హైదరాబాద్‌లో కరాచీ బేకరీపై దాడి.. ఫర్నీచర్ ధ్వంసం.. బేకరీ యాజమానులు ఏమన్నారంటే..
భారత్, పాకిస్థాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో హైదరాబాద్ లోని కరాచీ బేకరీ పేరు మార్చాలని కొన్నిరోజులుగా డిమాండ్ లు వినిపిస్తున్నాయి.

Karachi Bakery
Karachi Bakery: భారత్, పాకిస్థాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో హైదరాబాద్ లోని కరాచీ బేకరీ పేరు మార్చాలని కొన్నిరోజులుగా డిమాండ్ లు వినిపిస్తున్నాయి. కరాచీ అనేది పాకిస్థాన్ దేశంలో అతిపెద్ద నగరం. కరాచీ పాకిస్థాన్ బ్రాండ్ గా ముద్రపడింది. అయితే, రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా కరాచీ బేకరీకి మంచి పేరుంది. నాణ్యమైన, రుచికరమైన కేకులు, కుకీలు, ఇతర చిరుతిళ్లకు ఇది ప్రసిద్ధి చెందింది. భారత్, పాకిస్థాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ పేరు మార్చాలని డిమాండ్ చేస్తున్నారు. తాజాగా.. భజరంగ్ దళ్ నాయకులు రంగారెడ్డి జిల్లాలోని శంషాబాద్ పట్టణంలో కరాచీ బేకరీపై దాడి చేశారు.
Also Read: పాకిస్థాన్ ఊసరవెల్లి మాటలు నమ్మొద్దు.. మోసం చేస్తారు..! భారత్‌కు బలోచ్ లిబరేషన్ ఆర్మీ సూచన
పాకిస్థాన్ లోని కరాచీ పట్టణం పేరుతో మనదేశంలో బేకరీ ఉండకూడదని కొందరు భజరంగ్ దళ్ నాయకులు శంషాబాద్ పరిధిలోని కరాచీ బేకరీపై దాడి చేశారు. బేకరీ పేరు బోర్డు, ఫర్నిచర్ ను ధ్వంసం చేసి పాకిస్థాన్ పేరుతో వ్యాపారం చేస్తే దాడులు తప్పవని హెచ్చరించారు. పాకిస్థాన్ ముర్దాబాద్, భారత్ జిందాబాద్ అని నినాదాలు చేశారు. పోలీసులు రంగప్రవేశంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం సర్దుమణిగింది. బేకరీ మేనేజర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కరాచీ బేకరీపై దాడి చేయడం హేయమైన చర్య అని మంత్రి సీతక్క అన్నారు. రాజకీయ లబ్ధికోసం విద్వేషాలు రెచ్చగొట్టడం తగదని సూచించారు. దేశ విభజన సమయంలో హిందువులైన కరంచంద్ కుటుంబం హైదరాబాద్‌కు వచ్చి స్థిర పడటంతోపాటు కరాచీ బేకరీ స్థాపించారని తెలిపారు. ఈ దేశ బిడ్డలదే కరాచీ బేకరీ అని స్పష్టంచేశారు.
అయితే, తెలుగు రాష్ట్రాల్లో కరాచీ బేకరీపై దాడి జరగడం ఇదే మొదటిసారి కాదు. గతంలో పుల్వామా దాడి సమయంలోనూ కొందరు వ్యక్తులు హైదరాబాద్ లోని కరాచీ బేకరీ వద్ద ఆందోళన చేయడం, బోర్డు కవర్ చేసే ప్రయత్నాలు చేయడం వంటివి జరిగాయి. తాజాగా.. మరోసారి పహల్గాం దాడి నేపథ్యంలో కూడా ఈ ఆందోళనలు ప్రారంభమయ్యాయి. అయితే, కరాచీ బేకరీ యాజమాని వారసులు ఇటీవల మీడియాతో మాట్లాడారు.. ఇది పాకిస్థాన్ బ్రాండ్ కాదని, నిజమైన భారతీయ బ్రాండ్ కాబట్టి ప్రజలు తమకు మద్దతు ఇవ్వాలని కోరారు.
🚨BREAKING: Karachi bakery in Hyderabad VANDALISED. pic.twitter.com/Rxzfk2pYsg
— Manobala Vijayabalan (@ManobalaV) May 11, 2025