ఈ పథకం కింద 10 వేల ఇళ్లు.. ఒక్కో ఇంటికి రూ.లక్షా 20 వేలు
ఈ వివరాలు హౌసింగ్ అధికారుల సర్వేలో తేలాయి.

తెలంగాణలో అత్యంత వెనకబడిన గిరిజనుల (పీవీటీ)కు ప్రధానమంత్రి జంజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ (పీఎం జన్మన్) కింద కేంద్ర సర్కారు 10 వేల ఇళ్లను మంజూరు చేయనుంది. పది జిల్లాల్లోని 548 గ్రామాల్లో 63,194 మంది తెలంగాణలో అత్యంత వెనకబడిన గిరిజనులు ఉన్నారు.
వారిలో 13,151 మందికి ఇళ్లు లేవు. వీరిలో 10,049 మందికి సొంత భూమి ఉంది. ఈ వివరాలు హౌసింగ్ అధికారుల సర్వేలో తేలాయి. అత్యంత వెనకబడిన గిరిజనులు ఆదిలాబాద్ జిల్లాలో (6,039 మంది) ఉన్నారు. నల్గొండ జిల్లాలో అత్యల్పంగా (81 మంది) ఉన్నారు. వీరి వివరాలను ట్రైబల్ డిపార్ట్మెంట్ నుంచి హౌసింగ్ డిపార్ట్మెంట్ తీసుకోనుంది.
అనంతరం ఆ వివరాలను కేంద్ర సర్కారుకి పంపుతారు. పీఎం ఆవాస్ యోజన స్కీం కింద గ్రామీణ ప్రాంతాల్లో ఒక్కో ఇంటికి కేంద్ర సర్కారు రూ.72 వేలు, పీఎం జన్మన్ కింద పీవీటీలకు ఒక్కో ఇంటికి రూ.లక్షా 20 వేలు ఇవ్వనుంది. ఇందిరమ్మ ఇళ్ల పథకంలో తెలంగాణ సర్కారు 100 శాతం సబ్సిడీ తో రూ.5 లక్షలు ఇస్తోంది.
ట్రైబల్స్‌కు కేంద్ర సర్కారు ఇచ్చే సాయాన్ని మినహాయించి రూ.3 లక్షల 80 వేలను తెలంగాణ సర్కారు ఇవ్వనుంది. ఐటీడీఏ పరిధిలో ఒక్కో పీవోకు 5 వేల ఇళ్లు మంజూరు చేయాలని హౌసింగ్ సెక్రటరీ జ్యోతి బుద్ధ ప్రకాశ్, హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ వీపీ గౌతంను తెలంగాణ మంత్రి సీతక్క కోరారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని జిల్లాల్లో కలెక్టర్లు పర్యవేక్షిస్తున్నారు. ఐటీడీఏ పరిధిలో ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారులకు అప్పజెప్పాలని మంత్రి సీతక్క అన్నారు.
ఇళ్ల కోసం వచ్చిన అప్లికేషన్ల వివరాలను ఐటీడీఏ పీవోలకు పంపి అర్హులను గుర్తించాలని సూచించారు. ఐటీడీఏ పరిధిలో ఇంకా చాలా మంది ట్రైబల్స్ గుడెసెల్లోనే ఉంటున్నారని చెప్పారు. వారికి తొలి ప్రాధాన్యతలో ఇళ్లు ఇవ్వాలని అన్నారు. సీతక్క ప్రతిపాదనపై త్వరలోనే పీవోలకు ఉత్తర్వులిస్తామని హౌసింగ్ అధికారులు చెప్పారు.