన కారణం ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ (Apple) చేపట్టిన వ్యూహాత్మక మార్పులే.
రీసెర్చ్ సంస్థ క్యానలిస్ (Cannalys) తాజా నివేదిక ప్రకారం.. 2025 రెండో త్రైమాసికంలో అమెరికాకు భారతీయ తయారీ స్మార్ట్‌ఫోన్‌ల సరఫరా భారీగా 240 శాతం పెరిగింది. గత ఏడాది ఇదే కాలంలో కేవలం 13 శాతంగా ఉన్న భారత వాటా, ఇప్పుడు 44 శాతానికి ఎగబాకింది. ఇది భారత తయారీ రంగం ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందో తెలియజేస్తుంది. మరి ఈ మార్పు వెనుక ఉన్న అసలు కథేంటి? చైనా వాటా ఎందుకు తగ్గింది? ఆ వివరాలు మీకోసం…
అమెరికా మార్కెట్‌లో భారత తయారీ స్మార్ట్‌ఫోన్ల దూకుడు
క్యానలిస్ (ఇప్పుడు ఒమ్డియాలో భాగం) డేటా ప్రకారం.. 2025 రెండో త్రైమాసికంలో అమెరికాకు సరఫరా అయిన మొత్తం స్మార్ట్‌ఫోన్‌లలో భారతీయ తయారీ ఫోన్ల వాటా 44 శాతానికి చేరగా, చైనా వాటా 61 శాతం నుంచి 25 శాతానికి క్షీణించింది. ఈ కీలక మార్పునకు ప్రధానంగా మూడు కారణాలున్నాయి.
- సరఫరా చైన్ మార్పులు: భౌగోళిక రాజకీయాల నేపథ్యంలో, కంపెనీలు తమ తయారీ కేంద్రాలను వికేంద్రీకరించుకుంటున్నాయి.
- వాణిజ్య ఉద్రిక్తతలు: అమెరికా, చైనా మధ్య నెలకొన్న సుదీర్ఘ వాణిజ్య యుద్ధం, టారిఫ్‌లు కంపెనీలను ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించేలా చేశాయి.
- యాపిల్ భారత్‌పై ఆధారపడటం: యాపిల్ కంపెనీ తన తయారీ సామర్థ్యాన్ని భారత్‌లో వేగంగా పెంచుకోవడం ఈ మార్పులో కీలక పాత్ర పోషించింది.
Also Read: వ్యూహాత్మక క్షిపణి “ప్రళయ్” పరీక్షలు సక్సెస్.. గురి తప్పేదే లే..
యాపిల్ వ్యూహం ఫలిస్తోంది
గత కొన్ని సంవత్సరాలుగా భారత్‌లో తయారీని విస్తరిస్తున్న యాపిల్.. ఇప్పుడు ఆ ప్రయత్నాల ఫలితాలను అందుకుంటోంది. “2025 రెండో త్రైమాసికంలో భారత్ తొలిసారిగా అమెరికాలో అమ్ముడయ్యే స్మార్ట్‌ఫోన్‌లకు ప్రముఖ తయారీ కేంద్రంగా మారింది. దీనికి ప్రధాన కారణం అమెరికా, చైనా మధ్య అనిశ్చిత వాణిజ్య వాతావరణం నెలకొనడడమే” అని క్యానలిస్ ప్రిన్సిపల్ అనలిస్టు సన్యమ్ చౌరాసియా పేర్కొన్నారు.
అమెరికా, చైనా మధ్య టారిఫ్‌లు, వాణిజ్య విధానాలపై నెలకొన్న అనిశ్చితి నేపథ్యంలో స్మార్ట్‌ఫోన్ కంపెనీలు తమ తయారీ వ్యూహాలను పునఃసమీక్షించుకుంటున్నాయి. యాపిల్ విషయంలో, iPhone 16, iPhone 15 వంటి స్టాండర్డ్ మోడళ్లను భారత్‌లో తయారు చేయడం ద్వారా ఈ మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. iPhone 16 Pro మోడళ్లను భారత్‌లో అసెంబుల్ చేయడం ఇప్పటికే ప్రారంభించారు.
ఇతర బ్రాండ్ల పరిస్థితి
యాపిల్‌తో పాటు, Samsung, Motorola వంటి ఇతర బ్రాండ్లు కూడా ఇండియాలో తయారైన ఫోన్లను అమెరికాకు పంపడం ప్రారంభించాయి. అయితే, వాటి పాత్ర యాపిల్‌తో పోలిస్తే తక్కువ స్థాయిలో ఉంది. ఉదాహరణకు, Samsung తన తయారీలో ఎక్కువ భాగాన్ని ఇప్పటికీ వియత్నాంపైనే ఆధారపడుతోంది. Motorola ఇటీవల ఇండియా నుంచి ఉత్పత్తిని పెంచినప్పటికీ, అందులో ఎక్కువ భాగం చైనాతోనే ముడిపడి ఉంది.
అమెరికా స్మార్ట్‌ఫోన్ కంపెనీలు తమ అసెంబ్లింగ్ కేంద్రాలను వివిధ దేశాల్లో విస్తరించుకునే దిశగా సాగిపోతున్నాయి. క్యానలిస్ అనలిస్టుల ప్రకారం, టారిఫ్‌లు, అస్పష్ట వాణిజ్య నియమాల భయంతో కంపెనీలు ముందస్తుగా స్టాక్‌ని నిల్వ చేసుకోవడంతో పాటు, సరఫరా ప్రణాళికల్లో వేగంగా మార్పులు చేస్తున్నాయి.