YS Sharmila : సున్నా వడ్డీకే రుణాలని మోసం చేసిన దొర.. కొత్త డ్రామా షురూ చేశారు- బీఆర్ఎస్ మేనిఫెస్టోపై షర్మిల విమర్శలు
YS Sharmila Criticise BRS Manifesto

YS Sharmila Criticise BRS Manifesto
YS Sharmila Criticise BRS Manifesto : సీఎం కేసీఆర్ విడుదల చేసిన బీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టోపై ప్రతిపక్షాలు విమర్శలు ఎక్కుపెట్టాయి. సీఎం కేసీఆర్ టార్గెట్ గా విరుచుకుపడుతున్నాయి. సీఎం కేసీఆర్ కాంగ్రెస్ మేనిఫెస్టోను కాపీ కొట్టారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విమర్శించారు. వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సైతం బీఆర్ఎస్ మ్యానిఫెస్టోపై విమర్శనాస్త్రాలు సంధించారు. ఓట్ల కోసం కేసీఆర్ కొత్త డ్రామా మొదలు పెట్టారని ధ్వజమెత్తారామె.
బీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టోపై షర్మిల తీవ్ర విమర్శలు చేశారు. కొండంత రాగం తీసి పిల్లికూత కూసినట్లుంది కేసీఆర్ ఎన్నికల మేనిఫెస్టో అని విమర్శించారు. పోయిన ఎన్నికలకు ఇచ్చిన హామీలే నెరవేర్చే దిక్కు లేదు, మళ్లీ కొత్త కథ మొదలు పెట్టారు అంటూ మండిపడ్డారు. ”బతుకు మీద ఇవ్వాల్సిన ధీమా పక్కన పెట్టి పోయాక భీమా ఇస్తాడట. సున్నా వడ్డీకే రుణాలు అని మోసం చేసిన దొర గారు.. ప్రతి మహిళకు నెలకు 3 వేలు ఇస్తామనడం హాస్యాస్పదం.
Also Read : మా మేనిఫెస్టోను కేసీఆర్ కాపీ కొట్టారు- రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు
నిరుద్యోగ భృతి అని గత మ్యానిఫెస్టోలో పెట్టిన పథకానికే దిక్కులేదు కానీ ఇప్పుడు రూ.3వేలు ఇస్తామంటే నమ్మాలా? విడతల వారీగా పెన్షన్ల పెంపు ఒక పెద్ద జోక్. రుణమాఫీపై దొరగారి యూ టర్న్. ఉద్యోగాలు ఇవ్వలేక ఏనాడో చేతులెత్తేశారు. ఉన్న పథకాలను పాతర పెట్టి ఓట్ల కోసం కొత్త పథకాలు అంటూ డ్రామాలు తప్ప మరోటి లేదు. బందిపోట్లు సమితి మ్యానిఫెస్టో ఓట్ల కోసం తప్ప ప్రజల కోసం కాదు” అని విమర్శలు గుప్పించారు షర్మిల.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగిన సంగతి తెలిసిందే. నవంబర్ 30న ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ సమరశంఖం పూరించారు. ఇవాళ బీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టోను రిలీజ్ చేశారు. కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీలకు ధీటుగా బీఆర్ఎస్ మేనిఫెస్టోలో అంశాలు పొందుపరిచారు కేసీఆర్. బీఆర్ఎస్ స్కీములు ఆషామాషీగా ఉండవని, దేశానికే ఆదర్శంగా ఉంటాయని మేనిఫెస్టో విడుదల సందర్భంగా కేసీఆర్ అన్నారు.
బీఆర్ఎస్ మేనిఫెస్టో:
* తెల్లరేషన్ కార్డు ఉన్న వారికి రైతు బీమా తరహా కేసీఆర్ బీమా.
* ప్రతి ఇంటికి ధీమా పథకం. కుటుంబానికి 5 లక్షల బీమా. ప్రీమియం మొత్తం ప్రభుత్వమే చెల్లిస్తుంది.
* తెలంగాణ అన్నపూర్ణ పథకం కింద ప్రతి ఇంటికీ ఇకపై సన్నబియ్యం. రేషన్ కార్డు ఉన్న అందరికీ సన్నబియ్యం.
* ఆసరా పెన్షన్లు రూ.3వేలకు పెంపు.
* దివ్యాంగులకు పెన్షన్ రూ.6 వేలకు పెంపు
* రైతుబంధు పథకం దశలవారీగా రూ.16 వేలకు పెంపు. రైతు బంధును ముందుగా రూ.12 వేలకు పెంపు.
Also Read : బీఆర్ఎస్ మ్యానిఫెస్టో విడుదల.. కేసీఆర్ బీమా కింద కుటుంబానికి రూ.5 లక్షలు.. ప్రతి ఇంటికీ ఇకపై సన్నబియ్యం
* అర్హులైన పేద మహిళలకు సౌభాగ్య లక్ష్మి పథకం కింద నెలకు రూ.3వేల చొప్పున భృతి.
* అర్హులైన వారికి రూ.400కే గ్యాస్ సిలిండర్.
* గుర్తింపు పొందిన జర్నలిస్టులకు రూ.400కే గ్యాస్ సిలిండర్. అక్రిటిడేషన్ ఉన్నవారికి వర్తింపు. ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో జర్నలిస్టులకు రూ.15 లక్షల వరకు వైద్య సేవలు.
* హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో మరో 2 లక్షల డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం.
* అగ్రవర్ణ పేదల కోసం ప్రతి నియోజకవర్గంలో గురుకులాలు. మొత్తం 119 గురుకులాలు.
* ఆరోగ్యశ్రీ బీమా మొత్తం రూ.15 లక్షలకు పెంపు.
* డిగ్రీ కాలేజీలుగా జూ. కాలేజీలు.
* మహిళా స్వశక్తి గ్రూప్‌లకు సొంత భవనాలు.
* అనాథ పిల్లల కోసం పటిష్ఠ పాలసీ.
* ప్రభుత్వ ఉద్యోగుల ఓపీఎస్ కోసం కమిటీ.
* మహిళా సంఘాలకు స్వశక్తి భవనాలు.
* అసైన్డ్ భూములపై ఆంక్షలు ఎత్తివేత.. అసైన్డ్ భూముల సొంతదారులకు పట్టా హక్కులు.