Ramchander Rao : మాజీ ఎమ్మెల్సీ రాంచందర్ రావుకు బీజేపీ జాతీయ నాయకత్వం నుంచి పిలుపు ..
రాంచందర్ రావుకు జాతీయ నాయకత్వం పిలుపుపై పార్టీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

Ramchander Rao : మాజీ ఎమ్మెల్సీ రాంచందర్ రావుకు బీజేపీ జాతీయ నాయకత్వం పిలుపు అందింది. మంగళవారం ఢిల్లీలో అందుబాటులో ఉండాలని జాతీయ నాయకత్వం చెప్పింది. తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడి నియామక ప్రక్రియను బీజేపీ జాతీయ నాయకత్వం వేగవంతం చేసింది. రాష్ట్ర అధ్యక్షుడి నియామకం నేపథ్యంలో రాంచందర్ రావుకు జాతీయ నాయకత్వం పిలుపుపై పార్టీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. తెలంగాణ బీజేపీ అధ్యక్ష రేసులో మాజీ ఎమ్మెల్సీ రాంచందర్ రావు ఉన్న సంగతి తెలిసిందే.
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి ఎంపిక పార్టీ హైకమాండ్ కు చాలెంజ్ గా మారింది. ఎందరో ఆశావహులు. ఎన్నో ఈక్వేషన్లు. మరెన్నో క్యాలిక్యులేషన్ల మధ్య నాలుగైదు నెలలుగా తెలంగాణ బీజేపీ ప్రెసిడెంట్ ఎంపిక.. డైలీ ఎపిసోడ్‌గా కంటిన్యూ అవుతోంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి రేసులో ఎంపీలు ఈటల రాజేందర్, బండి సంజయ్, ధర్మపురి అరవింద్, రఘునందర్ రావుతో పాటు బీజేపీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్సీ రాంచందర్ రావు, చింతల రాంచంద్రారెడ్డి పేర్లు వినిపిస్తూ వస్తున్నాయి.
Also Read : రాములమ్మకు ఎమ్మెల్సీ.. ఎందుకంటే? కాంగ్రెస్ వ్యూహం ఇదేనా?
ఇక అనూహ్యంగా బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, మరో జాతీయ నేత మురళీధర్ రావు పేర్లు కూడా తెరపైకి వచ్చాయి. ఈటల రాజేందర్ అధ్యక్ష రేసులో ముందున్నారని ఆయన సన్నిహితులు ప్రచారం చేసుకుంటుండటం పార్టీలో అసంతృప్తులకు దారి తీస్తోందట. ఇక నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ జాతీయ స్థాయిలో తనకున్న పరిచయాలతో అధ్యక్ష పదవి కోసం గట్టిగానే ప్రయత్నం చేస్తున్నారట. మెదక్ ఎంపీ రఘునందన్‌రావు సైలెంట్‌గా అధ్యక్ష పదవి కోసం లాబీయింగ్ చేస్తున్నారట.
పార్టీలోకి కొత్తగా వచ్చిన వారికి కాకుండా పాత వారికే అధ్యక్ష పదవి ఇవ్వాలన్న డిమాండ్‌తో రాంచందర్ రావు సీనియర్ల మద్దతు కూడగట్టినట్లు టాక్. ఎంపీల్లో ఎవరికి చాన్స్ ఇచ్చినా పార్టీ తమ కంట్రోల్ ఉండదని భావిస్తున్న ఒకరిద్దరు సీనియర్ నేతలు పాయల్ శంకర్ పేరును ప్రతిపాదించినట్టు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో గుసగుసలు వినిపిస్తున్నాయి. మొత్తంగా ఏ క్షణంలోనైనా బీజేపీ జాతీయ నాయకత్వం నుంచి ప్రకటన రావొచ్చన్న టాక్ బలంగా వినిపిస్తోంది. తెలంగాణ కాషాయ రథసారధిగా ఎవరికి అవకాశం దక్కబోతుందో చూడాలి.