సెక్రటేరియట్ వాస్తు మార్పుపై సర్కార్ వర్సెస్ బీఆర్ఎస్.. మెయిన్ గేట్ మూసివేత

ప్రస్తుత ప్రధాన మహా ద్వారాన్ని ఈశాన్యం వైపు మార్చుతుండగా, ఇకపై ఆ గేటు ద్వారానే సీఎం రేవంత్ రెడ్డి రాకపోకలు సాగేలా వాస్తులో మార్పులు చేర్పులు చేస్తున్నారు.

సెక్రటేరియట్ వాస్తు మార్పుపై సర్కార్ వర్సెస్ బీఆర్ఎస్.. మెయిన్ గేట్ మూసివేత

Updated On : November 8, 2024 / 9:44 PM IST

పాత్రలు మారాయి. అప్పుడు వాస్తును వ్యతిరేకించిన వారు..ఇప్పుడు వాస్తు మార్పులకు శ్రీకారం చుట్టారు. అప్పుడు వాస్తు మార్పులు చేసినవారు..ఇప్పుడు వాస్తు మార్పులపై ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ సెక్రటరియేట్లో వేగంగా వాస్తు మార్పులు చేస్తోంది రేవంత్ సర్కార్. బాహుబలి గేట్..ప్రధాన ముఖద్వారాన్ని శాశ్వతంగా మూసివేసి.. ఈశాన్యంలో మరో గేట్ పెట్టబోతున్నారు. అంతేకాదు ఈశాన్యం టు వాయువ్యం కలుపుతూ కొత్తగా రోడ్డు వేయబోతున్నారట. ఇదే ఇప్పుడు అధికార పార్టీ వర్సెస్ అపోజిషన్ మధ్య వాస్తు లొల్లికి దారి తీస్తోంది.

కేసీఆర్ హయాంలో వాస్తుకు ఎనలేని ప్రాధాన్యత ఉండేది. వాస్తు బాలేదనే పాత సెక్రటేరియట్ను కూల్చి కేసీఆర్ కొత్త సెక్రటేరియట్ కట్టారని అప్పల్లో కాంగ్రెస్ దుమ్మెత్తి పోసింది. కొడుకును సీఎం చేసేందుకు వాస్తు మార్పులు చేశారని..వందల కోట్లు ఖర్చు పెట్టి కొత్త సచివాలయం కట్టారని అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ విమర్శలు చేసింది.

కేసీఆర్ వాస్తు పిచ్చితో కోట్ల రూపాయల ప్రజాధనం వృథా చేస్తున్నారని..రేవంత్ రెడ్డి కోర్టుకు కూడా వెళ్లారు. సీన్ కట్ చేస్తే ఇప్పుడు రేవంత్ సీఎంగా ఉన్నారు. అదే సచివాలయంలో వాస్తు మార్పులకు శ్రీకారం చుట్టారు. అయితే కాంగ్రెస్ డబుల్ స్టాండ్పై గులాబీ పార్టీ గళమెత్తుతోంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గాయ్ గాయ్ చేసిన రేవంత్ రెడ్డి.. అధికారంలోకి వచ్చాక వాస్తు పేరుతో ప్రజాధనం వృథా చేస్తున్నారంటూ బీఆర్ఎస్ రివర్స్ అటాక్ చేస్తోంది.

జూన్‌లోనే స్వల్పంగా వాస్తు మార్పులు
సెక్రటేరియట్ భవనానికి చాలా వాస్తు దోషాలు ఉన్నట్లు గాంధీభవన్‌కు వాస్తు మార్పులు చేయించిన పండితులు చెప్పారట. సచివాలయంలో వాస్తు దోషాలు ఉండటం వల్లే కేసీఆర్ అధికారం కోల్పోయారన్న ప్రచారం కూడా జరుగుతోంది. ఈ క్రమంలోనే పండితులు సూచించినట్లుగా సెక్రటేరియట్ భవనానికి వాస్తు మార్పులు చేయాలని సీఎం రేవంత్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. జూన్‌లోనే నిపుణుల సూచనతో సెక్రటేరియట్ భవనానికి స్వల్పంగా వాస్తు మార్పులు చేశారు అధికారులు. ఇందులో భాగంగా సీఎం కాన్వాయ్ ఎంట్రీ ప్రధాన ద్వారాన్ని మార్చారు.

మళ్లీ ఏమైందో ఏమోగాని మరోసారి సెక్రటేరియట్లో వాస్తు మార్పులపై దృష్టి పెట్టారు రేవంత్ రెడ్డి. సీఎం ఆదేశాలతో వేగంగా సచివాలయం వెస్ట్ గేట్ నుంచి కాన్వాయ్కు ఎంట్రీ ఉండేలా, ఈస్ట్ గేట్ నుంచి సీఎం కాన్వాయ్ బయటికి వెళ్లేలా మార్పులు చేశారు.

ఇవీ మారనున్నాయి
పలు మార్పులు జరగబోతున్నాయి. ప్రస్తుతం తూర్పు దిశగా ఉన్న సచివాలయ ప్రధాన మహాద్వారం ఈశాన్యం వైపునకు మారనుంది. దీంతో పాటు ప్రస్తుతం సెక్రటేరియట్లోని ఆగ్నేయం వైపు ఉన్న గేటు నంబర్-2 నుంచి ఎన్టీఆర్గార్డెన్వైపున్న గేటు నంబర్-4 వరకు నేరుగా వెళ్లేలా రోడ్డును నిర్మించనున్నారు. సచివాలయంలో ప్రధాన ద్వారానికి ఎదురుగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలోనే..మార్పులు చేస్తున్నా.. అన్నీ వాస్తు ప్రకారం ఉండేలా పనులు చేపడుతున్నారు.

ఇందులో భాగంగానే ప్రస్తుత ప్రధాన మహా ద్వారాన్ని ఈశాన్యం వైపు మార్చుతుండగా, ఇకపై ఆ గేటు ద్వారానే సీఎం రేవంత్ రెడ్డి రాకపోకలు సాగేలా వాస్తులో మార్పులు చేర్పులు చేస్తున్నారు. అంతేకాదు ప్రస్తుతం సెక్రటేరియట్లోని ఆరో అంతస్తులో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి ఛాంబర్ను.. తొమ్మిదో అంతస్థులోకి మార్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు తొమ్మిదో అంతస్తులో సీఎం కార్యాలయం సిద్దమవుతున్నట్లు సమాచారం. ఇలా సెక్రటేరియట్ వాస్తు మార్పుల వ్యవహారం..అధికార విపక్షాల మధ్య డైలాగ్ వార్కు దారి తీస్తున్నాయి.

ఏపీలో వాలంటీర్ల వ్యవస్థ ఉంటుందా? లేదా? డిప్యూటీ సీఎం పవన్ వ్యాఖ్యల్లో అర్థమేంటి?