Aarogyasri : ఏపీ, తెలంగాణలో ఆరోగ్యశ్రీ సేవలకు బ్రేక్.. పట్టువీడని ఆస్పత్రుల అసోసియేషన్.. నిధులు వస్తేనే..

Aarogyasri Services : ఆరోగ్యశ్రీ సేవలకు బ్రేక్ పడింది. బకాయిలు చెల్లించే వరకు సేవలు కొనసాగించలేమని అసోసియేషన్ తేల్చి చెప్పింది.

Aarogyasri : ఏపీ, తెలంగాణలో ఆరోగ్యశ్రీ సేవలకు బ్రేక్.. పట్టువీడని ఆస్పత్రుల అసోసియేషన్.. నిధులు వస్తేనే..

Aarogyasri Services

Updated On : September 17, 2025 / 12:06 PM IST

Aarogyasri Services : ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఆరోగ్యశ్రీ సేవలకు బ్రేక్ పడింది. తెలంగాణలోని ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు బుధవారం ఉదయం నుంచి నిలిచిపోయాయి. ప్రభుత్వం నెలకు వంద కోట్ల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చింది. అయినా ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ ఆస్పత్రుల అసోసియేషన్ పట్టువీడం లేదు. నెలకు కనీసం 500 కోట్లు విడుదల చేయాలని అసోసియేషన్ పట్టుబడుతున్నట్లు తెలిసింది.

Also Read: పర్యాటక కేంద్రంగా మూసీ.. అక్కడ వారి విగ్రహాలు పెడతాం.. కృష్ణ, గోదావరిలో హక్కుపై రాజీపడేది లేదు .. సీఎం రేవంత్ రెడ్డి

ఆరోగ్యశ్రీ సేవలు యథావిధిగా కొనసాగించాలని ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యాలకు ఆరోగ్యశ్రీ సీఈవో ఉదయ్ కుమార్ విజ్ఞప్తి చేశారు. వైద్య సేవల నిలిపివేత నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని సూచించారు. గడిచిన 21 నెలల్లో 1779 కోట్లను ఆస్పత్రులకు ప్రభుత్వం చెల్లించిందని ఆయన వెల్లడించారు. ప్రభుత్వం ఏర్పడిన వెంటనే 1375 వైద్య చికిత్సల చార్జీలను సగటున 22శాతానికిపైగా పెంచామని చెప్పారు. అయితే, సమ్మెపై వెనక్కి తగ్గేది లేదని ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ ఆస్పత్రుల అసోసియేషన్ ప్రెసిడెంట్ వద్దిరాజు రాకేశ్ తెలిపారు.

ఆస్పత్రులకు చెల్లించాల్సిన బకాయిల విషయంలో గత ఆగస్టు నుంచి ప్రభుత్వం స్పందన కోసం ఎదురు చూస్తున్నాం.. అయినా ప్రయోజనం లేకపోవడంతోనే సేవలు నిలిపివేస్తున్నామని వద్దిరాజు రాకేశ్ పేర్కొన్నారు. తెలంగాణ వ్యాప్తంగా ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ పరిధిలో 470 వరకు ఆస్పత్రులు ఉన్నాయి.. వీటికి సంబంధించి రూ.1400 కోట్ల బకాయిలు ఉన్నట్లు అసోసియేషన్ చెబుతోంది.

 

ఏపీలో కొనసాగుతున్న ఓపీడీ సేవల నిలిపివేత..

ఏపీలో ఆరోగ్యశ్రీ పథకం కింద ఓపీడీ సేవల నిలిపివేత కొనసాగుతోంది. చర్చలు జరిగే వరకు ఆరోగ్యశ్రీ సేవలు పునరుద్దరించబోమని నెట్‌వర్క్ ఆస్పత్రుల అసోసియేషన్ తేల్చి చెప్పింది. అసోసియేషన్ ప్రకారం.. CFMSలో పెండింగ్‌లో ఉన్న రూ. 674 కోట్లు కలిపి మొత్తం రూ. 3,800 కోట్ల బకాయిలు ఉన్నాయి. అయితే, త్వరలో బకాయిలు చెల్లిస్తామని ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈవో హామీ ఇచ్చారు. సీఎం సమక్షంలోనే సమావేశం జరగాలని నెట్‌వర్క్ ఆస్పత్రుల అసోసియేషన్ పట్టుబడుతుంది.

మరోవైపు.. ఓపీడీ సేవలు నిలిచిపోవడంతో పేద ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సాధారణంగా అయితే, ఉచిత వైద్యం అందించే వారికి ఓపీ సేవలు ఉచితంతోనే ప్రారంభం అవుతాయి. ప్రైవేట్ నెట్‌వర్క్ ఆసుపత్రుల యాజమాన్యాలు ఓపీ సేవలు నిలిపివేయడంతో పేద వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. డాక్టర్ ఫీజు చెల్లించి వైద్యం కోసం వెళ్లాల్సి వస్తుందని పేర్కొంటున్నారు. చర్చలు ఎప్పుడు జరుగుతాయో, తిరిగి సేవలు ఎప్పుడు పునరుద్దరిస్తారో అని ఎదురు చూస్తున్నారు.