బండి సంజయ్ స్వయంగా ఈ పిలుపునిస్తున్నారు: మాజీ మంత్రి కేటీఆర్
ఇప్పుడు అదే రేవంత్ రెడ్డి దావోస్ సాక్షిగా అదానీతో అలయ్ బలయ్ చేసుకుంటున్నారని కేటీఆర్ అన్నారు. ఇటువంటి రాజకీయాలను..

KTR
KTR: బీజేపీ, కాంగ్రెస్‌పై తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం తెలంగాణ భవన్ లో మహబూబ్ నగర్ పార్లమెంట్ సన్నాహక సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్- బీజేపీ కుమక్కు రాజకీయాలను ప్రజలకు వివరించాలని తమ పార్టీ శ్రేణులకు సూచించారు.
కాంగ్రెస్-బీజేపీ కలిసి బీఆర్ఎస్‌ను ఓడించాలని, బొంద పెట్టాలని ఎంపీ బండి సంజయ్ స్వయంగా పిలుపునిస్తున్నారని కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీనేమో మోదీ-అదానీ ఒక్కటే అని అంటున్నారని చెప్పారు. మొన్న రేవంత్ రెడ్డి కూడా ఇదే మాట అన్నారని తెలిపారు.
ఇప్పుడు అదే రేవంత్ రెడ్డి దావోస్ సాక్షిగా అదానీతో ‘అలయ్ బలయ్’ చేసుకుంటున్నారని కేటీఆర్ అన్నారు. ఇటువంటి రాజకీయాలను కాంగ్రెస్ పార్టీ చేస్తుందని చెప్పారు. తెలంగాణలో అధికారంలో లేనప్పుడు అదానీ దేశానికి శత్రువు అని చెప్పిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మాత్రం ఆయనతో ఎందుకు పనిచేస్తుందో చెప్పాలని నిలదీశారు.
బీజేపీ ఆదేశాల మేరకే అదానీతో తెలంగాణ ప్రభుత్వము కలిసి పనిచేస్తోందని కేటీఆర్ అన్నారు. ఆరు నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు తిరగబడతారని కేటీఆర్ చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీల సంఖ్య సరిగ్గా 420 అయ్యాయని ఎద్దేవా చేశారు. రైతులకు రూ.10,000 కాదు.. రూ.15,000 ఇస్తానని అన్నారని చెప్పారు. రూ.2వేల పెన్షన్ రూ.4,000 చేస్తా అన్నారని తెలిపారు.
వాటిని అమలు చేయాలని గుర్తు చేస్తున్నామని కేటీఆర్ చెప్పారు. పాలమూరు-రంగారెడ్డికి జాతీయ హోదాపై కాంగ్రెస్ పార్టీ చేతులు ఎత్తేసిందని అన్నారు. ఎరువుల కోసం లైన్ లో నిలబడే పరిస్థితులు మళ్లీ వచ్చాయని విమర్శించారు. ఇదే పరిస్థితి రాష్ట్రంలో కొనసాగితే ఆరు నెలల్లోనే ప్రభుత్వంపై ప్రజలు తిరగబడే పరిస్థితి వస్తుందని అన్నారు.
Also Read: తెలంగాణలో పెరిగిన ఓటు బ్యాంకు.. హ్యట్రిక్ కొట్టేందుకు వ్యూహాలు రచిస్తున్న బీజేపీ