సీఎం రేవంత్‌కు మరోసారి నోటీసులు ఇచ్చే యోచనలో ఢిల్లీ పోలీసులు

సీఎం రేవంత్ సమాధానంపై ఢిల్లీ పోలీసులు సంతృప్తి చెందలేదని తెలుస్తోంది. దీంతో మరోసారి నోటీసులు ఇచ్చేందుకు ఢిల్లీ పోలీసులు రెడీ అవుతున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం.

సీఎం రేవంత్‌కు మరోసారి నోటీసులు ఇచ్చే యోచనలో ఢిల్లీ పోలీసులు

CM Revanth Reddy (Photo Source: @revanth_anumula)

Amit Shah Doctored Video Case: కేంద్ర హోంమత్రి అమిత్ షా నకిలీ వీడియో కేసులో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ నేతలకు మరోసారి నోటీసులు ఇవ్వాలని ఢిల్లీ పోలీసులు భావిస్తున్నట్టు సమాచారం. ఇంతకుముందు తాము జారీ చేసిన నోటీసులకు సీఎం రేవంత్ సమాధానంపై ఢిల్లీ పోలీసులు సంతృప్తి చెందలేదని తెలుస్తోంది. దీంతో మరోసారి నోటీసులు ఇచ్చేందుకు ఢిల్లీ పోలీసులు రెడీ అవుతున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం.

మే 1న విచారణకు హాజరుకావాలంటూ సీఆర్పీసీ సెక్షన్ 91 ప్రకారం మే 29న మొదటిసారి సీఎం రేవంత్ సహా నలుగురు తెలంగాణ కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులకు ఢిల్లీ పోలీసులు నోటీసులు ఇచ్చారు. నిన్నటి విచారణకు హాజరుకాకుండా న్యాయవాది ద్వారా సీఎం రేవంత్ రెడ్డి జవాబు పంపించారు. తాను ఉపయోగించే ట్విటర్ ఖాతాలో అమిత్ షా ఫేక్ వీడియో పోస్టు చేయడంగానీ, రీట్వీట్ చేయడంగానీ జరగలేదని వెల్లడించారు.

అయితే తెలంగాణ కాంగ్రెస్ పేరిట ఉన్న ట్విటర్ ఖాతాలో ఈ వీడియో పోస్టు చేశారని, అలాంటప్పుడు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడే బాధ్యుడవుతారని ఢిల్లీ పోలీసులు అంటున్నారు. అందుకే ఆ వీడియో సోర్స్ చెప్పాలని కోరుతూ నోటీసులు పంపినట్టు చెబుతున్నారు. అసలు ఆ వీడియో తొలుత ఎవరు సృష్టించారో తెలుసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసిన వారందరినీ విచారిస్తున్నారు.

Also Read: నన్ను బెదిరించి జైల్లో పెట్టాలని చూస్తున్నారు- సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు