సిల్వర్ జూబ్లీ సభ వేదికగా గులాబీ గూటికి ఈ నేతలు తిరిగి వస్తున్నారా!?

పార్టీ ఫిరాయింపులు జరిగిన ఆ పది నియోజకవర్గాల్లోని అసంతృప్త నేతలను బుజ్జగించేందుకు ప్రయత్నాలను మొదలుపెట్టినట్లు తెలుస్తోంది.

సిల్వర్ జూబ్లీ సభ వేదికగా గులాబీ గూటికి ఈ నేతలు తిరిగి వస్తున్నారా!?

Updated On : April 25, 2025 / 8:52 PM IST

అధికార కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇచ్చేందుకు గులాబీ పార్టీ రెడీ అయ్యిందా? వరంగల్ సిల్వర్ జూబ్లీ సభలో ఊహించని ట్విస్ట్ ఇవ్వడానికి పెద్ద స్కెచ్చే వేసిందా? అంటే అవుననే సమాధానం రాజకీయవర్గాల్లో వస్తోంది. కాంగ్రెస్ నేతలు అస్సలేమాత్రం ఊహించని విధంగా చేరికలకు ప్లాన్ చేసిందట గులాబీ పార్టీ.

అయితే బీఆర్ఎస్ వేసిన స్కెచ్ కాస్తా ఆఖరి నిమిషంలో అధికార హస్తం పార్టీకి ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా తెలిసిందట. దీంతో హస్తం పార్టీకి షాక్ ఇవ్వాలనుకున్న బీఆర్ఎస్ వ్యూహం బెడిసికొట్టినట్లేనా? లేక సక్సెస్ అవుతుందా అనేది ఇప్పుడు రాజకీయవర్గాల్లో ఉత్కంఠ రేపుతోందట.

బీఆర్ఎస్ పార్టీ సిల్వర్ జూబ్లీ ఉత్సవాలకు కౌంట్ డౌన్ మొదలైంది. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి 24 ఏళ్లు పూర్తి చేసుకుని, 25వ వసంతంలోకి అడుగుపెడుతున్న నేపథ్యంలో ఈనెల 27న హన్మకొండ జిల్లా ఎల్కతుర్తిలో పెద్ద ఎత్తున రజతోత్సవాలను నిర్వహిస్తోంది. 10 లక్షల జన సమీకరణతో కనీవినీ ఎరుగని రీతిలో సిల్వర్ జూబ్లీ భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు స్పీడప్ చేస్తున్నారు బీఆర్ఎస్ నేతలు.

దీంతో అంతా వరంగల్ సభవైపే ఆసక్తిగా చూస్తోంటే..గులాబీ బాస్ కేసీఆర్ మాత్రం మాత్రం మరో కోణంలో ఆలోచిస్తున్నారట. 27న జరిగే బహిరంగ సభ సందర్బంగా కాస్త డిఫరెంట్ గా ప్లాన్ చేశారట గులాబీ పార్టీ నేతలు. అధికార కాంగ్రెస్ పార్టీని డిఫెన్స్ లో పడేసేలా ఎవ్వరూ ఊహించని సరికొత్త వ్యూహాన్ని రచించారని తెలుస్తోంది.

అసంతృప్తిగా ఉన్న నేతలపై బీఆర్ఎస్ దృష్టి
అధికార కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తిగా ఉన్న నేతలపై బీఆర్ఎస్ నేతలు దృష్టి సారించారట. ఈనెల 27న పార్టీ రజతోత్సవ సభలో ఆయా కాంగ్రెస్ నేతలను కారు ఎక్కించేయాలని భావించారని తెలుస్తోంది. తమ ఎమ్మెల్యేలు పార్టీ మారిన పది నియోజకవర్గాల్లో పాత కాంగ్రెస్ నాయకులు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారనే విషయాన్ని గుర్తించిన బీఆర్ఎస్..వారితో కొద్ది రోజులుగా సంప్రదింపులు జరుపుతున్నారట.

