CBI : సీబీఐకి రెండు కేసులు.. కాళేశ్వరంతో పాటు మరో కేసు కూడా..
తెలంగాణలో రెండు కేసులు సీబీఐ (CBI) విచారించనుంది. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి కేసు.. మంథనిలో న్యాయవాద దంపతులను హత్య కేసులపై విచారణ జరపనుంది.

CBI
CBI : తెలంగాణలో రెండు కేసులు సీబీఐ విచారించనుంది. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని, దీనిపై జస్టిస్ ఘోష్ కమిషన్ మీద అసెంబ్లీలో చర్చించిన అనంతరం దీనిపై సీబీఐ విచారణకు ఇవ్వాలని అసెంబ్లీ తీర్మానించింది. దీంతో పాటు మరో కేసు కూడా సీబీఐ విచారణ జరపనుంది. గతంలో మంథనిలో న్యాయవాద దంపతులను హత్య చేసిన ఘటనకు సంబంధించిన కేసు కూడా సీబీఐతో విచారణ జరిపించాలని సుప్రీంకోర్టు గతంలో ఆదేశించింది.
Also Read: Telangana: శాసన మండలిలో బీఆర్ఎస్ రచ్చరచ్చ.. చైర్మన్ పోడియం చుట్టుముట్టి నినాదాలు.. మంత్రులు ఫైర్
తెలంగాణలో సీబీఐకి ఎంట్రీ..
ఈ రెండు కేసుల నేపథ్యంలో తెలంగాణలోకి సీబీఐ మళ్లీ ఎంట్రీ ఇవ్వనుంది. 2022లో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణలో సీబీఐ విచారణకు ఉండే జనరల్ కన్సెంట్ ను విత్ డ్రా చేసుకుంది. దీంతో సీబీఐ ఏదైనా కేసు విచారణ జరపాలంటే ప్రభుత్వం అందుకు అనుమతి ఇవ్వాలి. ఇప్పుడు రెండు కేసులను విచారించాల్సి రావడంతో రాష్ట్ర ప్రభుత్వం ఆ మేరకు ఆర్డర్స్ ఇవ్వాలి. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చిన జీవోను సవరిస్తూ తాజాగా మరో జీవోను రేవంత్ సర్కారు తీసుకురానుంది. దీంతో రెండు కేసుల విచారణకు సీబీఐకి రూట్ క్లియర్ అవుతుంది.
న్యాయవాద దంపతుల హత్యకేసు ఏంటి?
న్యాయవాద దంపతులు గట్టు వామనరావు, ఆయన భార్య నాగమణిలను 2021 ఫిబ్రవరి 17న పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం కల్వచర్ల వద్ద దారుణంగా హత్య చేశారు. ఈ కేసులో ప్రధాన సూత్రధాని బీఆర్ఎస్ నాయకుడు పుట్టా మధు అని ప్రచారం ఉంది. అయితే, ఈ కేసులో పుట్ట మధు పేరును నిందితుల జాబితాలో చేరనివ్వకుండా అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు చేసిందని ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో నిష్పాక్షిక విచారణ జరపాలంటూ వామనరావు తండ్రి గట్టు కిషన్ రావు సుప్రీంకోర్టులో న్యాయపోరాటం చేశారు. దీనిపై విచారణ జరిపిన సర్వోన్నత న్యాయస్థానం సీబీఐ విచారణ జరపాలని ఆదేశించింది.