ఎమ్మెల్సీలుగా అద్దంకి దయాకర్‌, దాసోజు శ్రవణ్!

కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు చెరో అభ్యర్ధిని బరిలోకి దింపితే ఎమ్మెల్సీ ఎన్నికలు ఏకగ్రీవం కానున్నాయి. ఒకవేళ 40 మంది ఎమ్మెల్యేల ఓట్లకు బీఆర్ఎస్‌కు 39 మంది ఎమ్మెల్యేలే ఉన్నారు.

ఎమ్మెల్సీలుగా అద్దంకి దయాకర్‌, దాసోజు శ్రవణ్!

Addanki Dayakar, Dasoju Sravan Kumar to be nominated MLCs in Telangana

Updated On : January 5, 2024 / 11:27 AM IST

Telangana MLC Election 2024: తెలంగాణలో మరో ఎన్నికకు షెడ్యూల్ విడుదలైంది. ఎమ్మెల్యే కోటాలో ఖాళీ అయిన రెండు ఎమ్మెల్సీ స్థానాలను భర్తీ చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం తేదీలను ఖరారు చేసింది. ఈనెల 11న నోటిఫికేషన్‌, 29న పోలింగ్‌ జరగనుంది. రెండు స్థానాల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్‌కు చెరో ఎమ్మెల్సీ స్థానం దక్కనుంది. అయితే ఇరుపార్టీల నుంచి ఎమ్మెల్సీలుగా ఎవరికి అవకాశం దక్కనుందన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల నగారా మోగింది. ఎమ్మెల్యే కోటాలోని రెండు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవ్వడంతో కేంద్ర ఎన్నికల సంఘం ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల చేసింది. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కడియం శ్రీహరి, పాడి కౌశిక్ రెడ్డిలు ఎమ్మెల్యేలుగా గెలుపొందడంతో ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేశారు. దీంతో ఎమ్మెల్యే కోటాలోని ఈ రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఉప ఎన్నిక నిర్వహించేందుకు ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది. ప్రస్తుతం తెలంగాణలో పార్టీలకున్న బలాబలాలు చూస్తే అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీలకు చెరో ఎమ్మెల్సీ దక్కే అవకాశం ఉంది. ప్రస్తుతం ఖాళీ అయిన రెండు ఎమ్మెల్సీ స్థానాలకు గాను ఒక్కో ఎమ్మెల్సీ అభ్యర్ధికి 40 ఎమ్మెల్యేల ఓట్లు అవసరం అవుతుంది. కాంగ్రెస్ పార్టీకి 64 మంది ఎమ్మెల్యేల బలం ఉండటంతో.. ఒక అభ్యర్ధిని నిలబెట్టనుంది. ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీకి 39 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. దీంతో ఒక అభ్యర్ధిని పోటీకి నిలబెట్టనుంది.

కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు చెరో అభ్యర్ధిని బరిలోకి దింపితే ఎమ్మెల్సీ ఎన్నికలు ఏకగ్రీవం కానున్నాయి. ఒకవేళ 40 మంది ఎమ్మెల్యేల ఓట్లకు బీఆర్ఎస్‌కు 39 మంది ఎమ్మెల్యేలే ఉన్నారు. అవసరం అయితే ఎంఐఎం మద్దతు ఇస్తుందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. దీంతో ఎమ్మెల్సీ ఎన్నికలు పోలింగ్ లేకుండానే ఏకగ్రీవం అయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని రాజకీయవర్గాలు చెబుతున్నాయి. అనివార్య కారణాలతో ఎంఐఎం, బీజేపీ ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరంగా ఉంటే మాత్రం ఓటింగ్‌లో పాల్గొనేది మిగిలిన 104 మంది ఎమ్మెల్యేలు మాత్రమే. అప్పుడు ఒక్కో ఎమ్మెల్సీ అభ్యర్ధి గెలుపునకు 35 మంది ఎమ్మెల్యేల ఓట్లు అవసరం ఉంటుంది. దీంతో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు చెందిన చెరో అభ్యర్ధి ఎమ్మెల్సీలుగా ఏకగ్రీవంగా గెలుస్తారు. కాంగ్రెస్ రెండో అభ్యర్ధిని పోటీకి దింపితేనే ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన ఓటింగ్ అనివార్యమవుతుంది.

Also Read: జాతీయ రాజకీయాలకు వేదికగా తెలంగాణ.. రాష్ట్రం నుంచి అగ్రనేతల పోటీ? మోదీ, సోనియా సై అంటారా?

ఎవరెవరికి ఈసారి అవకాశం?
ఈసారి ఎవరెవరికి ఎమ్మెల్సీలుగా అవకాశం దక్కుతుందన్న దానిపై కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల్లో జోరుగా చర్చ జరుగుతోంది. అధికార, ప్రతిపక్ష పార్టీల నుంచి చాలా మంది ఆశావాహులు ఎమ్మెల్సీలుగా అవకాశం కోసం గట్టిగా ప్రయత్నిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి సీనియర్ నేత అద్దంకి దయాకర్‌కు ఎమ్మెల్సీగా ఉవకాశం ఇవ్వనున్నారనే ప్రచారం జరుగుతోంది. మొన్నటి ఎన్నికల్లో టిక్కెట్‌ను త్యాగం చేసిన క్రమంలో అద్దంకికే ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తారని తెలుస్తోంది.

బీఆర్ఎస్ రేసులో ఇద్దరు
మరోవైపు బీఆర్ఎస్ నుంచి దాసోజు శ్రవణ్ కు ఎమ్మెల్సీగా ఇవకాశం ఇవ్వనున్నారని సమాచారం. ఎన్నికలకు ముందు దాసోజు శ్రవణ్, కుర్ర సత్యనారాయణ పేర్లను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా నామినేట్ చేసినా తమిళిసై తిరస్కరించారు. దీంతో వీరిద్దరూ ఇప్పుడు రేసులో ఉన్నారు. వీరితో పాటు సీనియర్ నేతలు నాగం జనార్దన్‌రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య పేర్లను పెద్దల సభకు పరిశీలించే అవకాశం ఉంది. ముదిరాజ్‌ కోటాలో ఎంపిక చేయాలంటే మరో సీనియర్ నేత కాసాని జ్ఞానేశ్వర్ పేరును బీఆర్ఎస్ పరిశీలించే అవకాశం ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో ముదిరాజ్ సామాజిక వర్గానికి పోటీ చేసే అవకాశం ఇవ్వని బీఆర్ఎస్.. పార్లమెంట్‌ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రాధాన్యత ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. చూడాలి మరి ఈ రెండు స్థానాల్లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలుగా పెద్దల సభకు ఎవరు వెళ్తారో.