Kurnool Bus Tragedy : కర్నూల్‌లో మరో ట్రావెల్స్ బస్సుకు ప్రమాదం.. తప్పిన ముప్పు.. ఆర్టీఏ కార్యాలయానికి తరలింపు..
Kurnool Bus Tragedy కర్నూల్ జిల్లాలో మరో ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైంది. బెంగళూరు నుంచి హైదరాబాద్ మధ్య నడుస్తున్న ట్రావెల్ బస్సు లారీని ఢీకొట్టింది.
Kurnool Bus Tragedy
Kurnool Bus Tragedy : కర్నూల్ జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున జరిగిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదం ఘటనలో 19మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. అయితే, తాజాగా అదే జిల్లాలో మరో ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైంది. బెంగళూరు నుంచి హైదరాబాద్ మధ్య నడుస్తున్న ట్రావెల్ బస్సు ప్రమాదానికి గురైంది.
వాహనాన్ని తప్పించబోయి ట్రావెల్స్ బస్సు లారీని ఢీకొట్టింది. అయితే, డ్రైవర్ సమయస్ఫూర్తితో ముప్పు తప్పింది. బస్సు ముందు భాగం స్వల్పంగా ధ్వంసం అయింది. శనివారం తెల్లవారు జామున 4గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ సమయంలో ప్రయాణీకులంతా గాఢ నిద్రలో ఉన్నారు. ప్రమాదానికి గురైన బస్సుతో డ్రైవర్ నిబంధనలకు విరుద్ధంగా బస్సును హైదరాబాద్ తీసుకొచ్చాడు. ఈ క్రమంలో ఆరాంఘర్ చౌరస్తా దగ్గర బస్సులను ఆర్టీఏ అధికారులు తనిఖీలు చేస్తున్నారు.
ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుకు ముందు భాగంలో అద్దాలు పగిలి ఉండటాన్ని గమనించి బస్సును నిలిపివేశారు. బస్సు ప్రమాదానికి గురైందని గుర్తించిన ఆర్టీఏ అధికారులు బస్సును బండ్లగూడ ఆర్టీఏ కార్యాలయానికి తరలించారు. అయితే, బస్సు లారీని ఢీకొన్న ప్రమాదంలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు.
కర్నూల్‌లో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాద ఘటనతో రవాణాశాఖ అప్రమత్తమైంది. రవాణా శాఖ అధికారులు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు, ఇతర వాహనాలను తనిఖీ చేస్తున్నారు. హైదరాబాద్ నగరంలోని మూడు కమిషనరేట్ల పరిధిలో ఆర్టీఏ అధికారులు తనిఖీలు చేపట్టారు. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై కొరడా ఝుళిపిస్తున్నారు.
సరైన పత్రాలు లేని, నిబంధనలు పాటించని బస్సులపై కేసులు నమోదు చేయడంతోపాటు.. సీజ్ చేస్తున్నారు. విజయవాడ హైవే, బెంగళూరు హైవేపై కూడా ఆర్టీఏ బృందాలు ట్రావెల్స్ బస్సులను నిలిపి విస్తృత తనిఖీలు చేపట్టాయి. రాజేంద్రనగర్ పరిధి గగన్ పహాడ్ వద్ద సోదాలు చేశారు. ఏపీ నుంచి వస్తున్న ట్రావెల్స్ బస్సులను తనిఖీలు చేశారు.
