Auto Fare Hike : ప్రయాణికులకు బిగ్‌షాక్.. ఆటో ఛార్జీల పెంపునకు రంగం సిద్ధం.. కిలో మీటర్‌కు ఎంతంటే?
Auto Fare Hike : ఆటోలలో ప్రయాణించే ప్రయాణికులకు బిగ్ షాకింగ్ న్యూస్. తెలంగాణలో త్వరలో ఆటో ఛార్జీల పెంపునకు రంగం సిద్ధమైంది.
Auto Fare Hike
Auto Fare Hike : ఆటోలలో ప్రయాణించే ప్రయాణికులకు బిగ్ షాకింగ్ న్యూస్. తెలంగాణలో త్వరలో ఆటో ఛార్జీల పెంపునకు రంగం సిద్ధమైంది. ఆటో ఛార్జీలను పెంచాలని కమిటీ సిఫార్సు చేసింది. ఈ మేరకు నివేదికను రవాణా శాఖ కమిషనర్ డాక్టర్ కె. ఇలంబర్తి ప్రభుత్వానికి తాజాగా సమర్పించారు. ఈ సిఫార్సులను రేవంత్ సర్కార్ ఆమోదించగానే ఆటో ఛార్జీలు పెంపుపై ఉత్తర్వులు జారీ కానున్నాయి.
తెలంగాణ రాష్ట్ర ఆటో, యాప్ బేస్డ్ యూనియన్ల ఐకాస 14 డిమాండ్లతో గత నెలలో నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. గత నెల 23న యూనియన్ ప్రతినిధులతో జరిగిన సమావేశంలో 15రోజుల్లో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతామని అధికారుల కమిటీ చెప్పడంతో సమ్మెను ఉపసంహరించుకున్నారు. ఆ తరువాత అధికారుల కమిటీ కేరళ, ఢిల్లీ, బెంగళూరు, ముంబయి ప్రాంతాల్లో ఆటో ఛార్జీలపై అధ్యయనం చేసింది. ఇంధన ధరలతోపాటు బీమా, ఇతరత్రా ఖర్చులు పెరిగాయని, ఈ కారణంగా ఆటో ఛార్జీల పెంపు అనివార్యమని కమిటీ సిఫార్సు చేసింది.
కమిటీ సిఫార్సు ప్రకారం.. ప్రయాణికుడు ఆటోలో తొలి 1.6 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తే రూ.30 చెల్లించాలి. ఆ తర్వాత ఎంత దూరం ప్రయాణిస్తే అంత మేరకు కిలోమీటర్ ప్రాతిపదికన అదనపు ఛార్జీ ఉంటుంది. 1.6 కిలోమీటర్ల తర్వాత ప్రతి కిలోమీటర్‌కు రూ.14 చొప్పున వసూలు చేయాలని సిఫార్సు చేసినట్లు తెలిసింది. నిరీక్షణ సమయానికి నిమిషానికి 75పైసలు, రాత్రి సమయంలో సాధారణ చార్జీకి 50శాతం అదనంగా ఉండాలని కమిటీ సూచించినట్లు తెలిసింది.
ప్రతిపాదిత కొత్త ఛార్జీలు అమల్లోకి వస్తే తక్కువ దూరం ప్రయాణించే వారికి కనీస ఛార్జీ పెరిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా రోజూ ఆటోలను ఉపయోగించే ఉద్యోగులు, విద్యార్థులు, మహిళలు, ఇతర ప్రయాణికులపై నెలవారీ ఖర్చు పెరిగే అవకాశం ఉంది.
ఆటో డ్రైవర్ల దృష్టిలో చూస్తే పెరుగుతున్న ఇంధనం, వాహన నిర్వహణ, బీమా, మరమ్మతులు, ఇతర ఖర్చులకు అనుగుణంగా ఛార్జీల పెంపు అవసరమని యూనియన్లు చాలాకాలంగా కోరుతున్నాయి. ప్రభుత్వం ప్రతిపాదనను ఆమోదిస్తే డ్రైవర్ల ఆదాయానికి కొంత ఊరట లభించే అవకాశం ఉంది.
