Eatala Rajendar: కడుపులో కత్తులు పెట్టుకుని నాపై కుట్రలు చేస్తున్నారు.. బీజేపీలో ఈటల వ్యాఖ్యల కలకలం.. పార్టీ అధ్యక్షుడు కీలక ఆదేశాలు..
వీధి పోరాటాలు మనకు అవసరం లేదన్న ఈటల.. మనపై జరుగుతున్న కుట్రలను తిప్పికొడదామని అనుచరులతో అన్నారు.

Eatala Rajendar: కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గం బీజేపీలో వర్గ విబేధాలు తారస్థాయికి చేరాయి. ఈటల వర్సెస్ బండి సంజయ్ వర్గం అన్నట్లుగా పరిస్థితులు మారుతున్నాయి. ఇటీవల బండి సంజయ్ చేసిన కామెంట్స్ మరింత హీట్ ను పెంచాయి. రెండు రోజుల క్రితం హుజూరాబాద్ లో పర్యటించిన బండి సంజయ్ వర్గ విబేధాలపై కీలక వ్యాఖ్యలు చేశారు.
పార్టీలో గ్రూపులు కడితే లోకల్ బాడీ ఎన్నికల్లో టికెట్లు ఇచ్చేదే లేదని తేల్చి చెప్పారు. దీంతో ఈటల వర్గానికి చెందిన వారిలో తీవ్ర ఆందోళన నెలకొంది. తమకు టికెట్లు దక్కుతాయో లేదోనని వారు వర్రీ అవుతున్నారు. బండి సంజయ్ కామెంట్స్ పై ఈటల వర్గం సీరియస్ అయ్యింది. తాడోపేడో తేల్చుకోవడానికి శామీర్ పేట్ లోని ఈటల ఇంటికి వెళ్లారు. హుజూరాబాద్ లో తమకు ప్రాధాన్యం ఇవ్వాలని వారు ఈటలను కోరారు.
ఈ సందర్భంగా తన అనుచరులను ఉద్దేశించి మాట్లాడిన ఈటల రాజేందర్ పరోక్షంగా బండి సంజయ్ ను టార్గెట్ చేశారు. తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కడుపులో కత్తులు పెట్టుకుని నాపై కుట్రలు చేస్తున్నారని ఈటల సంచలన ఆరోపణలు చేశారు. రాజకీయాల్లో అబద్దాల పునాదులపై కొందరు బతుకుతున్నారని తీవ్రంగా మండిపడ్డారు. సోషల్ మీడియాలో తనపై కొందరు కుట్రలు చేస్తున్నారని ఆరోపణలు గుప్పించారు. వీధి పోరాటాలు మనకు అవసరం లేదన్న ఈటల..మనపై జరుగుతున్న కుట్రలను తిప్పికొడదామని అనుచరులకు పిలుపునిచ్చారు.
సోషల్ మీడియాలో తనను రెచ్చగొడుతున్న వారిని హెచ్చరిస్తున్నట్లు చెప్పారు. తనపై జరుగుతున్న కుట్రలపై హైకమాండ్ కు ఫిర్యాదు చేస్తానన్నారు ఈటల. తాను పార్టీలో చేరకముందు హుజూరాబాద్ లో బీజేపీకి కనీసం క్యాడర్ కూడా లేదన్నారు. తాను వచ్చాకే కరీంనగర్ లో పార్లమెంటులో బీజేపీకి 50వేల ఓట్ల మెజారిటీ, హుజూరాబాద్ సెగ్మెంట్ లో ఎంపీ ఎన్నికల్లో బీజేపీకి ఎక్కువ ఓట్లు వచ్చాయన్నారు. స్థానిక ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటానన్న ఈటల రాజేందర్.. హుజూరాబాద్ లో ప్రతీ వార్డు మెంబర్, సర్పంచ్ గా మన వాళ్లే ఉంటారని స్పష్టం చేశారు.
”హుజూరాబాద్ ప్రజలు నా వెంట ఉన్నారు. ఆనాటి సమైక్య ముఖ్యమంత్రులు కూడా నా నియోజకవర్గానికి నిధులు ఇచ్చేవారు. శత్రువుతో నేరుగా కొట్లాడతా. కడుపులో కత్తులు పెట్టుకుని కౌగిలించుకోవడం నాకు రాదు. కోవర్టులు రాజకీయాల్లోనే కాదు అన్నింట్లో ఉంటారు. వారి గురించి బాధపడకండి. నా చరిత్ర ఏంటో ప్రజలకు తెలుసు. ఎంతవరకు ఓపిక పట్టాలో తెలుసు. పదవుల కోసం పాకులాడే రకం కాదు నేను. ఏ పార్టీలో పని చేస్తే ఆ పార్టీకి అంకితభావంతో ఉంటా. నా అనుభవం వాడుకుంటే పార్టీకి ఉపయోగపడుతుంది. హుజురాబాద్ స్థానిక సంస్థల ఎన్నికలో మన వాళ్లే ఉంటారు.
ఇక నుంచి 10 రోజులకు ఒకసారి హుజురాబాద్ వస్తా. కార్యకర్తలు కుంగిపోవద్దు. మీ వెంటే ఉంటా, మిమ్మల్ని గెలిపించుకుంటా. రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి, కేసీఆర్ లాంటి వాళ్ళతోనే నేను కొట్లాడా. నేను ప్రజల నుంచి వచ్చిన వాడిని. ప్రజలే నాకు న్యాయ నిర్ణేతలు’’ అని ఈటల రాజేందర్ అన్నారు. మొత్తంగా నో స్ట్రీట్ ఫైట్ ఓన్లీ స్ట్రైట్ ఫైట్ అంటూ ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలు బీజేపీ శ్రేణుల్లో దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.
ఈటల వ్యాఖ్యల దుమారం.. బీజేపీ అధ్యక్షుడు కీలక ఆదేశాలు..
ఈటల అంశంపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు.. బీజేపీ అధికార ప్రతినిధులతో ఫోన్ లో మాట్లాడారు. ఈటల వ్యాఖ్యలపై ఎవరూ స్పందించద్దని పార్టీ నేతలకు సూచించారు. అంతేకాదు పార్టీ నేతలకు లైన్ కూడా ఇచ్చారాయన. డిబేట్స్, ప్రెస్ మీట్స్, మీడియా ప్రశ్నలపై స్పందించవద్దని ఆదేశించారు. ఈ అంశంపై జాతీయ నాయకత్వం పరిశీలిస్తుందన్నారు. అప్పటివరకు ఎవరూ కూడా తొందర పడొద్దని, స్పందించవద్దని రాంచందర్ రావు ఆదేశించారు. తనపై కుట్రలు చేస్తున్నారు అంటూ సొంత పార్టీ నేతలపైనే ఈటల రాజేందర్ చేసిన ఘాటు వ్యాఖ్యలు బీజేపీ శ్రేణుల్లో దుమారం రేపాయి.