Assembly Elections 2023: కాంగ్రెస్‌లో మరిన్ని చేరికలు.. మాజీ ఎమ్మెల్యేకి పార్టీ కండువా కప్పిన రేవంత్ రెడ్డి

ఎన్నికల్లో టికెట్ రానివారి ఆవేదనను తాను అర్థం చేసుకుంటానని, తమకు ద్వేషం లేదని, అందరినీ కలుపుకుని పనిచేస్తామని రేవంత్ రెడ్డి అన్నారు.

Assembly Elections 2023: కాంగ్రెస్‌లో మరిన్ని చేరికలు.. మాజీ ఎమ్మెల్యేకి పార్టీ కండువా కప్పిన రేవంత్ రెడ్డి

Revanth Reddy, Malipeddi Sudhir Reddy

Updated On : October 18, 2023 / 3:43 PM IST

Malipeddi Sudhir Reddy: తెలంగాణ ఎన్నికల వేళ కాంగ్రెస్‌ పార్టీలోకి చేరికలు కొనసాగుతున్నాయి. మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి ఇవాళ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. ప్రతాప సింగారంలోని సుధీర్ రెడ్డి ఇంటికి వెళ్లి, ఆయనకు కాంగ్రెస్ కండువా కప్పి రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. మరికొందరు స్థానిక నేతలు కూడా ఆ పార్టీలో చేరారు.

ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. సుధీర్ రెడ్డి గొప్ప నిర్ణయం తీసుకున్నారని అన్నారు. ఆయనను మనస్ఫూర్తిగా కాంగ్రెస్‌లోకి ఆహ్వానిస్తున్నానని తెలిపారు. బీఆర్ఎస్ కు ప్రజలు బుద్ధి చెబుతూ తనను ఎంపీగా గెలిపించారని అన్నారు. ఇక్కడి ప్రజలకు తాను ఎంతో రుణపడి ఉన్నానని చెప్పారు.

ఈ పార్లమెంటు పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ జెండా ఎగరాలని అన్నారు. జవహర్ నగర్ డంప్ యార్డు నుంచి విముక్తి కల్పిస్తామని భరోసా ఇచ్చారు. ఈ ప్రాంతానికి ఇంటర్నేషనల్ ఐటీ కంపెనీలు తీసుకొస్తామని చెప్పారు. ఈ ప్రాంతాన్ని ఐటీ హబ్‌గా మారుస్తామని అన్నారు. మెట్రో రైలును కూడా ఈ ప్రాంతానికి పొడిగిస్తామని చెప్పారు.

తమ పార్టీ అధికారంలోకి వచ్చాక సుధీర్ రెడ్డికి రాజకీయంగా సముచిత గౌరవం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఎన్నికల్లో టికెట్ రానివారి ఆవేదనను తాను అర్థం చేసుకుంటానని, తమకు ద్వేషం లేదని, అందరినీ కలుపుకుని పనిచేస్తామన్నారు. ముందున్న లక్ష్యాన్ని చూస్తూ పనిచేయాలని, కాంగ్రెస్‌ను గెలిపించాలని తమ పార్టీ నేతలు, కార్యకర్తలకు ఆయన కోరారు.