WhatsApp Web : సిమ్ బైండింగ్ ఎఫెక్ట్.. మీ వాట్సాప్ వెబ్ అదేపనిగా లాగౌట్ అవుతుందా? అసలు రీజన్ ఏంటి? ఎలా ఫిక్స్ చేయాలంటే?
WhatsApp Web : మార్చి 1 నుంచి సిమ్ బైండింగ్ విధానం అమల్లోకి వచ్చేసింది. ఇప్పటినుంచి మీరు వాట్సాప్ వెబ్ ప్రైమరీ సిమ్ లేకుండా వాడితే వెంటనే లాగౌట్ అయిపోయింది.. ఈ సమస్యను ఎలా ఫిక్స్ చేయాలంటే?
WhatsApp Web
- మార్చి 1 నుంచి కొత్త టెలికం సైబర్ సెక్యూరిటీ రూల్స్ అమల్లోకి
- వాట్సాప్ వెబ్ యాక్సస్ చేయాలంటే సిమ్ బైండింగ్ రూల్ తప్పనిసరి
- సైబర్ మోసాలకు చెక్ పెట్టడం, జాతీయ భదత్ర కోసమే ఈ కొత్త విధానం
WhatsApp Web : వాట్సాప్ యూజర్లకు బిగ్ బ్రేకింగ్ న్యూస్.. మీ వాట్సాప్ వెబ్ పనిచేయడం లేదా? లింక్ చేసిన కొన్నిగంటల్లోనే మళ్లీ ఆటో లాగౌట్ అవుతుందా? అయితే, డోంట్ వర్రీ, ఇష్యూ మీ దగ్గర కాదు.. వాట్సాప్ సిమ్ బైండింగ్ సిస్టమ్ కారణంగా అలా జరుగుతుంది. మీ వాట్సాప్ వెబ్ ఒక్కసారిగా ప్రతి కొన్ని గంటలకు ఆటో లాగ్ అవుట్ అయిపోతుంది.
మార్చి 1, 2026 (ఈరోజు) నుంచి భారత ప్రభుత్వం టెలికాం సైబర్ సెక్యూరిటీ (TCS) నియమాలు, 2024 ప్రకారం వాట్సాప్ యూజర్లకు సిమ్ బైండింగ్‌ను తప్పనిసరి చేసింది. ఒక్కమాటలో చెప్పాలంటే.. మీ వాట్సాప్ అకౌంట్ ఇప్పుడు మీ ప్రైమరీ ఫోన్లోని ఫిజికల్ సిమ్ కార్డ్‌కి లింక్ చేసి ఉండాలి. సిమ్ రిమూవ్ చేస్తే వాట్సాప్ లింకింగ్ ఆప్షన్ నిలిచిపోతుంది.
సిమ్ బైండింగ్ అంటే ఏంటి? :
ప్రపంచవ్యాప్తంగా వాట్సాప్ ‘Verify Once’ సిస్టమ్‌పై వర్క్ చేస్తుంది. మీ నంబర్‌ను ఎంటర్ చేసి OTP అందుకుంటారు. ఒకసారి వెరిఫై చేసిన తర్వాత మీరు అన్ని డివైజ్‌లలో యాప్‌ను ఉచితంగా ఉపయోగించవచ్చు. మీరు తర్వాత సిమ్ బయటకు తీసినా వాట్సాప్ వెబ్, డెస్క్‌టాప్‌లతో సహా రన్ అవుతూనే ఉంటుంది.
టెలికమ్యూనికేషన్స్ విభాగం (DoT)కింద కొత్త రూల్ ప్రవేశపెట్టింది. రిజిస్టర్డ్ సిమ్ కార్డ్ మీ ఫోన్లో ఫిజికల్‌గా ఉందో లేదో వాట్సాప్ కాలానుగుణంగా చెక్ చేస్తుంది. ఈ వెరిఫికేషన్ దాదాపు ప్రతి 6 గంటలకు జరుగుతుందని నివేదికలు సూచిస్తున్నాయి. ఫోన్ నుంచి సిమ్ కార్డు తీసినా లేదా మరో సిమ్ రిప్లేస్ చేసినా ఇన్ యాక్టివ్ ఉన్నా అసలు సిమ్ కార్డును తిరిగి వెరిఫై చేసే వరకు మీ వాట్సాప్ అకౌంట్ పనిచేయదు.
