Telangana Assembly Elections : 26మంది ముఖ్య నేతలతో కేంద్ర కమిటీ.. తెలంగాణ ఎన్నికలపై బీజేపీ హైకమాండ్ ఫోకస్, కీలక బాధ్యతలు అప్పగింత
26మందిలో ఐదుగురు కేంద్ర మంత్రులు, ముగ్గురు మాజీ మంత్రులకు స్థానాన్ని కల్పించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిసేవరకు వీరంతా అక్కడే ఉండి పని చేసేలా ఆదేశాలు ఇచ్చారు. Telangana Elections

Telangana Assembly Elections
Telangana Elections – BJP Committee : తెలంగాణ ఎన్నికలపై బీజేపీ ఫోకస్ పెంచింది. ఎన్నికల కోసం 26మంది బీజేపీ ముఖ్య నేతలతో కేంద్ర కమిటీని నియమించింది అధిష్టానం. ఏపీ, కర్నాటక, మహారాష్ట్ర, గోవా, తమిళనాడుకి చెందిన నేతలకు కమిటీలో చోటు దక్కింది. కమిటీలో ఏపీ నుంచి సోమువీర్రాజు, విష్ణువర్దన్ రెడ్డి ఉన్నారు.
26మందిలో ఐదుగురు కేంద్ర మంత్రులు, ముగ్గురు మాజీ మంత్రులకు స్థానాన్ని కల్పించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిసేవరకు వీరంతా అక్కడే ఉండి పని చేసేలా ఆదేశాలు ఇచ్చారు. జిల్లా ప్రవాస్ కార్యక్రమంలో భాగంగా 26మంది నేతలు తెలంగాణలోనే బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.
5 రాష్ట్రాలకు చెందిన కీలక నేతలతో కమిటీ..
తెలంగాణలో గెలుపు కోసం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది బీజేపీ. ఇందుకోసం 5 రాష్ట్రాలకు చెందిన నేతలను రంగంలోకి దింపబోతోంది బీజేపీ హైకమాండ్. ఏపీ, తమిళనాడు, కర్నాటక, మహారాష్ట్ర, గోవా రాష్ట్రాల నుంచి బీజేపీకి చెందిన కీలక నేతలతో కమిటీ రూపొందించింది. తెలంగాణలో ఎన్నికల ప్రచారం, నేతల మధ్య సమన్వయం, బీజేపీని ఇంటింటికి తీసుకెళ్లడం, జాతీయ నేతల బహిరంగ సభలు సమావేశాల నిర్వహణ వీరి బాధ్యత. తెలంగాణలో ఎన్నికలు ముగిసే వరకు వీరంతా అక్కడే ఉండి పని చేయాల్సి ఉంటుంది.
ఏపీ నుంచి సోమువీర్రాజు, విష్ణువర్దన్ రెడ్డి..
ఈ కమిటీలో ఆంధ్రప్రదేశ్ నుంచి ఏపీ బీజేపీ మాజీ అధ్యక్షుడు సోమువీర్రాజు, బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్దన్ రెడ్డికి అవకాశం కల్పించారు. విష్ణువర్దన్ రెడ్డికి నల్లగొండ జిల్లా, సోమువీర్రాజుకి భువనగిరి బాధ్యతలు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. 26మంది ఎక్కడెక్కడ పని చేయాలి, ఏయే కార్యక్రమాల్లో పాల్గొనాలి.. ఇటువంటి అన్ని విషయాలపై జాతీయ నాయకత్వం, తెలంగాణ బీజేపీ వ్యవహారాల ఇంఛార్జి తరుణ్ చుగ్ నేరుగా ఫోన్ చేసి చెప్పారు. బీజేపీని క్షేత్రస్థాయిలో మరింత దూకుడుగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు, గెలుపు కోసం కృషి చేసేందుకు చేపట్టాల్సిన కార్యాచరణ, ప్రచార కార్యక్రమాలు, నేతల మధ్య సమన్వయం, జాతీయ నాయకత్వానికి – రాష్ట్ర నాయకత్వానికి మధ్య సమన్వయకర్తలుగా వ్యవహరించడం వీరి బాధ్యతలు.
ఎన్నికలు ముగిసేవరకు తెలంగాణలోనే, కీలక బాధ్యతలు అప్పగింత..
పూర్తి స్థాయిలో చెప్పాలంటే ఇదొక ఎన్నికల నిర్వహణ బాధ్యతల కమిటీగా పరిగణించాల్సి ఉంటుంది. ఈ కేంద్ర కమిటీ త్వరలోనే వారికి కేటాయించిన నియోజకవర్గాలకు వెళ్లి పనిని ప్రారంభించబోతున్నారు. అక్కడ ఎటువంటి రాజకీయ సమీకరణాలు ఉన్నాయి, అభ్యర్థుల ప్రచార కార్యక్రమం, కేంద్ర పథకాల గురించి ప్రచారం, అధికారంలోకి వస్తే ఏయే సంక్షేమ పథకాలు అమలు చేయబోతున్నాం.. ఇలాంటి అన్ని విషయాలను వీరు ప్రజల్లోకి తీసుకెళ్లాల్సి ఉంటుంది. అసెంబ్లీ ఎన్నికలు ముగిసే వరకు వీరంతా అక్కడే ఉండి పని చేయాల్సి ఉంటుందని ఆదేశాలు అందాయి.