Bandi Sanjay: మరోసారి పాదయాత్ర చేసేందుకు బండి సంజయ్ సన్నద్ధం

ఈ పాదయాత్రకు ప్రజాహిత యాత్రగా నామకరణం కూడా చేశారు. బండి సంజయ్ చేపట్టే పాదయాత్రతో..

Bandi Sanjay: మరోసారి పాదయాత్ర చేసేందుకు బండి సంజయ్ సన్నద్ధం

Bandi Sanjay

Updated On : February 7, 2024 / 9:26 PM IST

బీజేపీ ఎంపీ బండి సంజయ్ మరోసారి పాదయాత్ర చేసేందుకు సిద్ధమవుతున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బండి సంజయ్‌ మరో యాత్రకు సన్నద్ధమవుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల ముందు రాష్ట్రమంతటా చుట్టేసిన బండి సంజయ్‌ ఈసారి.. తన సెగ్మెంట్‌ వరకే పాదయాత్రకు ప్లాన్ చేశారు. ఎన్నికల నాటికి కరీంనగర్ పార్లమెంట్ నియెజకవర్గమంతా కవర్‌ అయ్యేలా రూట్ మ్యాప్‌పై కసరత్తు చేస్తున్నారు.

ప్రజల్లో నాయకులకు గ్రాఫ్ పెరగాలంటే సేవా కార్యక్రమాలతో పాటు పాదయాత్ర కూడా కీలక అస్త్రంగా మారింది. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఎంపీ బండి సంజయ్ మరో పాదయాత్రకు శ్రీకారం చుట్టబోతున్నారు. ఈ పాదయాత్రకు ప్రజాహిత యాత్రగా నామకరణం కూడా చేశారు. బండి సంజయ్ చేపట్టే పాదయాత్రతో ఓటింగ్ శాతం పెరుగుతుందని ఆ పార్టీ శ్రేణులు అంచనా వస్తున్నారు.

కేంద్ర పథకాలను జనంలోకి తీసుకెళ్లడమే ధ్యేయంగా.. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంపై మళ్లీ కాషాయ జెండా ఎగరవేయడమే లక్ష్యంగా ఈ యాత్ర కొనసాగనుంది. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని అన్ని మండలాలను, వీలైనన్ని ఎక్కువ గ్రామాల్లో పాదయాత్ర చేసేలా రూట్ మ్యాప్‌ను సిద్ధం చేస్తున్నారు.

ఈ నెల 10నుంచి బండి సంజయ్‌ పాదయాత్ర మొదలు కానుంది. కొండగట్టు అంజన్న ఆలయంలో పూజలు నిర్వహించి మేడిపల్లి కేంద్రం నుండి యాత్రను ప్రారంభించనున్నారు. అక్కడి నుంచి కొండాపూర్‌, రంగాపూర్, భీమారం, మన్నేగూడ, బొమ్మెన, దూలూరు, సిరికొండ, కథలాపూర్ వరకు యాత్ర కొనసాగనుంది.

ప్రజాహిత యాత్ర తొలివిడతలో వేములవాడ, సిరిసిల్ల నియోజకవర్గాల్లో సాగనుంది. సిరిసిల్ల జిల్లాలోని తంగళ్లల్లిలో తొలివిడత ముగింపు సభను నిర్వహించనున్నారు. ఈ రెండు నియెజకవర్గాల్లో 119 కిలోమీటర్ల మేర బండి సంజయ్ పాదయాత్ర కొనసాగనుంది.

ఇప్పటికే పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో సంజయ్ విస్తృతంగా పర్యటనలు చేస్తున్నారు. అభివృద్ధి పనుల పురోగతిని సమీక్షిస్తున్నారు. ఇక గ్రామాల్లో రాత్రి బస చేస్తూ.. ఆయా గ్రామాల్లోని సమస్యలను నేరుగా ప్రజలనే అడిగి తెలుసుకుంటున్నారు.

పార్లమెంట్ పరిధిలోని 7 నియెజకవర్గాల్లోని మండలాల్లో యాత్ర కొనసాగించడం వల్ల అధికసంఖ్యలో ప్రజలను కలిసే అవకాశముందని బీజేపీ శ్రేణులు భావిస్తున్నారు. నరేంద్రమోదీ ప్రభుత్వం గ్రామాల, పట్టణాల అభివృద్ధికి వెచ్చించిన నిధులను, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ఈ యాత్ర ద్వారా వివరించబోతున్నారు.

Pawan Kalyan: ఏపీలో ఏ పథకమూ ఆగదు.. మేం మరింత ఇస్తాం.. అంతేకాదు..: పవన్ కల్యాణ్