BRS Party: స్వతంత్రులు, చిన్న పార్టీల నేతలపై ఫోకస్ పెట్టిన గులాబీ పార్టీ

ప్రతిపక్ష పార్టీల నుంచి రెబెల్స్‌గా బరిలో ఉన్న అభ్యర్థుల వల్ల తమకు ఎక్కడ లాభం జరుగుతుందో క్షేత్రస్థాయిలో పరిశీలన జరుపుతోంది గులాబీ పార్టీ.

BRS Party: స్వతంత్రులు, చిన్న పార్టీల నేతలపై ఫోకస్ పెట్టిన గులాబీ పార్టీ

telangana assembly elections 2023 brs party focus on rebel candidates

Telangana Assembly Elections 2023: తెలంగాణలో నామినేషన్లకు గడువు ముగియడంతో నియోజకవర్గాల వారీగా పోటీ చేస్తున్న అభ్యర్థులపై ఆరా తీస్తోంది బీఆర్‌ఎస్. పార్టీ నేతలు రెబల్స్‌గా మారిన స్థానాలతోపాటు ప్రభుత్వంపై నిరసన తెలిపేందుకు నామినేషన్లు వేసిన నియోజకవర్గాలపై దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలో ఆయా సెగ్మెంట్లలో పార్టీ అభ్యర్థుల బలాబలాలతో పాటు స్వతంత్రులు, చిన్న పార్టీల నేతలపై ఫోకస్ పెట్టింది గులాబీ పార్టీ. అవసరమున్న చోట స్వతంత్రులకు సహకారం అందించడంతోపాటు రెబల్స్‌ను బుజ్జగించి తమ దారిలోకి తెచ్చుకునేందుకు కార్యాచరణ రూపొందిస్తోంది.

అసెంబ్లీ ఎన్నికల్లో తొలి ఘట్టమైన నామినేషన్ల దాఖలు ప్రక్రియ పూర్తయిది. ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులతో పాటు, స్వతంత్రులు రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలు చేశారు. మరోవైపు ప్రధాన పార్టీల నుంచి టిక్కెట్లు ఆశించి దక్కని నేతలు కూడా తమ బలం నిరూపించుకోవాలని రంగంలో నిలిచారు. మరికొందరు ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ కొన్ని స్థానాల్లో పెద్ద ఎత్తున నామినేషన్లు వేశారు.

మంత్రులకు స్వతంత్ర అభ్యర్థుల టెన్షన్
రాష్ట్రవ్యాప్తంగా 119 నియోజకవర్గాలకు గాను 4 వేల 798 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఒక్క గజ్వేల్‌లోనే 150కిపైగా నామినేషన్లు దాఖలయ్యాయి. కేసీఆర్ ఈసారి కామారెడ్డిలో కూడా పోటీ చేస్తుండటంతో అక్కడ కూడా ప్రభుత్వ తీరును నిరసిస్తూ పెద్ద ఎత్తున నామినేషన్లు వేశారు. ఇక మంత్రి మల్లారెడ్డి పోటీ చేస్తున్న మేడ్చల్‌లో కూడా ఎక్కువ మంది అభ్యర్థులు రంగంలో నిలిచారు. మరో మంత్రి జగదీశ్రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న సూర్యాపేటలో ఆయనతో విభేదించిన ఓ బీసీ నేత మరో పార్టీ నుంచి నామినేషన్ వేశారు. ఇలా మంత్రులు పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో గులాబీ పార్టీకి స్వతంత్ర అభ్యర్థుల టెన్షన్ పట్టుకుంది.

అసంతృప్తుల నామినేషన్లు
రాష్ట్రంలోని ప్రధాన పార్టీల నుంచి టిక్కెట్లు ఆశించిన చాలా మంది అసంతృప్తులు ఎన్నికల బరిలోకి దిగేందుకు నామినేషన్లు వేశారు. అయితే నియోజకవర్గాల వారీగా క్యాండిడేట్స్ వివరాలు సేకరించిన గులాబీ నేతలు.. తాము విజయం సాధించేందుకు కలిసి వచ్చే అంశాలను బేరీజు వేసుకుంటున్నారు. ఈ సమయంలో తమకు ఇబ్బంది కలిగించేలా ఉన్న స్వతంత్ర అభ్యర్థులను ఒప్పించి పోటీ నుంచి తప్పించేలా ప్లాన్ చేస్తున్నారు. ఇదే సమయంలో ప్రతిపక్ష పార్టీల నుంచి రెబెల్స్‌గా బరిలో ఉన్న అభ్యర్థుల వల్ల తమకు ఎక్కడ లాభం జరుగుతుందో క్షేత్రస్థాయిలో పరిశీలన జరుపుతోంది గులాబీ పార్టీ. ఇలాంటి స్థానాల్లో సదరు రెబల్స్‌కు సహకారం అందించడం ద్వారా బీఆర్‌ఎస్‌కు లబ్ధి చేకూరేలా వ్యూహం రచిస్తోంది.

Also Read: ఏపీలో మాదిరి తెలంగాణలోనూ అధికారం కోసం కోడికత్తి వ్యూహం- రేవంత్ రెడ్డి సంచలనం

సోమవారం నామినేషన్ల పరిశీలన సందర్భంగా చాలా మంది స్వతంత్ర అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరణకు గురయ్యే అవకాశముందని బీఆర్‌ఎస్ అంచనా వేస్తోంది. ఆ తర్వాత బరిలో మిగిలే అభ్యర్థుల్లో బీఆర్‌ఎస్ రెబల్స్‌ను బుజ్జగించి దారికి తెచ్చుకునేందుకు అధికార పార్టీ ఇప్పటికే ప్రణాళిక సిద్ధం చేసినట్లు సమాచారం.