నీట్ అక్రమాలపై తెలంగాణలోని కేంద్ర మంత్రులు సమాధానం చెప్పాలి: బల్మూర్ వెంకట్

నీట్ అక్రమాలపై తెలంగాణలోని కేంద్ర మంత్రులు సమాధానం చెప్పాలి: బల్మూర్ వెంకట్

NEET UG 2024 row: నీట్ యూజీ 2024 పరీక్ష వివాదంపై మంగళవారం దేశవ్యాప్తంగా విపక్ష పార్టీలకు చెందిన విద్యార్థి విభాగాలు ఆందోళన చేపట్టాయి. దేశ రాజధాని ఢిల్లీ సహా పలు ప్రాంతాల్లో స్టూడెంట్స్ నిరసనలకు దిగారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు ధర్నా చేశారు. హైదరాబాద్ లో పలు విద్యార్థి సంఘాలు భారీ ర్యాలీ నిర్వహించాయి. బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం రాజ్‌భ‌వ‌న్‌ ముట్టడికి యత్నించింది. కాగా, నీట్ వివాదంపై పలు నాయకులు స్పందించారు.

జ్యుడిషియల్ విచారణ జరిపించాలి: సీపీఐ రామకృష్ణ
నీట్ పరీక్ష పేపర్ లీకేజీ ఘటనపై జ్యుడిషియల్ విచారణ జరిపించాలని ఆంధ్రప్రదేశ్ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ డిమాండ్ చేశారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రూ.30 లక్షలకు నీట్ ప్రశ్నాపత్రం అమ్మడం వైద్య విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడటమే. బిహార్‌కు చెందిన ముఠా ఒక్కో విద్యార్థి నుండి రూ. 30 లక్షలు తీసుకొని పేపర్ లీకేజీ చేసినట్లు తెలుస్తోంది. ఎన్నడూ లేని విధంగా దాదాపు 67 మందికి 720/720 మార్కులు వచ్చాయి. 720 మార్కులు సాధించిన ఆరుగురు విద్యార్థులు హర్యానాలోని ఒకే ఎగ్జాం సెంటర్ నుండి పరీక్ష రాశారు. నీట్ అక్రమాలకు కేంద్ర ప్రభుత్వం, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ బాధ్యత వహించాలి. నీట్ వ్యవహారంలో అక్రమార్కులపై కఠిన చర్యలు చేపట్టాలని అన్నారు.

తెలంగాణలోని కేంద్ర మంత్రులు సమాధానం చెప్పాలి: బల్మూర్ వెంకట్
కేంద్ర ప్రభుత్వం గతంలో నిర్వహించిన నీట్ పరీక్షను రద్దు మళ్లీ తాజాగా ఎగ్జాం పెట్టాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లో విద్యార్థి సంఘాల ర్యాలీలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గ్రేస్ మార్కులు వచ్చిన వారికి తిరిగి పరీక్ష నిర్వహిస్తామని కేంద్రం, సుప్రీంకోర్టుకు తెలిపింది. ఇది సరైంది కాదు.. గతంలో జరిగిన పరీక్షను రద్దు చేసి తిరిగి మరోసారి పరీక్ష నిర్వహించాలి. కేంద్ర ప్రభుత్వ మంత్రివర్గ ప్రమాణ స్వీకార హడావుడిలో నీట్ ఫలితాలు విడుదల చేసింది. 24 లక్షల మందికి పైగా విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలో పడింది. దీనికి కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలి. నీట్ పరీక్ష నిర్వహించిన ఏజెన్సీని వెంటనే తొలగించాలి.తెలంగాణలోని కేంద్ర మంత్రులు సమాధానం చెప్పాలి. కేంద్ర ప్రభుత్వం దిగి రాకపోతే కేంద్ర మంత్రులుగా ఉన్న కిషన్ రెడ్డి, బండి సంజయ్‌ను తెలంగాణలో తిరగనీయం.. ఢిల్లీలోనూ ఆందోళన చేస్తాం. అన్ని విద్యార్థి సంఘాల ఐక్యవేదికగా ఏర్పడి ఈ ఉద్యమం కొనసాగిస్తున్నాం. నీట్ విద్యార్థులకు న్యాయం జరిగే వరకూ మా ఆందోళన కొనసాగుతది. మరోసారి విద్యార్థి సంఘాల నాయకులు అందరం కూర్చుని భవిష్యత్తు కార్యాచరణ నిర్ణయిస్తామని చెప్పారు.

Also Read: నీట్ పరీక్షపై వివాదం.. విద్యార్థుల ఆందోళనలతో దద్దరిల్లిన హైదరాబాద్

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేదు: తంగ బాలు
విద్యార్థుల భవిష్యత్తుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేదని బీఆర్‌ఎస్వీ రాష్ట్ర నాయకులు తంగ బాలు విమర్శించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు కేంద్ర మంత్రులుగా ఉన్న కిషన్ రెడ్డి, బండి సంజయ్ లు నీట్ పరీక్ష అవకతవకలపై ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. తెలంగాణ గవర్నర్ చొరవ తీసుకొని ఈ సమస్యను పరిష్కరించాలని కోరారు.

చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఎందుకు నోరు విప్పరు?
నీట్ అక్రమాలపై కేంద్ర ప్రభుత్వం, ప్రధానీ మోదీ నోరు విప్పడం లేదని విద్యార్థి సంఘం ప్రోగ్రెసివ్ యూత్ లీగ్ (పీవైఎల్) నాయకులు విమర్శించారు. మోదీ మంత్రివర్గంలోని కిషన్ రెడ్డి, బండి సంజయ్‌ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఎందుకు నోరు విప్పడం లేదన్నారు. సుమారు ఐదారు లక్షల మంది తెలుగు విద్యార్థులకు అన్యాయం జరుగుతుంటే నాయకులు ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు. నీట్ పరీక్షను రీకండక్ట్ చేయాలని, లేకుంటే దేశవ్యాప్త ఆందోళన చేపడతామని హెచ్చరించారు.