Bandi Sanjay : గౌరెల్లి ప్రాజెక్టుతో నీళ్లు కాదు..రక్తం పారిస్తున్నారు-బండి సంజయ్ ఆరోపణ

గౌరెల్లిప్రాజెక్టుతో రాష్ట్రంలో రక్తం పారుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు.

Bandi Sanjay : గౌరెల్లి ప్రాజెక్టుతో నీళ్లు కాదు..రక్తం పారిస్తున్నారు-బండి సంజయ్ ఆరోపణ

Bandi Sanjay

Updated On : June 15, 2022 / 2:03 PM IST

Bandi Sanjay :  గౌరెల్లిప్రాజెక్టుతో రాష్ట్రంలో రక్తం పారుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. ఈరోజు ఆయన రాజ్ భవన్ లో గవర్నర్ తమిళ్ సై సౌందర్ రాజన్ ను కలిసి రాష్ట్ర ప్రభుత్వ   వైఫల్యాలపై వినతి పత్రం సమర్పించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ… గౌరెల్లి ప్రాజెక్ట్ రభస 12 ఏళ్లుగా సాగుతోందని ఇంతవరకు నిర్వాసితులకు నష్టపరిహారం అందించలేదని ఆయన అన్నారు.

ఎన్జీటి అనుమతిలేకుండా ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టారని…. అభివృధ్దికి సహకరిస్తామని చెపుతున్నా ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. ప్రజలకు న్యాయం చేశాకే ప్రాజెక్టుల నిర్మాణం చేపడతామని గత ఎన్నికల సమయంలో కేసీఆర్ ప్రజలకు హామీ ఇచ్చారని ఆయన గుర్తు చేశారు. గౌరెల్లిలో అర్ధరాత్రి పూట మహిళలు, వృధ్ధులు అని చూడకుండా పోలీసులు లాఠీ చార్జి చేసారని సంజయ్ తెలిపారు.

మహిళలపై   అసభ్యంగా ప్రవర్తించారని… అసభ్య పదజాలంతో దూషించారని ఆయన చెప్పారు. పోలీసులపై దాడి చేసిన టీఆర్ఎస్ నాయకులపై కాకుండా ప్రజలపై ఎందుకు కేసులు పెడుతున్నారని ఆయన ప్రశ్నించారు.

పంజాబ్ లో  రైతులకు  ఇచ్చిన డబ్బు గౌరెల్లిలో నిర్వాసితులకు ఇవ్వవచ్చు కదా అని బండి సంజయ్ సూచించారు.  గౌరెల్లిలో పోలీసుల అరాచకాలపైనా,  రాష్ఠ్రంలో   సర్పంచ్ ల అధికారాలు తీసేసిన అంశంపైనా,  బాసర ట్రిపుల్ ఐటీ లో వైస్  చాన్సలర్ ను నియమించాలని విద్యార్ధుల నిరసన…. వంటి అంశాలపై  బండి సంజయ్ గవర్నర్ కు వినతి పత్రం సమర్పించారు.