సోమవారం కర్నల్ సంతోష్‌బాబు కుటుంబాన్ని పరామర్శించనున్న సీఎం కేసీఆర్

కర్నల్ సంతోష్‌బాబు కుటుంబాన్ని పరామర్శించేందుకు తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ సోమవారం (జూన్ 22, 2020) సూర్యాపేటకు వెళ్లనున్నారు. ఈ క్రమంలో మంత్రి జగదీశ్‌రెడ్డి శనివారం (జూన్ 20, 2020) కర్నల్ సంతోష్‌బాబు నివాసానికి వెళ్లి కుటుంబాన్ని పరామర్శించారు. సంతోష్ బాబు కుటుంబానికి హైదరాబాద్‌లో 600 గజాల ఇంటి స్థలం కేటాయిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. సోమవారం సీఎం కేసీఆర్ సూర్యాపేటకు వస్తారని తెలిపారు.
గాల్వన్ లోయలో చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో సూర్యాపేటకు చెందిన కర్నల్ సంతోష్‌బాబు అమరుడైన సంగతి తెలిసిందే. సంతోష్‌బాబు కుటుంబానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పూర్తి అండగా నిలుస్తుందని సీఎం కేసీఆర్ అన్నారు. రూ. 5 కోట్ల ఎక్స్‌గ్రేషియాతో పాటు సంతోష్‌బాబు భార్యకు గ్రూప్-1 స్థాయి ఉద్యోగం, హైదరాబాద్‌లో నివాస స్థలం ఇవ్వనున్నట్లు సీఎం ప్రకటించారు.
తానే స్వయంగా అమర సైనికుడి ఇంటికి వెళ్లి సాయం అందిస్తానని తెలిపారు. అన్నట్లుగానే సీఎం కేసీఆర్ సోమవారం సంతోష్‌బాబు కుటుంబాన్ని పరామర్శించేందుకు అదేవిధంగా సాయం అందించేందుకు సూర్యాపేటకు బయల్దేరి వెళ్లనున్నారు.