Pralay: వ్యూహాత్మక క్షిపణి “ప్రళయ్” పరీక్షలు సక్సెస్.. గురి తప్పేదే లే..
క్షిపణి ఆధునిక సాంకేతికతతో పనిచేస్తుంది. డీఆర్‌డీఓ, సాయుధ దళాలు, ఇందులో భాగస్వామ్యమైనవారికి రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అభినందనలు తెలిపారు.

నూతనంగా అభివృద్ధి చేసిన వ్యూహాత్మక క్షిపణి ప్రళయ్‌ను భారత్ విజయవంతంగా పరీక్షించింది. ఒడిశా తీరంలోని ఏపీజే అబ్దుల్ కలామ్ ద్వీపం నుంచి సోమవారం, మంగళవారం ఈ క్షిపణిని ప్రయోగించారని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది.
ప్రళయ్ స్వల్ప శ్రేణి సర్వీస్-టు-సర్వీస్ క్షిపణి. 500 నుంచి 1,000 కిలోగ్రాముల మధ్య పేలోడ్ సామర్థ్యం ఉంటుంది. కన్వెన్షనల్ వార్‌హెడ్‌ను మోసే సామర్థ్యం ఉండే ఈ క్షిపణి పరిధి 150 నుంచి 500 కిలోమీటర్ల వరకు ఉంటుంది. దీన్ని డీఆర్‌డీఓ అభివృద్ధి చేసింది.
ఈ క్షిపణి ఆధునిక సాంకేతికతతో పనిచేస్తుంది. డీఆర్‌డీఓ, సాయుధ దళాలు, ఇందులో భాగస్వామ్యమైనవారికి రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అభినందనలు తెలిపారు. యూజర్ ఈవాల్యుయేషన్ ట్రయల్స్ లో భాగంగా గరిష్ఠ, కనిష్ఠ పరిధిని పరీక్షించేందుకు ఈ ప్రయోగాలు నిర్వహించారని రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
లక్ష్యంగా నిర్దేశించిన మార్గాన్ని క్షిపణులు కచ్చితమైన రీతిలో ఫాలో అయ్యాయి. అన్ని పరీక్షలను విజయవంతంగా పూర్తి చేశాయి. అన్ని సబ్‌సిస్టములు ఆశించిన విధంగానే పనిచేశాయి. షిప్ పై ఏర్పాటు చేసిన పరికరాలు సహా అనేక ట్రాకింగ్ సెన్సార్లతో పరీక్షా డేటాను పరిశీలించారు.
ప్రళయ్ దేశీయంగా అభివృద్ధి చేసిన ఇంధన క్వాసీ-బాలిస్టిక్ క్షిపణి. అత్యాధునిక గైడెన్స్, నావిగేషన్ సాంకేతికతతో దీన్ని అభివృద్ధి చేశారు. ఈ వ్యవస్థను రీసర్చ్ సెంటర్ ఇమారత్ తయారు చేసింది.
అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ ల్యాబొరేటరీ, ఆర్మమెంట్ రీసర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్, హై ఎనర్జీ మెటీరియల్స్ రీసర్చ్ ల్యాబొరేటరీ, డిఫెన్స్ మెటలర్జికల్ రీసర్చ్ ల్యాబొరేటరీ, టెర్మినల్ బాలిస్టిక్స్ రీసర్చ్ ల్యాబొరేటరీ, రీసర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్ (ఇంజినీర్లు) కలసి దీన్ని అభివృద్ధి చేశారు. మల్టీ ఎంఎస్ఎంఈలు, భారత్ డైనామిక్స్ లిమిటెడ్, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ఈ ప్రాజెక్టులో భాగస్వామ్యం పంచుకున్నాయి.