Eatala Rajender : ఈటల రాజేందర్ ఉగ్రరూపం.. రియల్ ఎస్టేట్ బ్రోకర్ చెంప పగలగొట్టిన బీజేపీ ఎంపీ, కారణం ఏంటంటే..
కబ్జాదారులు పేదల జోలికి వస్తే బీజేపీ చూస్తూ ఊరుకోదని వార్నింగ్ ఇచ్చారాయన.

Eatala Rajender : మేడ్చల్ జిల్లా ఘట్ కేసర్ మండలం కొర్రెముల గ్రామంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. రియల్ ఎస్టేట్ బ్రోకర్ పై బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ చేయి చేసుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. తప్పుడు డాక్యుమెంట్లు తయారు చేసి భూములు కబ్జా చేస్తున్నారని ఈటల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితులు ఫిర్యాదు చేయడంతో ఉగ్రరూపం దాల్చిన ఈటల రాజేందర్.. రియల్ ఎస్టేట్ బ్రోకర్ చెంప చెళ్లుమనిపించారు. ఆ వెంటనే బీజేపీ కార్యకర్తలు బ్రోకర్ ను చితకబాదారు.
రియల్ ఎస్టేట్ బ్రోకర్లకు అధికారులు కొమ్ము కాస్తున్నారు..
ఈ క్రమంలోనే రియల్ ఎస్టేట్ కార్యాలయం దగ్గర స్థానికులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. పేదల భూముల జోలికి వస్తే చూస్తూ ఊరుకునేది లేదని ఈటల రాజేందర్ హెచ్చరించారు. రియల్ ఎస్టేట్ బ్రోకర్లకు అధికారులు కొమ్ము కాస్తున్నారని ఆయన ఆరోపించారు. భూ విక్రయం విషయంలో తప్పుడు డాక్యుమెంట్లు క్రియేట్ చేసి ప్రజలను మోసం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.
Also Read : వరుసగా సినీ ప్రముఖులపై ఐటీ దాడులు.. దిల్ రాజు భార్య ఏమన్నారంటే..
కబ్జాదారులు పేదల జోలికి వస్తే బీజేపీ చూస్తూ ఊరుకోదు..
కబ్జాదారులు పేదల జోలికి వస్తే బీజేపీ చూస్తూ ఊరుకోదని వార్నింగ్ ఇచ్చారాయన. అక్రమాలకు పాల్పడుతున్న రియల్ ఎస్టేట్ బ్రోకర్లను జైల్లో పెట్టాలన్నారు. రియల్ ఎస్టేట్ దోపిడీలపై సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాస్తానని ఎంపీ ఈటల అన్నారు.
”హైదరాబాద్ చుట్టుపక్కల 40ఏళ్ల కిందట చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునే వాళ్లు, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్లు, ఆనాడు భూములు కొనుక్కుని ఇల్లు కట్టుకుంటున్న సందర్భంలో మళ్లీ వేరే రిజిస్ట్రేషన్ అని చెప్పి దొంగ డాక్యుమెంట్లు సృష్టించుకుని, పోలీసులను, రెవెన్యూ అధికారులను మేనేజ్ చేస్తూ పేదల ఇళ్లపై దౌర్జన్యం చేస్తున్నారు.
మొన్న బాలాజీ నగర్, జవహర్ నగర్ లో ఇలానే చేస్తే మేమే వెళ్లాము. 40 గజాలు, 60 గజాల్లో ఇళ్లు కట్టుకున్న పేదలు వాళ్లు. వాళ్లు 40వేలు, 50వేలు జమ చేసుకుని రేకుల షెడ్డు వేసుకుంటే కూలగొట్టడానికి పోతున్నారు. 50వేల రూపాయల నుంచి 2లక్షల రూపాయలు ఇస్తే తప్ప పేదలు రేకుల షెడ్డు వేసుకునే పరిస్థితి లేదు.
పేదలకు బాధలు, కన్నీళ్లు తప్ప మరొకటి లేవు..
దాని మీద నేను రెవెన్యూ మంత్రితో మాట్లాడా. కలెక్టర్ తో మాట్లాడాను. సీపీతోనూ మాట్లాడా. 6 నెలల నుంచి ప్రతి నిత్యం కూల్చివేతల బాధలు తప్ప, పేదల కన్నీళ్లు తప్ప మరొకటి లేదు. మా ఇల్లు కూలగొడుతున్నారు, మా జాగాలు గుంజుకుంటున్నారు అని పేదలు కన్నీటిపర్యంతం అవుతున్నారు. ఇంత పెద్ద విశ్వనగరం అని చెబుతున్నారు, కానీ మా ప్రాణాలకు రక్షణ లేకుండా పోతుందని పేదలు కన్నీళ్లు పెడుతున్నారు” అని ఈటల రాజేందర్ అన్నారు.
Also Read : ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి షాక్ ఇచ్చిన సొంత పార్టీ నేతలు.. ఏమైందో తెలుసా?