తొలి బడ్జెట్‌పై కసరత్తు ప్రారంభించిన రేవంత్ ప్రభుత్వం
ప్రస్తుత రాష్ట్ర ఆర్థిక సరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేస్తున్న రేవంత్ ప్రభుత్వం.. అందుకు అనుగుణంగా బడ్జెట్ రూపొందించడంపై ప్రత్యేక దృష్టిపెట్టింది. బడ్జెట్ కసరత్తులో వేగం పెంచింది.

Telangana CM Revanth Reddy focus on budget prepation
CM Revanth Reddy: రేవంత్ సర్కార్ అధికారంలోకి వచ్చి.. నెలరోజులు గడిచింది. అధికారికంగా పరిపాలనపై పట్టుపెంచుకునే దిశగా అడగులు వేస్తూనే… మరోవైపు బడ్జెట్ రూపకల్పనపై దృష్టి సారించింది. ప్రస్తుత రాష్ట్ర ఆర్థిక సరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేస్తున్న రేవంత్ ప్రభుత్వం.. అందుకు అనుగుణంగా బడ్జెట్ రూపొందించడంపై ప్రత్యేక దృష్టిపెట్టింది. బడ్జెట్ కసరత్తులో వేగం పెంచింది.
BRS ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణ పాటించకపోవడంతో రాష్ట్రం అప్పుల కుప్పగా మారిందని రేవంత్ రెడ్డి సర్కార్ ఆరోపిస్తోంది. అధికారంలోకి రాగానే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ప్రజలకు చెప్పేందుకు శ్వేతపత్రం విడుదల చేసింది. ఇందుకు అనుగుణంగా ప్రస్తుతం బడ్జెట్ రూపకల్పన కసరత్తు ప్రారంభించింది. అన్ని శాఖల వారీగా లెక్కలు తీస్తోంది. ఆదాయ వనరుల సమీకరణపై దృష్టి సారించింది. శాఖలవారీగా ప్రభుత్వానికి రావాల్సిన పెండింగ్ బకాయిలపై ఫోకస్ పెట్టింది సర్కార్.
గత ప్రభుత్వం ఆదాయం పెంచుకునేందుకు.. భూముల అమ్మకం చేపట్టింది. దీనిద్వారా ప్రభుత్వానికి సమకూరిన ఆదాయం ఎంత..? ఇప్పటివరకు ఎన్ని బకాయిలు ఉన్నాయనే లెక్కలు తీస్తున్నారు. జాయింట్ వెంచర్, రాయల్టీలో బకాయిలపై ఫోకస్ చేసింది సర్కార్. పరిశ్రమల శాఖ పరిధిలోని జాయింట్ వెంచర్స్ నుంచి ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయ వనరుల గురించి ఇప్పటికే లెక్కలు తీసుకుంది. ప్రభుత్వానికి 955 కోట్లు రావాల్సి ఉండగా.. 430 కోట్లు వచ్చాయని గుర్తించారు. మిగతా 525 కోట్ల బకాయిలు రాబట్టేందుకు ప్రత్యేక కార్యాచరణతో ముందుకువెళ్లనున్నారు. ప్రభుత్వానికి రావాల్సిన ప్రతీపైసాను సమీకరించే బాధ్యతను ఆయా శాఖల అధికారులకు అప్పగించింది ప్రభుత్వం.
Also Read: బండి సంజయ్ స్వయంగా ఈ పిలుపునిస్తున్నారు: మాజీ మంత్రి కేటీఆర్
పెండింగ్‌లో ఉన్న భూముల క్రమబద్ధీకరణ అంశాన్ని ఆదాయ వనరుగా మార్చుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. త్వరలోనే LRS, BRSపై నిర్ణయం తీసుకోవడం ద్వారా ప్రజలకు కొంత స్వాంతన చేకూర్చడంతో పాటు ఖజానాకు ఆదాయం పెంచుకోవాలని భావిస్తుంది. రాయల్టీపై రావాల్సిన ఆదాయాన్ని వసూల్ చేయడం కోసం అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని మైనింగ్ శాఖను ఆదేశించింది. రాబోయే రోజుల్లో ప్రభుత్వ పథకాలు పూర్తిస్థాయిలో అమలు కావాలంటే భారీగా నిధులు అవసరం ఉంది. ఇందులో భాగంగా అన్ని శాఖల్లో పెండింగ్ నిధుల సమీకరణలో వేగం పెంచింది సర్కార్.