బీఆర్ఎస్‌లో అప్పుడే మొదలైన టికెట్ల గోల.. అక్కడ గ్రూప్‌వార్‌తో రచ్చ
ఎమ్మెల్సీ హోదాలో ఉన్న నవీన్ రెడ్డి..హైదరాబాద్‌లోని పార్టీ ఆఫీస్ మొదలుకొని షాద్‌నగర్ వరకు ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తూ ప్రజల దృష్టిలో, అధిష్టానం దృష్టిలో పడే ప్రయత్నం చేస్తున్నారట.
BRS
BRS Party: ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని షాద్‌నగర్ బీఆర్ఎస్‌లో వర్గ విభేదాలు పీక్ లెవల్‌కు చేరాయి. కారు పార్టీలో రెండు వర్గాల మధ్య ఆధిపత్య పోరుతో క్యాడర్ రెండుగా చీలిపోయిందన్న టాక్ వినిపిస్తోంది. షాద్ నగర్ నియోజకవర్గంలో 2014, 2018లో రెండు సార్లు ఘన విజయం సాధించిన గులాబీ పార్టీ గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలైంది.
దీంతో గత రెండేళ్లుగా పార్టీ వర్గ విభేదాలతో కొట్టుమిట్టాడుతోంది. బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్‌కు, మహబూబ్ నగర్ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ నవీన్ రెడ్డికి ఏ మాత్రం పొసగడం లేదు. అంజయ్య యాదవ్, నవీన్ రెండు వర్గాలుగా విడిపోవడంతో ద్వితీయస్థాయి నేతలతో పాటు కార్యకర్తలు అయోమయంలో పడ్డారట. అధికార పార్టీ మీద పోరాడాల్సింది పోయి..సొంత పార్టీలో ఈ కుంపటి ఏంటంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట గులాబీ పార్టీ కార్యకర్తలు.
మాజీ ఎమ్మెల్యే అంజయ యాదవ్ ఈ సారి తన కుమారుడికి టికెట్ ఇప్పించుకునే ప్రయత్నంలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి కూడా వచ్చే ఎన్నికల్లో షాద్‌నగర్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు ట్రై చేస్తున్నారట. నవీన్ రెడ్డి ఎమ్మెల్యే సీటుపై కన్నేయడంతో తమ సీటుకు ఎసరు వస్తుందన్న ఆందోళనలో మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ వర్గం అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారట.
Also Read: ఇటు పార్టీ.. అటు ప్రభుత్వం.. జనసేన బలోపేతం కోసం పవన్ ఈ మోడల్‌ను ఫాలో అవుతున్నారా?
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక నవీన్ కుమార్ రెడ్డి బీఆర్ఎస్ తరఫున స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీగా గెలవడంతో ఆయనపై బీఆర్ఎస్ అధిష్టానానికి మంచి అభిప్రాయం ఉండటంతో పాటు ఆర్థికంగా రాజకీయంగా అన్ని విధాల నవీన్ కుమార్ బలంగా ఉండటంతో స్పీడు పెంచారు. ఇదే ఇప్పుడు అంజయ్య యాదవ్ వర్గంలో ఆందోళనకు కారణమవుతోందని తెలుస్తోంది.
అధిష్టానం దృష్టిలో పడే ప్రయత్నం
ఎమ్మెల్సీ హోదాలో ఉన్న నవీన్ రెడ్డి..హైదరాబాద్‌లోని పార్టీ ఆఫీస్ మొదలుకొని షాద్‌నగర్ వరకు ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తూ ప్రజల దృష్టిలో, అధిష్టానం దృష్టిలో పడే ప్రయత్నం చేస్తున్నారట. అంతేకాదు బీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలకు షాద్‌నగర్ నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలను తరలించడంతో..కేటీఆర్ కూడా నవీన్ రెడ్డిని అభినందించారట. ఇది మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ వర్గానికి ఏ మాత్రం రుచించడం లేదంటున్నారు. అప్పటి నుంచి ఇరు వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోదన్న టాక్ వినిపిస్తోంది.
లేటెస్ట్‌గా జరిగిన పంచాయతీ ఎన్నికల్లోనూ ఓ వైపు అంజయ్య యాదవ్, మరోవైపు ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి ఎవరికి వారు సెపరేట్‌గా.. తమ వర్గానికి చెందిన అభ్యర్ధులను బరిలోకి దింపి చాలా వరకు గెలిపించుకున్నారు. అయితే అంజయ్య యాదవ్, నవీన్ రెడ్డి వర్గ పోరు పార్టీకి డ్యామేజ్ చేస్తుందన్న ఆందోళన క్యాడర్ కనిపిస్తోందట. ఇంకా కొన్ని పంచాయితీల్లో గెలవాల్సి ఉన్నా అంజయ్య యాదవ్, నవీన్ రెడ్డి విభేదాలతో అధికార కాంగ్రెస్‌కు మేలు జరిగిందని అంటున్నారు. ఇక షాద్‌నగర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ మద్దతుదారులుగా బరిలో నిలిచి గెలిచిన సర్పంచ్‌లను తెలంగాణ భవన్‌లో సన్మానించారు కేటీఆర్.
ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి హాజరు కాలేదు. అంతే కాకుండా ఈ సమావేశంలో అంజయ్య యాదవ్ మళ్లీ భారీ మెజార్టీతో గెలుస్తారని కేటీఆర్ చెప్పడంతో మళ్లీ ఆయనకే టికెట్ అని చెప్పకనే చెప్పారన్న చర్చ మొదలైంది. ఇంకా ఎన్నికలకు మూడేళ్ల సమయం ఉండగానే..మాజీ ఎమ్మెల్యే వర్సెస్ ఎమ్మెల్సీ టికెట్ ఫైట్ ఇంట్రెస్టింగ్‌గా మారింది. అప్పటి వరకు పరిస్థితుల్లో మార్పు వచ్చి తనకే టికెట్ వస్తుందన్న ధీమాతో నవీన్ రెడ్డి ఉంటే..అధిష్టానం ఆశీస్సులు తనకే ఉన్నాయని అంజయ్య యాదవ్ చెప్పుకుంటున్నారట. మొత్తానికి షాద్‌నగర్ నియోజక వర్గంలో మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్, ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి వర్గాల మధ్య కార్యకర్తలు నలిగిపోవాల్సి వస్తుందట. మాజీ ఎమ్మెల్యే వెంట నడవాలో..ఎమ్మెల్సీ చేపట్టిన కార్యక్రమాల్లో పాల్గొనాలో తెలియక గులాబీ పార్టీ కార్యకర్తలు సతమతం అవుతున్నారని అంటున్నారు.
