Llama 4 AI Models : చాట్‌జీపీటీ, డీప్‌సీక్ కాస్కోండి.. ఏఐ రేసులో మెటా పవర్‌ఫుల్ ‘Llama 4’ ఏఐ మోడల్స్.. డౌన్‌లోడ్ చేసుకోండిలా!
Llama 4 AI Models : మెటా కంపెనీ లామా 4 స్కౌట్, లామా 4 మావెరిక్ అనే 2 కొత్త లామా ఏఐ మోడల్స్ ప్రవేశపెట్టింది. వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్, మెసెంజర్ వంటి చాట్‌బాట్ సర్వీసులకు అందుబాటులో ఉంటుంది. డౌన్‌లోడ్ చేసుకోవాలంటే?

Llama 4 AI Models
Llama 4 AI Models : ఏఐ టెక్నాలజీ వేగంగా అభివృద్ధి చెందుతోంది. టెక్ కంపెనీలు పోటీపడి ఏఐ టెక్నాలజీ సరికొత్త మోడల్స్ క్రియేట్ చేస్తున్నాయి. ఇప్పటికే ఓపెన్ఏఐ చాట్‌జీపీటీ ఏఐ టెక్నాలజీతో సంచలనాలు సృష్టించగా, గూగుల్ సొంత ఏఐ జెమ్మీ కూడా అదే స్థాయిలో దూసుకెళ్లింది. ఈ రెండింటికి డీప్ సీక్ కూడా వచ్చి ప్రభంజనం సృష్టించింది. ఇప్పుడు వీటిన్నింటికి పోటీగా మెటా దిగ్గజం నుంచి సరికొత్త ఓపెన్-వెయిట్ ఏఐ లామా మోడల్స్ వచ్చేశాయి.
ఈ ఏఐ మోడల్స్ సిరీస్ లామా 4ను మెటా ప్రవేశపెట్టింది. ఇప్పుడు వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్, మెసెంజర్ వంటి సర్వీసులలో మెటా ఏఐ మరింత అడ్వాన్స్ అవుతుంది. ఈ యాప్‌లలో చాట్‌బాట్ పర్ఫార్మెన్స్ మరింత మెరుగుపరిచేందుకు ఈ లామా ఏఐ మోడల్స్ కీలకంగా మారనున్నాయి.
ఈ 2 కొత్త మోడల్స్ లామా 4 స్కౌట్, లామా 4 మావెరిక్, మెటా అధికారిక లామా వెబ్‌సైట్, హగ్గింగ్ ఫేస్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇతర లామా 4 మోడళ్లకు ట్రైనింగ్ ఇచ్చేందుకు రూపొందించిన టీచర్ మోడల్ లామా 4 బెహెమోత్‌ను కూడా కంపెనీ రివీల్ చేసింది.
మెటా లామా మల్టీమోడల్ ఏఐ సిస్టమ్.. ఈ సిస్టమ్ టెక్స్ట్, వీడియో, ఫొటోలు, ఆడియో మొదలైన వాటితో సహా వివిధ డేటాను ప్రాసెస్ చేయగలదు. అలాగే కంటెంట్ అనేక ఫార్మాట్లలోకి మార్చగలదు. ఓపెన్-వెయిట్ ఏఐ మోడల్స్ క్లౌడ్ ఏపీఐలపై ఆధారపడకుండా స్థానికంగా రన్ చేసేందుకు అనుమతిస్తాయి.
ఎలాంటి మార్పులు లేదా వాణిజ్య వినియోగంపై లైసెన్సింగ్ పరిమితులు ఇప్పటికీ పొందవచ్చు. లామా 4 స్కౌట్, లామా 4 మావెరిక్ అత్యంత అడ్వాన్స్ మోడల్స్ అని మార్క్ జుకర్‌బర్గ్ అన్నారు. ఈ రెండు మోడళ్లు ఓపెన్ సోర్స్ సాఫ్ట్‌వేర్ అని చెప్పారు. మెటా ఏఐ మోడళ్ల గురించి కూడా ఆయన అనేక విషయాలను ప్రస్తావించారు.
లామా 4 AI మోడల్స్ :
మెటా లామా 4 ఇప్పటివరకు అత్యంత అడ్వాన్స్‌డ్ ఏఐ మోడల్స్ సెట్‌గా అభివర్ణించింది. లామా ఎకో ఫ్రెండ్లీగా రూపొందింది. ఈ మోడల్‌లు డెవలపర్‌లు, బిజినెస్ ఆధారిత మల్టీమోడల్ AI-ఆధారిత మోడల్స్ లక్ష్యంగా పెట్టుకున్నాయి.
