Laptops-Phone Prices : కొత్త ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు చౌకగా దొరుకుతాయా? 2030 వరకూ ఆగాల్సిందేనా… అసలు నిజం ఇదే!
Laptops-Phone Prices : స్మార్ట్ఫోన్లు, ల్యాప్‌టాప్ ధరలు తగ్గుతాయని ఆశగా ఎదురుచూస్తున్నారా? అయితే, మీరు 20230 వరకు ఆగాల్సిందే.. ఆ తర్వాత కూడా ధరలు తగ్గుతాయనే గ్యారెంటీ లేదు..
Laptops-Phone Prices
- ఎక్స్‌బాక్స్ కన్సోల్ ధరలు పెంచనున్న మైక్రోసాఫ్ట్
- ఐప్యాడ్, మ్యాక్, మ్యాక్‌బుక్, హోం అప్లియన్సెస్ ధరల పెంపు
- 2029 నుంచి 2030 వరకు మెమరీ ఖర్చుల ఒత్తిడి కొనసాగొచ్చు
- ఎలక్ట్రానిక్ పరికరాల ధరలు తగ్గడం కన్నా మరింత పెరగొచ్చు
Laptops-Phone Prices : స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్ లేదా టాబ్లెట్ చౌకగా దొరికితే కొందామని చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే.. పలు కంపెనీలు తమ ప్రొడక్టుల ధరలు భారీగా పెంచేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఫోన్, ల్యాప్ టాప్ వంటి ఎలక్ట్రానిక్స్ వస్తువులు కొనకపోవడమే బెటర్ అని అనుకుంటున్నారా? కొన్నాళ్లు ఆగితే ధరలు అన్నీ దిగి వస్తాయని భావిస్తున్నారా? ప్రస్తుత పరిణామాలను పరిశీలిస్తే అందుకు పూర్తి భిన్నమైన సంకేతాలు ఇస్తున్నాయి.
ప్రపంచ మెమరీ దిగ్గజాలు లాంగ్ టైమ్ డీల్స్ భాగంగా DRAM, NAND చిప్‌ల ధరలను 2030 వరకు స్థిరంగా (Laptops-Phone Prices) ఉంచే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కానీ, వినియోగదారుల ఎలక్ట్రానిక్స్ ధరలు త్వరలో తగ్గే అవకాశాలు చాలా స్వల్పంగా కనిపిస్తున్నాయి.
ఏఐ డేటా సెంటర్ల కోసం హై-బ్యాండ్‌విడ్త్ మెమరీ (HBM)కు విపరీతమైన డిమాండ్ రావడంతో సాధారణ ఫోన్లు, ల్యాప్‌టాప్ కోసం వాడే మెమరీ సరఫరా భారీగా తగ్గిపోయింది. దీని ప్రభావం ఇప్పటికే మార్కెట్లో స్పష్టంగా కనిపిస్తోంది.
ఆగస్టు నుంచి కొత్త ధరలు :
ఆపిల్ ఇప్పటికే మ్యాక్బుక్లు, ఐప్యాడ్లు, ఇతర ప్రొడక్టుల ధరలను భారీగా పెంచగా, మైక్రోసాఫ్ట్ కూడా ఎక్స్‌బాక్స్ కన్సోల్‌ల ధరలను పెంచనున్నట్లు ప్రకటించింది. ఆగస్టు 1 నుంచి అమలులోకి వచ్చేలా ఎక్స్‌బాక్స్ కన్సోల్ ధరలు 512GB మోడళ్లకు 100 డాలర్లు, 1TB మోడళ్లకు 150 డాలర్ల మేర పెరుగుతాయని ఆ కంపెనీ గేమింగ్ విభాగం ప్రకటించింది. అదే సమయంలో ఆ కంపెనీ 2TB వేరియంట్‌ను పూర్తిగా నిలిపివేసింది.
ఆపిల్ సీఈఓ టిమ్ కుక్ అన్నంత పని చేసింది. ఆపిల్ ప్రొడక్టుల ధరలు అమాంతం పెరిగిపోయాయి. జూన్ 25న ఆపిల్ సంస్థ ఐప్యాడ్లు, మ్యాక్‌లు, మ్యాక్బుక్లు, హోం అప్లియన్సెస్ ప్రొడక్టుల ధరలను అధికారికంగా పెంచింది. విశ్లేషకుడు మింగ్-చి కువో ప్రకారం.. ఆపిల్ ఏడాదికి సుమారు 247 మిలియన్ల ఐఫోన్లను రవాణా చేస్తుంది. ప్రపంచ స్మార్ట్‌ఫోన్ మెమరీ డిమాండ్‌లో అంచనా ప్రకారం 20 శాతం నుంచి 25 శాతం వాటా ఉంది.
ఆపిల్ ప్రొడక్టులపై ధరలు రెట్టింపు :
భారత మార్కెట్లో కొన్ని హై-ఎండ్ మ్యాక్‌బుక్ ప్రో మోడళ్ల ధరలు రూ. లక్ష వరకు పెరిగాయి. బేస్ ఐప్యాడ్ ధర రూ. 34,990 నుంచి రూ. 49,990కి చేరింది. హోం అప్లియన్సెస్ ప్రొడక్టుల్లో అత్యంత భారీ నిష్పత్తి పెరుగుదల కనిపించింది. ముఖ్యంగా ఆపిల్ టీవీ 4K ధరలు అన్ని వేరియంట్లలో దాదాపు రెట్టింపు అయ్యాయి.
వన్‌ప్లస్, వివో, శాంసంగ్, నథింగ్ వంటి కంపెనీలు సైతం ఫోన్ల ధరలను భారీగా సవరించాయి. విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం.. 2027 నాటికి ఈ ఫోన్ ధరల పెంపు పరిస్థితి కొంత మెరుగుపడవచ్చని గతంలో భావించగా ఇప్పుడు 2029 నుంచి 2030 వరకు కూడా మెమరీ ఖర్చుల ఒత్తిడి అంతే కొనసాగవచ్చని అంచనా వేస్తున్నారు.
కొనుగోలుదారులు ఇప్పుడు ఏం చేయాలి? :
మీ ఫోన్ లేదా ల్యాప్‌టాప్ అత్యవసరంగా కొనాలని చూస్తుంటే ధరలు తగ్గుతాయనే ఆశతో ఏళ్ల తరబడి ఎదురుచూడటంలో ఎలాంటి ప్రయోజనం ఉండదు. అంతేకానీ 2030లో చౌకగా లభిస్తాయంటే అలాంటి పరిస్థితి మాత్రం కనిపించడం లేదు. పరిస్థితులను పరిశీలిస్తే.. రాబోయే ఏళ్లలో ఎలక్ట్రానిక్ పరికరాల ధరలు తగ్గడం కన్నా మరింత పెరిగే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.