తమను సీఎం రేవంత్‌ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ పిలిచి మాట్లాడలేదని, బీఆర్ఎస్ లో గెలిచి కాంగ్రెస్ లోకి వచ్చిన ఎమ్మెల్యేలతో తమకు ఎదురవుతున్న ఇబ్బందులను పట్టించుకోవడం లేదనే అసహనంతో రగిలిపోతున్నారట ఆ 10 నియోజకవర్గాల కాంగ్రెస్ నేతలు. సరిగ్గా ఇక్కడే ప్రతిపక్ష బీఆర్ఎస్ చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేసిందన్న చర్చ జరుగుతోంది. అలాంటి అసంతృప్త నేతలను కారెక్కిస్తే అధికార పార్టీకి బిగ్ షాకే ఇచ్చినట్టు ఉంటుందన్నది గులాబీ పార్టీ పెద్దల ఆలోచనగా తెలుస్తోంది.

గులాబీ పార్టీలోని ఓ కీలక నేత కాంగ్రెస్ అసంతృప్త నాయకులతో రాయబారం నెరిపినట్లు తెలుస్తోంది. పార్టీ ఫిరాయించి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో కచ్చితంగా ఉప ఎన్నికలు వస్తాయిని, అప్పుడు మీకే టిక్కెట్లు ఇస్తామని హామీ ఇచ్చారట. అంతే కాకుండా వచ్చే సాధారణ ఎన్నికల్లో కూడా టికెట్స్ మీకేనని గ్యారంటీ కూడా ఇచ్చి వారిని కారెక్కించేందుకు ఒప్పించే ప్రయత్నం చేశారట.

వ్యూహాన్ని ఇంటెలిజెన్స్ వర్గాలు పసిగట్టాయా?
ఈనెల 27న ఎల్కతుర్తి రజతోత్సవ సభలో ఆ పది నియోజకవర్గాల్లో కనీసం ఏడెనిమిది నియోజకవర్గాల ముఖ్య నేతలకు పార్టీ అధినేత కేసీఆర్ చేత గులాబీ కండువాలు కప్పించాలి అని బీఆర్ఎస్ ప్లాన్ చేసిందని సమాచారం. అయితే ప్రతిపక్ష బీఆర్ఎస్ పన్నిన రాజకీయ వ్యూహాన్ని ఇంటెలిజెన్స్ వర్గాలు పసిగట్టినట్లు తెలుస్తోంది.

కొన్ని రోజులుగా అధికార కాంగ్రెస్ అసంతృప్తి నేతలతో బీఆర్ఎస్ నేతలు రహస్యంగా సంప్రదింపులు జరపడం, పార్టీలో చేర్చుకునేందుకు ప్రయత్నించడంపై కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలను అలర్ట్ చేశారట. దీంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ కాంగ్రెస్ ముఖ్య నేతలు ఏమాత్రం ఆలస్యం చేయకుండా రంగంలోకి దిగారన్న టాక్ విన్పిస్తోంది. పార్టీ ఫిరాయింపులు జరిగిన ఆ పది నియోజకవర్గాల్లోని అసంతృప్త నేతలను బుజ్జగించేందుకు ప్రయత్నాలను మొదలుపెట్టినట్లు తెలుస్తోంది.

బీఆర్ఎస్ లో గెలిచి కాంగ్రెస్ లోకి వెళ్లిన ఆ 10 మంది ఎమ్మెల్యేలను గులాబీ పార్టీ లోకి మళ్లీ రానిచ్చేది లేదంటున్న brs .. అక్కడి కాంగ్రెస్ నేతలపై ఆకర్ష్ అస్త్రం వేస్తోంది . మరి గులాబీ అస్త్రానికి ఆ నేతలు చిక్కుతారా .. కారెక్కుతార అన్నది ఇప్పుడు ఆసక్తి రేపుతోంది .. లేదంటే కాంగ్రెస్ బుజ్జగింపులకు తలొగ్గుతారా..ఈ నెల 27న ఓరుగల్లు వేదికగా ఏం జరగబోతుందో చూడాలి మరి.