మార్పులు, చేర్పులపై బీఆర్ఎస్‌ ఫుల్‌ ఫోకస్‌, వారికి పార్టీ నిర్వహణ బాధ్యతలు..!

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేల వ్యవహార శైలి కారణంగానే పార్టీకి తీవ్రంగా నష్టం జరిగిందన్న కార్యకర్తల అభిప్రాయాలతో అధిష్టానం ఏకీభవించింది.

మార్పులు, చేర్పులపై బీఆర్ఎస్‌ ఫుల్‌ ఫోకస్‌, వారికి పార్టీ నిర్వహణ బాధ్యతలు..!

Changes In BRS Party

Updated On : January 20, 2024 / 8:00 AM IST

BRS : తెలంగాణలో పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్‌.. ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షంగా మారింది. తమ ప్రభుత్వం ఉన్న సమయంలో ఎమ్మెల్యేలకు అన్ని అధికారాలు కల్పించింది. నియోజకవర్గానికి ఎమ్మెల్యేనే బాస్‌ అంటూ వారిపైనే ఆధారపడింది. ఇప్పుడు పరిస్థితులు తారుమారు కావడంతో.. మార్పులు చేసే పనిలో పడింది గులాబీ అధిష్టానం. పార్టీ ఓడిపోయిన నియోజకవర్గాల్లో.. ఎమ్మెల్సీలకు పార్టీ నిర్వహణ బాధ్యతలు అప్పగించే ప్రణాళిక రచిస్తోంది.

వారి వల్లే పార్టీకి తీవ్ర నష్టం..!
రాష్ట్ర ఆవిర్భావం తర్వాత రెండు విడతలుగా అధికారం దక్కించుకున్న గులాబీ పార్టీ… పూర్తిగా ఎమ్మెల్యేల కేంద్రంగానే పాలన నిర్వహించింది. ఎమ్మెల్యేలకు నియోజకవర్గంలో విశేష అధికారాలను కల్పిస్తూ ఇతర నేతలను కనీసం పరిగణలోకి తీసుకోలేదన్న అపవాదు మూటగట్టుకుంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేల వ్యవహార శైలి కారణంగానే పార్టీకి తీవ్రంగా నష్టం జరిగిందన్న కార్యకర్తల అభిప్రాయాలతో అధిష్టానం ఏకీభవించింది. ఇకపై పార్టీ అధిష్టానం నిర్ణయాల ఆధారంగానే ప్రతిఒక్కరు అడుగులు వేసేలా ప్రణాళిక రూపొందిస్తోంది.

Also Read : టీఎస్పీఎస్సీ కొత్త టీమ్‌ కోసం సర్కార్‌ కసరత్తు.. నిరుద్యోగుల కోసం.. ఏం జరుగుతుందో తెలుసా?

ఆ బాధ్యతలు ఎమ్మెల్సీలకు..
ఈ క్రమంలోనే బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీలతో భేటీ అయ్యారు పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌. రాబోయే రోజుల్లో ఎమ్మెల్సీల ప్రాధాన్యత గురించిన వివరించిన ఆయన.. పలు విషయాలపై దిశానిర్దేశం చేశారు. శాసనసభలో బలమైన ప్రతిపక్షంగా తమ గళం వినిపిస్తామని.. అదే సమయంలో శాసనమండలిలో కూడా ఎమ్మెల్సీలు కీలక పాత్ర పోషించాలని సూచించారు. ఇదే సమయంలో పార్టీకి సంబంధించిన వ్యవహారాల్లో ఎమ్మెల్సీలు చురుగ్గా పాల్గొనాలని.. ఓడిపోయిన నియోజకవర్గాల్లో పార్టీ తరఫున సమన్వయం చేసుకోవాల్సిన బాధ్యతలు తీసుకోవాలని సూచించారు. తద్వారా ఆ నియోజకవర్గాల్లో ఎమ్మెల్సీలకు ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించే అవకాశముందన్న సంకేతాలు ఇచ్చారు.

Also Read : తొలి బ‌డ్జెట్‌పై క‌స‌ర‌త్తు ప్రారంభించిన రేవంత్ ప్రభుత్వం

కేసీఆర్ కీలక నిర్ణయం..
ఇక పార్టీని గ్రామస్థాయి నుంచి పొలిట్‌ బ్యూరో వరకు పునర్వ్యవస్థీకరించాలని కేసీఆర్‌ నిర్ణయం తీసుకున్నారు. అన్ని జిల్లాల్లో పార్టీ కార్యాలయాలు ఉన్న క్రమంలో.. జిల్లా కేంద్రంగా బీఆర్‌ఎస్‌ కార్యకలాపాలను ముమ్మరం చేసే ప్రణాళిక రచించారు. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు లేని చోట ఎమ్మెల్సీల ద్వారా ఆ లోటును భర్తీ చేసి.. ముందుకు వెళ్లేందుకు వ్యూహం సిద్ధం చేస్తోంది గులాబీ పార్టీ. పార్లమెంట్‌ ఎన్నికల్లో త్రిముఖ పోటీ ఉండే అవకాశమున్న నేపథ్యంలో అందరి సేవలను వినియోగించుకోవడం ద్వారా తమ అభ్యర్థులకు విజయావకాశాలు పెరుగుతాయని భావిస్తోంది బీఆర్‌ఎస్‌.

అటు.. పార్టీ అధినేత కేసీఆర్‌ సైతం ఎమ్మెల్సీలతో త్వరలోనే సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా శాసనమండలిలో పార్టీ నేతలను ఎంపిక చేయనున్నారు.