ఈ సిమ్ బైండింగ్ రూల్ ఎందుకంటే? :
కేంద్ర మంత్రిత్వ శాఖ ప్రకారం.. జాతీయ భద్రతా సమస్యలు, సైబర్ మోసం కేసుల పెరుగుదలతో స్కామర్లు తరచుగా భారతీయ నంబర్‌ను ఉపయోగించి వాట్సాప్ అకౌంట్లను ఒకసారి యాక్టివేట్ చేయగలరు. ఆపై వాట్సాప్ రిమోట్‌గా ఆపరేట్ చేయగలరు. కొన్నిసార్లు దేశం వెలుపల నుంచి కూడా స్కామర్లు వాట్సాప్ హ్యాక్ చేస్తారని అధికారులు హెచ్చరిస్తున్నారు. దీని కారణంగా సైబర్ నేరగాళ్లను గుర్తించడం కష్టమవుతుంది.
అందుకే, ప్రతి యాక్టివ్ అకౌంట్ కేవైసీ వెరిఫైడ్ సిమ్‌తో డివైజ్‌లో ఫిజికల్‌గా ఇంటిగ్రేట్ అయి ఉండాలి. తద్వారా ట్రేసింగ్ సామర్థ్యం మెరుగుపడుతుందని అధికారులు విశ్వసిస్తున్నారు. ప్రభుత్వ డేటా ప్రకారం.. 2024లోనే సైబర్ మోసాల కారణంగా రూ. 22,800 కోట్ల నష్టం వాటిల్లింది. ఈ క్రమంలోనే సిమ్ బైండింగ్ రూల్ అందుబాటులోకి వచ్చింది.
మార్చి 1 నుంచి సిమ్ బైండింగ్ మార్పులివే :
ప్రతిసారి సిమ్ వెరిఫికేషన్ తప్పనిసరి కానుంది. మీ సిమ్ ఇప్పటికీ మీ ప్రైమరీ ఫోన్లో ఉందో లేదో ప్రతి కొన్ని గంటలకు వాట్సాప్ చెక్ చేస్తుంది. లేదంటే మీరు వాట్సాప్ యాక్సెస్ పరిమితంగానే ఉంటుంది. వాట్సాప్ వెబ్, డెస్క్‌టాప్ యూజర్లకు ఈ సమస్య ఎక్కువగా వస్తుంటుంది. లాగిన్ సెషన్లు వెంటవెంటనే ఆటో-లాగ్ అవుట్ అయ్యే అవకాశం ఉంది.
మీరు యాక్టివ్ సిమ్ ఉన్న ప్రైమరీ ఫోన్ ఉపయోగించి తిరిగి అథెంటికేట్ చేయాల్సి ఉంటుంది. కంపానియన్ మోడ్, లింక్ చేసిన డివైజ్ ఫీచర్లు, ముఖ్యంగా Wi-Fi-ఓన్లీ టాబ్లెట్లు లేదా సిమ్ కార్డులు లేని సెకండరీ ఫోన్లలో ఈ లాగౌట్ సమస్య ఎక్కువగా వస్తుంటుంది. ఆండ్రాయిడ్‌లోని బీటా వెర్షన్లలో ఈ సిస్టమ్ టెస్టింగ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. వాట్సాప్ కంట్రోలింగ్ కోసం సిమ్ వెరిఫికేషన్ తప్పనిసరిగా పేర్కొంటూ ఇప్పటికే యాప్‌లో మెసేజ్ వస్తుందని యూజర్లు చెబుతున్నారు.
లాగౌట్ ఇష్యూను ఎలా నివారించాలి :
మీ ప్రైమరీ ఫోన్లో ప్రస్తుత సిమ్‌తో మీ వాట్సాప్ అకౌంట్ మ్యాచ్ అవుతుందో లేదో చెక్ చేయండి. మీరు ఇటీవలే మొబైల్ నంబర్ మార్చుకుంటే మీ రిజిస్ట్రేషన్‌ను ఒకటికి రెండుసార్లు చెక్ చేయండి. యాప్‌ను అప్డేట్ చేయండి. ఆఫీస్ వర్క్ కోసం వాట్సాప్ వెబ్ ఎక్కువగా వాడితే మీ ప్రైమరీ ఫోన్ పక్కనే ఉంచుకోండి.
