బంద్ ఎఫెక్ట్: రోడ్డెక్కని 50వేల క్యాబ్‌లు

ఆర్టీసీ సమ్మె 15వ రోజుకు చేరుకుంది. టీఎస్ఆర్టీసీ బందుకు ఆటోలు, క్యాబ్‌లు సంయుక్తంగా మద్ధతు తెలియజేయడంతో శనివారంతెలంగాణ రోడ్ల పైకి 50వేల క్యాబ్‌లు విశ్రాంతిలో ఉండిపోయాయి. అక్టోబరు 5 నాటి నుంచి ఆర్టీసీ కార్మికులు సమ్మెకు పిలుపునివ్వగా హైదరాబాద్‌తో పాటు 32జిల్లాల్లో వాతావరణం వేడెక్కింది.
ఆర్టీసీ సమ్మెతో ఆటోలు, క్యాబ్‌లు ఛార్జిలు పెంచి ప్రయాణికుల నుంచి దండుకున్నాయి. కాగా, సమ్మె 15వ రోజుకు చేరిన సమయంలో ఓలా, యూబర్ క్యాబ్‌లు సైతం ట్రాన్స్ పోర్ట్ యూనియన్ 12 గంటల బంద్ కు పిలపునిచ్చాయి. శనివారం ఉదయం 5గంటల నుంచి బంద్ తో తెలంగాణ రోడ్లపైకి దాదాపు 50వేలకు పైగా క్యాబ్ లు రాలేదు.
హైదరాబాద్ లో ఉన్న పెద్ద బస్ స్టేషన్ అయిన మహాత్మాగాంధీ బస్ స్టేషన్ నుంచి అన్ని ఓలా, యూబర్ వంటి సర్వీసులు అన్నీ స్తంభించిపోయాయి. ఈ ట్రాన్స్ పోర్ట్ వ్యవస్థ బంద్ పిలుపునివ్వడంతో ఎయిర్ పోర్టుకు, రైల్వే స్టేషన్ కు వెళ్లాల్సిన వారు ప్రైవేటు వెహికల్స్ ను ఆశ్రయిస్తున్నారు. ప్రతిపక్షాలన్నీ ముకుమ్మడిగా సమ్మెకు మద్దతు తెలియజేస్తున్నాయి.