Kasireddy Narayan Reddy: కాంగ్రెస్‌లోకి ఖాయమా..? రేవంత్‌తో కసిరెడ్డి నారాయణ రెడ్డి భేటీ.. కేటీఆర్‌తో భేటీ అయిన రెండురోజుల్లోనే ఇలా..

ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి కల్వకుర్తి నియోజకవర్గం నుంచి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బరిలోకి దిగాలని భావించారు. అయితే, ఇటీవల సీఎం కేసీఆర్ ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో కల్వకుర్తి నియోజకవర్గానికి సిట్టింగ్ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్‌కే మరోసారి అవకాశం కల్పించారు.

Kasireddy Narayan Reddy: కాంగ్రెస్‌లోకి ఖాయమా..? రేవంత్‌తో కసిరెడ్డి నారాయణ రెడ్డి భేటీ.. కేటీఆర్‌తో భేటీ అయిన రెండురోజుల్లోనే ఇలా..

Kasireddy Narayan Reddy and Revanth Reddy

Updated On : October 1, 2023 / 10:52 AM IST

BRS MLC Kasireddy Narayan Reddy: తెలంగాణలో మరో నెల, రెండు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు ఈసీ కసరత్తు మొదలు పెట్టింది. దీంతో రాజకీయ పార్టీల అధిష్టానాలు నియోజకవర్గాల వారిగా తమతమ అభ్యర్థులను ఎంపిక చేస్తున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ అధిష్టానం నియోజకవర్గాల వారిగా అభ్యర్థులనుసైతం ప్రకటించింది. ఈ క్రమంలో ఆ పార్టీలో టికెట్ ఆశించి భంగపడ్డవారు బీజేపీ, కాంగ్రెస్ పార్టీల్లోకి వెళ్లి ఎన్నికల బరిలో నిలిచేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరుతారని ప్రచారం జరుగుతుంది. తాజాగా ఆయన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి‌తో జూబ్లిహిల్స్‌లోని నివాసంలో భేటీ అయ్యారు. దీంతో నారాయణ రెడ్డి కాంగ్రెస్‌లో చేరుతారన్న ప్రచారానికి బలం చేకూరినట్లయింది.

Read Also : Telangana BJP : దూకుడు పెంచిన బీజేపీ.. రంగంలోకి ఎన్నికల కమిటీ సభ్యులు.. మోదీ రాకతో మరింత జోష్

ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి కల్వకుర్తి నియోజకవర్గం నుంచి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బరిలోకి దిగాలని భావించారు. అయితే, ఇటీవల సీఎం కేసీఆర్ ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో కల్వకుర్తి నియోజకవర్గానికి సిట్టింగ్ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్‌కే మరోసారి అవకాశం కల్పించారు. కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, కసిరెడ్డి నారాయణ రెడ్డి మధ్య విబేధాలు ఉన్నాయి. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే కల్వకుర్తి నియోజక వర్గం నుంచి బరిలోకి దిగాలని నారాయణ రెడ్డి భావించినప్పటికీ చుక్కెదురైంది. ఆ సమయంలో బీఆర్ఎస్ అదిష్టానం నారాయణ రెడ్డికి సర్దిచెప్పి ఎమ్మెల్సీ పదవికి హామీ ఇచ్చింది. 2021లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో నారాయణ రెడ్డికి ఎమ్మెల్సీకి సీఎం కేసీఆర్ అవకాశం కల్పించారు.

Read Also : Revanth Reddy : కాంగ్రెస్ ను అడ్డుకోవడం నీ వల్ల కాదు.. నీ అయ్య వల్ల కూడా కాదు : రేవంత్ రెడ్డి

త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కల్వకుర్తి నియోజకవర్గం నుంచి బరిలోకి దిగాలని కసిరెడ్డి నారాయణరెడ్డి భావించినప్పటికీ నిరాశే ఎదురైంది. దీంతో అధిష్టానం తీరుపై నారాయణ రెడ్డి అసంతృప్తిగా ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఆయన కాంగ్రెస్ పార్టీలో‌చేరి కల్వకుర్తి నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారని ప్రచారం జరుగుతుంది. ఈ ప్రచారం నేపథ్యంలో రెండురోజుల క్రితం మంత్రి కేటీఆర్‌తో కసిరెడ్డి నారాయణ రెడ్డి భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. దీంతో నారాయణ రెడ్డి పార్టీ మార్పుపై ఊహాగానాలకు తెరపడినట్లయింది. కానీ, ఆదివారం ఉదయం జూబ్లీహిల్స్‌లోని రేవంత్ రెడ్డి నివాసంలో కసిరెడ్డి నారాయణ రెడ్డి భేటీ కావటం చర్చనీయాంశంగా మారింది.

పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవితో కలిసి కసిరెడ్డి నారాయణ రెడ్డి రేవంత్‌తో భేటీ అయ్యారు. కల్వకుర్తి నియోజకవర్గం నుంచి కసిరెడ్డి నారాయణ రెడ్డిని బరిలోకి దింపేందుకు కాంగ్రెస్ అధిష్టానంసైతం సుముఖంగా ఉన్నట్లు సమాచారం. టికెట్ కన్ఫార్మ్ కావడంతోనే నారాయణ రెడ్డి రేవంత్ తో భేటీ అయ్యారని, త్వరలో ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకోబోతున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది.