Corona Schools : 700మంది స్కూల్ విద్యార్థులకు కరోనా… బడులన్నీ మూసేయండి, ప్రభుత్వానికి వైద్యశాఖ కీలక ప్రతిపాదన

తెలంగాణలో మళ్లీ కరోనా విజృంభిస్తోంది. కొత్త కేసులు పెరుగుతున్నాయి. రోజురోజుకి పెద్ద సంఖ్యలో కొత్త కేసులు వెలుగుచూస్తున్నాయి. ముఖ్యంగా పాఠశాలల్లో కరోనా పంజా విసురుతోంది. విద్యార్థులు, టీచర్లు పెద్దసంఖ్యలో కరోనా బారినపడుతున్నారు. ఈ క్రమంలో రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ కీలక ప్రతిపాదన చేసింది.

Corona Schools : 700మంది స్కూల్ విద్యార్థులకు కరోనా… బడులన్నీ మూసేయండి, ప్రభుత్వానికి వైద్యశాఖ కీలక ప్రతిపాదన

Covid 19 Cases

Updated On : March 23, 2021 / 12:15 PM IST

Close All Schools : తెలంగాణలో మళ్లీ కరోనా విజృంభిస్తోంది. కొత్త కేసులు పెరుగుతున్నాయి. రోజురోజుకి పెద్ద సంఖ్యలో కొత్త కేసులు వెలుగుచూస్తున్నాయి. ముఖ్యంగా పాఠశాలల్లో కరోనా పంజా విసురుతోంది. విద్యార్థులు, టీచర్లు పెద్దసంఖ్యలో కరోనా బారినపడుతున్నారు. ఈ క్రమంలో రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ కీలక ప్రతిపాదన చేసింది. కరోనా వ్యాప్తిని అడ్డుకోవాలంటే బడులన్నీ మూసేస్తే బెటర్ అని సూచించింది. పదో తరగతిలోపు పాఠశాలలను, గురుకులాలను, వసతిగృహాలను వెంటనే మూసివేస్తేనే మేలని వైద్యారోగ్యశాఖ ప్రభుత్వానికి ప్రతిపాదన పంపినట్లు తెలుస్తోంది. దీనిపై ఇవాళ(మార్చి 23,2021) లేదా రేపు(మార్చి 24,2021) ప్రభుత్వం నుంచి ప్రకటన రావొచ్చని తెలుస్తోంది.

స్కూళ్లు, గురుకులాల విద్యార్థులు.. కరోనా వేగంగా వ్యాప్తిచెందడానికి వాహకులుగా మారుతున్నట్లు వైద్యాధికారులు అనుమానిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 700 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు అంచనా. పిల్లల్లో రోగనిరోధకశక్తి సాధారణంగా ఎక్కువగా ఉంటుంది. వీరిలో పాజిటివ్‌ ఉన్నా లక్షణాలు బయటికి కనిపించవు. అందువల్ల వీరు క్లాసులకు హాజరై ఇళ్లకు తిరిగి వెళ్లేటప్పుడు ప్రజలకు, కుటుంబ సభ్యులకు కరోనా వ్యాపించడానికి వాహకాలవుతున్నారని డాక్టర్ల అంచనా. అందువల్లనే ఈ నెలారంభం నుంచి కరోనా రోగుల సంఖ్య నానాటికీ పెరుగుతోందని భావిస్తున్నారు.

వాస్తవానికి 2020 సెప్టెంబర్ నుంచి గత నెలాఖరు వరకూ రాష్ట్రంలో కరోనా కేసులు పెద్దగా లేవు. కానీ, పక్కనే ఉన్న మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌, కర్ణాటక తదితర రాష్ట్రాల్లో పెరుగుతున్నాయి. అక్కడి నుంచి నిత్యం వేలమంది తెలంగాణకు రాకపోకలు సాగిస్తుంటారు. వారి నుంచీ వైరస్‌ తెలంగాణలోకి వేగంగా వ్యాపిస్తోందని వైద్యశాఖ భావిస్తోంది. ఇక్కడి విద్యార్థుల్లోనూ కేసుల సంఖ్య మరింత పెరుగుతోండటం ఆందోళన రేకెత్తిస్తోంది. ఈ నేపథ్యంలోనే కరోనా కట్టడికి పాఠశాలలు, కాలేజీలు, గురుకులాలు మూసివేయడం ఉత్తమమని వైద్యశాఖ భావిస్తోంది.

