Azharuddin : అజారుద్దీన్‌కు మంత్రి పదవి.. ఎన్నికల సంఘానికి బీజేపీ ఫిర్యాదు.. ఎందుకంటే?

Azharuddin అజారుద్దీన్ కు మంత్రి పదవిపై బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఈ మేరకు ఎన్నికల సంఘానికి బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు.

Azharuddin : అజారుద్దీన్‌కు మంత్రి పదవి.. ఎన్నికల సంఘానికి బీజేపీ ఫిర్యాదు.. ఎందుకంటే?

Azharuddin

Updated On : October 30, 2025 / 1:34 PM IST

Azharuddin : కాంగ్రెస్ నేత అజారుద్దీన్ తెలంగాణ క్యాబినెట్‌లో చేరేందుకు రంగం సిద్ధమైంది. మంత్రివర్గంలోకి ఆయన్ను తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు. శుక్రవారం ఆయన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తెలిసింది. మైనార్టీ సంక్షేమంతోపాటు మరో శాఖను అజారుద్దీన్‌కు అప్పగిస్తారని సమాచారం. అయితే, అజారుద్దీన్ కు మంత్రి పదవిపై బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఈ మేరకు ఎన్నికల సంఘానికి బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు.

బీజేపీ నేత, ఎమ్మెల్యే పాయల్ శంకర్, మర్రి శశధర్ రెడ్డి, బీజేపీ లీగల్ సెల్ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిని కలిసి ఫిర్యాదు చేశారు. గతంలో జూబ్లీహిల్స్‌లో కాంటెస్ట్ చేసిన అజారుద్దీన్‌కు ఈ సమయంలో మంత్రి పదవి ఇవ్వడం పై బీజేపీ అభ్యంతరం
తెలిపింది. ప్రస్తుతం జరుగుతున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల పోరులో ఒక వర్గం ఓట్లపై ప్రభావం చూపేలా ఉన్న మంత్రివర్గ విస్తరణను ఆపాలని ఈసీకి బీజేపీ నేతలు వినతి అందజేశారు. జూబ్లీహిల్స్ పోలింగ్ అయ్యే వరకు అజారుద్దీన్ కు మంత్రి పదవి వాయిదా వేసేలా చూడాలని ఈసీని వారు కోరారు.

ఈ సందర్భంగా బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ.. అజారుద్దీన్ కు ఇప్పుడు మంత్రి పదవి ఇవ్వడం ఒక వర్గం ఓటర్లను మభ్యపెట్టడమేనని అన్నారు. రెండేళ్ల నుంచి మైనార్టీల మీద గుర్తుకురాని ప్రేమ కాంగ్రెస్ కు ఇప్పుడు గుర్తుకొచ్చిందని విమర్శించారు. అసలు అజారుద్దీన్ ఎమ్మెల్సీ పదవినే ఊగిసలాటలో ఉంది.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ గ్రాఫ్ రోజురోజుకు పడిపోతోంది. ఓటమి భయంతోనే కాంగ్రెస్ మంత్రి వర్గ విస్తరణ అంటోందని ఆయన విమర్శించారు. ఎన్నికల కోడ్ ముగిసే వరకు వాయిదా వేసేలా చూడాలని ఫిర్యాదు చేశామని పేర్కొన్నారు.