మీ రేషన్ కార్డులో కొత్త పేర్లు ఎక్కించాలా?.. తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్..
పెళ్ళికాగానే పుట్టింటి రేషన్ కార్డుల్లో మహిళల పేర్లు తొలగించారు కానీ అత్తారింట్టి కార్డులో పేర్లు నమోదు చేయలేదని..

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డుల అప్‌డేట్ ప్రక్రియను వేగవంతం చేసింది. గత పది సంవత్సరాలుగా కొత్తగా ఇంటి సభ్యులు చేరినా, వారి పేర్లు రేషన్ కార్డుల్లో చేర్చే అవకాశం లేకపోవడంతో పలు కుటుంబాలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రేషన్ కార్డులో పేరు లేకపోవడంతో, ఆరోగ్యశ్రీ వంటి సంక్షేమ పథకాలను కూడా చాలా మందికి అందలేదు.
పెళ్ళికాగానే పుట్టింటి రేషన్ కార్డుల్లో మహిళల పేర్లు తొలగించారు కానీ అత్తారింట్టి కార్డులో పేర్లు నమోదు చేయలేదని పౌరసరఫరాల శాఖపై ఫిర్యాదులు కూడా చేశారు. అయితే ఈ సమస్యను పరిష్కరించేందుకు పౌరసరఫరాల శాఖ ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించి అప్లై చేసుకున్న వారిలో లబ్ధిదారులను గుర్తించే పనిని ప్రారంభించింది. ఇందులో భాగంగా, కొత్తగా పెళ్లయిన కోడలు పేరు, అలాగే ఇంట్లో పుట్టిన పిల్లల పేర్లు రేషన్ కార్డుల్లో నమోదు చేసేందుకు అవకాశం కల్పించారు.
Also, Read: Ration Card: రేషన్ కార్డులు కావాలా? మీసేవలో ఇలా అప్లై చేసుకోండి.. వెళ్లేటప్పుడు ఈ ప్రూఫ్స్ తీసుకెళ్లండి..
మొత్తం 18 లక్షల మందికి పైగా కొత్త లబ్ధిదారులను రేషన్ కార్డుల్లో చేర్చాలని 12 లక్షలకు పైగా కుటుంబాల నుంచి అభ్యర్థనలు వచ్చాయి. కానీ ప్రాథమికంగా పరిశీలించగా, 6.68 లక్షల కుటుంబాలు మాత్రమే అర్హులని ప్రత్యేక సాఫ్ట్‌వేర్ సహాయంతో నిర్దారించినట్లు తెలుస్తుంది. ఈ నెలాఖరువరకు ఒక లక్షా 30 వేల మంది లబ్ధిదారులను పాతకార్డుల్లో కొత్తగా నమోదు చేయాలనీ పౌరసరఫరాల శాఖ లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తుంది.
ఆధార్ నంబర్ ఆధారంగా, మరెక్కడైనా వారు ఇప్పటికే రేషన్ కార్డులో నమోదై ఉన్నారా అనే విషయాన్ని కూడా పౌరసరఫరాల శాఖ పరిశీలించింది. ఈ నిర్ణయం వల్ల, అర్హులైన వారందరికీ రేషన్ కార్డుల్లో వారి పేరు చేరి, రేషన్ సరుకులు పొందే అవకాశం ఏర్పడింది.
ఒక్కో కుటుంబంలో ఇద్దరు లేదా ముగ్గురు సభ్యులను చేర్చాలని దరఖాస్తులు వచ్చినా, ప్రస్తుతానికి ఒక్కొక్కరినే లబ్ధిదారుగా చేర్చినట్లు తెలుస్తోంది. అదనంగా చేరిన లక్షల మందికి 6కిలోల బియ్యం పంపిణి చేస్తే ప్రభుత్వం పై ఏడాదికి 32 కోట్ల ఆర్థిక భారం పడుతుందని పౌరసరఫరాల శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.