రెండో రకం స్ట్రెయినేనా?
ప్రస్తుతం రాష్ట్రంలో రోజూ 300 మందికి పైగా పాజిటివ్‌ తేలుతున్నందున వీరికి సోకింది కరోనా సెకండ్‌ వేవ్‌ స్ట్రెయినేనా అని వైద్యులు అనుమానిస్తున్నారు. ఏ రకమో నిర్ధారించేందుకు పరీక్షలు చేస్తున్నారు. అది తేలితే నియంత్రణపై ఒక అంచనాకు వచ్చే అవకాశముంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా సెకండ్‌ వేవ్‌ ఉన్నా తెలంగాణలోకి ఇంకా రాలేదని అధికారులు ధీమాగా ఉన్నారు. కానీ పది రోజులుగా పరిస్థితులు క్రమంగా మారుతూ, రోగుల సంఖ్య విపరీతంగా పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో అనవసర భయాలు వీడి ప్రజలంతా వెంటనే టీకా వేయించుకోవాలని వైద్యశాఖ అధికారులు సూచించారు.

తెలంగాణలో డేంజర్ బెల్స్..
తెలంగాణలో కరోనా వైరస్ మహమ్మారి డేంజర్ బెల్స్ మోగిస్తోంది. రోజురోజుకి కొత్త కేసులు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా కొత్త కేసులు 400 దాటడం
ఆందోళనకు గురి చేస్తోంది. గడిచిన 24 గంటల్లో 412 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,03,867కి పెరిగింది. నిన్న కొవిడ్‌తో ముగ్గురు మృతిచెందారు. దీంతో ఇప్పటివరకు మృతిచెందిన వారి సంఖ్య 1,674కి చేరింది.

తెలంగాణ రాష్ట్రంలో నిన్న(మార్చి 22,2021) రాత్రి 8 గంటల వరకు 68,171 కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించారు. కరోనా బారి నుంచి నిన్న 216 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 3,151 ఉండగా.. వీరిలో 1,285 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్తగా 103 కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ మంగళవారం(మార్చి 23,2021) ఉదయం బులిటెన్‌ విడుదల చేసింది.

అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దు: మంత్రి ఈటల
ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా ప్రజల సంపూర్ణ భాగస్వామ్యంతోనే కరోనా కట్టడి సాధ్యమని మంత్రి ఈటల అన్నారు. ‘కొవిడ్‌ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దు. తప్పనిసరిగా మాస్క్‌ ధరించాలి. భౌతిక దూరం పాటించాలి. అత్యవసరమైతే తప్ప బయటికి రావొద్దు’ అని ఆయన ప్రజలను కోరారు. రాష్ట్రంలో కరోనా అదుపులోనే ఉందని, పక్క రాష్ట్రాల్లో పాజిటివ్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైందని మంత్రి తెలిపారు. వైద్యశాఖపై సోమవారం(మార్చి 22,2021) ఆయన సమీక్ష జరిపారు. కరోనా కట్టడికి పక్కాగా చర్యలు తీసుకోవాలని, రోజుకు 50వేల పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు.

దేశంలో కరోనా పంజా:
దేశంలో కరోనా పంజా విసురుతోంది. గడిచిన 24గంటల్లో కొత్తగా 40వేల 715మందికి కరోనా సోకింది. మరో 199మంది చనిపోయారు. దీంతో మొత్తం మరణాలు లక్షా 60వేల 166కు చేరాయి. అటు దేశంలో మొత్తం కేసుల సంఖ్య కోటి 16లక్షల 86వేల 796కి పెరిగింది. ప్రస్తుతం 3లక్షల 45వేల 377 యాక్టివ్ కేసులు ఉన్నాయి. నిన్న ఒక్కరోజే 9లక్షల 67వేల 459 కరోనా టెస్టులు చేశారు. ప్రజలు కరోనా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. కాగా, క్రితం రోజుతో పోలిస్తే కొత్త కేసులు 13శాతం మేర తగ్గాయి. ఇది కొంత ఊరటనిచ్చే అంశం. క్రితం రోజు 50వేలకు చేరువలో అంటే.. 46వేల 951 కరోనా కేసులు నమోదైన సంగతి తెలిసిందే.