కేంద్ర క్యాబినెట్‌లో తెలంగాణకు దక్కే పదవులు ఎన్ని? రేసులో ఎవరెవరు ఉన్నారు?

తమకు అనుకూలంగా ఉన్న నేతలతో కేంద్ర మంత్రి పదవి కోసం లాబీయింగ్ మొదలుపెట్టారు టీ బీజేపీ నేతలు.

కేంద్ర క్యాబినెట్‌లో తెలంగాణకు దక్కే పదవులు ఎన్ని? రేసులో ఎవరెవరు ఉన్నారు?

Updated On : June 9, 2024 / 1:03 AM IST

Union Cabinet : తెలంగాణ బీజేపీలో ఎవరిని కదిపినా ఒక్కటే మాట. ఏ ఇద్దరు కలిసిని ఒక్కటే చర్చ. తెలంగాణ నుంచి ఎవరు కేంద్ర మంత్రి కాబోతున్నారు? ఎన్ని పదవులు దక్కుతాయి? ఇదే స్థాయిలో నేతలు కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యారు. తమకు అనుకూలంగా ఉన్న నేతలతో కేంద్ర మంత్రి పదవి కోసం లాబీయింగ్ మొదలుపెట్టారు టీ బీజేపీ నేతలు.

ఢిల్లీలో జరిగే పరిణామాలను తెలంగాణ బీజేపీ శ్రేణులు ఆసక్తిగా గమనిస్తున్నాయి. ఢిల్లీ వెళ్లిన నేతలను ఎప్పటికప్పుడ అక్కడ ఏం జరుగుతోంది అని ఆరా తీస్తున్నాయి. రాష్ట్రం నుంచి ఎంతమందికి కేంద్ర మంత్రి పదవులు దక్కబోతున్నాయి? ఎవరెవరికి పదవులు ఇవ్వనున్నారు? అందులో తమ నాయకుడు ఉన్నాడా? అని అడుగు తెలుసుకుంటున్నారు. తమ నాయకుడు పార్టీకి చేసిన సేవలు చెప్పుకుంటూ ఆయనకు ఎందుకు పదవి వస్తుందో వివరిస్తున్నారు.

బీజేపీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ తెరవెనుక స్టోరీ నడుపుతున్నట్లు సమాచారం. దీంతో ఢిల్లీలో ఉన్న తెలంగాణ బీజేపీ ఎంపీలు తమ మంత్రి పదవి కోసం లాబీయింగ్ మొదలు పెట్టారు. వాళ్లకు సన్నిహితంగా ఉండే జాతీయ నేతలతో కేంద్ర మంత్రి పదవి కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. తమకు అండగా నిలిచే ఆర్ఎస్ఎస్ పెద్దలతో మంతనాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. పదవి ఇస్తే రాష్ట్రంలో పార్టీకి ఏ విధంగా ఉపయోగపడుతుంది? గతంలో తాము పార్టీకి చేసిన సేవలు ఏంటి? అనే అంశాలను వివరిస్తున్నారు.

ప్రధానంగా కేంద్ర మంత్రి పదవులు ఆశిస్తున్న ఈటల రాజేందర్, బండి సంజయ్, డీకే అరుణ, ధర్మపురి అరవింద్ తమకు దగ్గరగా ఉన్న నేతలతో మంతనాలు జరుపుతున్నారు. కేంద్ర కేబినెట్ లో కిషన్ రెడ్డికి బెర్త్ ఖరారైనట్లు తెలుస్తోంది. అనుకున్నది అనుకున్నట్లు జరిగితే ఆదివారం నరేంద్ర మోదీతో పాటు అటు కిషన్ రెడ్డి కూడా ప్రమాణస్వీకారం చేస్తారని సమాచారం. తెలంగాణ నుంచి ఎవరెవరు కేంద్ర మంత్రులు అవుతారు అనే ఉత్కంఠ వీడాలంటే మరికొన్ని గంటలు వేచి చూడాల్సిందే.

Also Read : బీఆర్ఎస్‌కు చేదు అనుభవాలు.. పూర్తి వివరాలు ఇవిగో