లామా 4 స్కౌట్, లామా 4 మావెరిక్ అనేవి మెటా మొట్టమొదటి ఓపెన్-వెయిట్ ఏఐ మోడల్స్ అని చెప్పవచ్చు. స్థానికంగా మల్టీమోడల్, ఏఐ డ్రైవెన్ (MoE) ఆర్కిటెక్చర్‌పై రూపొందాయి. ప్రతి మోడల్ ఎలా పనిచేస్తుంది? వాటితో కలిగే ప్రయోజనాలేంటి? అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
లామా 4 స్కౌట్ (Scout) :
లామా 4 స్కౌట్ 17 బిలియన్ యాక్టివ్ పారామీటర్లు, 16 ఎక్స్‌పర్ట్స్ ఉపయోగించి స్మాల్ మోడల్‌గా రూపొందింది. 10 మిలియన్ టోకెన్‌ల వరకు కాంటెక్స్ట్ విండోకు సపోర్టు ఇస్తుంది. సింగిల్ నివిడియా (Nvidia H100) GPU (గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్)పై రన్ అవుతుంది. మెటా ప్రకారం.. వివిధ బెంచ్‌మార్క్ టెస్టులలో స్కౌట్ గూగుల్ Gemma 3, Gemini 2.0 ఫ్లాష్ లైట్, మిస్ట్రల్ 3.1 కన్నా వేగంగా వర్క్ చేస్తుంది.
లామా 4 మావెరిక్ (Maverick) :
ఇందులో మావెరిక్ అత్యంత అడ్వాన్స్‌డ్ మోడల్. ఓపెన్ఏఐ GPT-4o, జెమిని 2.0 ఫ్లాష్‌లకు గట్టి పోటీనిస్తోంది. మావెరిక్ అనేక బెంచ్‌మార్క్‌లలో ఈ మోడళ్ల కన్నా అద్భుతంగా వర్క్ అవుతుంది. రీజినింగ్, కోడింగ్ టాస్కులలో డీప్‌సీక్ v3కి పోటీ ఇవ్వగలదని మెటా పేర్కొంది. ఇవన్నీ సగం కన్నా తక్కువ యాక్టివ్ పారామీటర్లను ఉపయోగిస్తున్నాయి. 17 బిలియన్ యాక్టివ్ పారామీటర్లు, 128 ఎక్స్‌పర్ట్స్ ఉపయోగించి లామా 4 మావెరిక్ సింగిల్ (Nvidia H100) హోస్ట్‌పై రన్ అయ్యేలా ఆప్టిమైజ్ చేసినట్టు మెటా చెబుతోంది.
లామా 4 బెహెమోత్ (Behemoth) :
లామా 4 బెహెమోత్ మోడల్ టీచర్ మోడల్‌గా వర్క్ చేస్తుంది. లామా 4 ఫ్యామిలీలో అత్యంత పవర్‌ఫుల్ వేరియంట్. ఈ మల్టీమోడల్ MoE మోడల్ 288 బిలియన్ యాక్టివ్ పారామీటర్లను కలిగి ఉంది. 16 మంది ఎక్స్‌పర్ట్స్‌తో వర్క్ అవుతుంది. దాదాపు 2 ట్రిలియన్ మొత్తం పారామీటర్లను కలిగి ఉంది.
మెటా ప్రకారం.. మ్యాథ్స్, మల్టీలాంగ్వేజీ ప్రాసెసింగ్, ఇమేజ్-రిలేటెడ్ టాస్కులలో నాన్-రీజనింగ్ మోడల్‌లలో అత్యుత్తమ పర్ఫార్మెన్స్ అందిస్తుంది. చిన్నపాటి మోడల్స్‌కు ట్రైనింగ్ ఇచ్చేందుకు వీలుగా ఉంటుంది. ఇంకా ట్రైనింగ్ పొందుతున్నప్పటికీ, అనేక STEM-సెంట్రలైజడ్ ఎవల్యూషన్లలో లామా 4 బెహెమోత్ ఓపెన్ఏఐ GPT-4.5, క్లాడ్ సోనెట్ 3.7, గూగుల్ జెమిని 2.0 ప్రో కన్నా మెరుగైనదని మెటా కంపెనీ స్పష్టంచేసింది.
లామా 4 ఏఐ మోడల్స్ డౌన్‌లోడ్ :
లామా 4 స్కౌట్, లామా 4 మావెరిక్ మెటా అధికారిక లామా పేజీ, హగ్గింగ్ ఫేస్‌లో డౌన్‌లోడ్ చేసేందుకు అందుబాటులో ఉన్నాయి. లామా 4 ఆధారిత మెటా ఏఐ వాట్సాప్, మెసెంజర్, ఇన్‌స్టాగ్రామ్ డైరెక్ట్, వెబ్ ప్లాట్‌ఫామ్‌లలో కూడా త్వరలో అందుబాటులోకి రానుంది.
మెటా ఏఐ కోసం మరిన్ని ప్రణాళికలు :
మెటా ఏఐ మరిన్ని ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. ఈ ఏడాదిలో 65 బిలియన్ డాలర్ల మొత్తాన్ని పెట్టుబడి పెట్టబోతోంది. మార్క్ జుకర్‌బర్గ్ స్వయంగా రెండు రాబోయే లామా మోడళ్ల గురించి ముందుగానే సమాచారం ఇచ్చారు.