Betting Apps Case: బెట్టింగ్ యాప్స్ కేసు.. హైకోర్టును ఆశ్రయించిన విష్ణుప్రియ
బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ వ్యవహారంలో యాంకర్ విష్ణుప్రియ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు.

Vishnupriya
Vishnu Priya: బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ వ్యవహారంలో యాంకర్ విష్ణుప్రియ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. కోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. బెట్టింగ్ యాప్స్ కేసులో తనపై నమోదైన రెండు ఎఫ్ఐఆర్ లను క్వాష్ చేయాలంటూ విష్ణుప్రియ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ లో పేర్కొన్నారు. అయితే, విష్ణుప్రియ పిటిషన్ పై ఇవాళ కోర్టులో విచారణ జరగనుంది.
బెట్టింగ్ యాప్స్ ను ప్రమోషన్ చేసిన వారిపై తెలంగాణ ప్రభుత్వం కొరడా ఝళిపిస్తోంది. ఈ క్రమంలో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేశారన్న కారణంతో పంజాగుట్ట, మియాపూర్ పోలీస్ స్టేషన్ లలో పలువురిపై కేసులు నమోదయ్యాయి. వీరిలో పలువురు టాలీవుడ్ హీరోలు కూడా ఉన్నారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో 11 మందిపై కేసులు నమోదయ్యాయి. వీరిలో పలువురికి పోలీసులు విచారణకు రావాలని నోటీసులు ఇచ్చారు. ఈ క్రమంలో విష్ణుప్రియ, రీతూ చౌదరిలు ఇటీవల పంజాగుట్ట పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. అయితే, ఇవాళ (ఈనెల 25న) మరోసారి విచారణకు రావాలని పోలీసులు వారికి సూచించారు. ఇవాళ పంజాగుట్ట పోలీసుల ఎదుట మరోసారి విచారణకు విష్ణుప్రియ హాజరు కావాల్సిఉన్న నేపథ్యంలో ఆమె తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది.
Also Read: మంత్రివర్గ విస్తరణ.. రాములమ్మకు హోంశాఖ? అమాత్య రేసులో ఉన్న నేతలకు భయం
బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో వైసీపీ అధికార ప్రతినిధి, యాంకర్ శ్యామల కూడా సోమవారం పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కు వెళ్లి పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. ఆమెను పోలీసులు సుమారు నాలుగు గంటలపాటు విచారించారు. అయితే, విచారణకు హాజరుకాకముందే శ్యామల తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో హైకోర్టు శ్యామలను అరెస్టు చేయొద్దని పోలీసులకు సూచించింది. అదేక్రమంలో పోలీసుల విచారణకు హాజరుకావాలని శ్యామలకు కోర్టు సూచించింది. దీంతో ఆమె సోమవారం విచారణకు హాజరయ్యారు. అయితే, విష్ణుప్రియ పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు ఏ విధంగా స్పందిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.