Cm Revanth Reddy: రామసేనుడు, హరిసేనుడు.. అంటూ కథ చెప్పి.. నవ్వులు పూయించిన సీఎం రేవంత్ రెడ్డి..
వెయ్యి ఊడల మర్రి కింద కూర్చుని కఠోరమైన తపస్సు చేశాడు. తంత్రాలన్నీ చదువుతుంటే త్రిలింగ దేశంలోని అందరికీ నిద్ర లేని పరిస్థితులు వచ్చాయి.

Cm Revanth Reddy: గ్రూప్-2కు ఎంపికైన అభ్యర్థులకు ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ శిల్పకళా వేదికలో ప్రజా పాలనలో కొలువుల పండుగ పేరుతో ఈ కార్యక్రమం జరిగింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్, ఇతర నాయకులు, అధికారులు ఇందులో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మాట్లాడిన సీఎం రేవంత్.. తనదైన స్టైల్ లో ఓ కథ చెప్పారు. రామసేనుడు, హరిసేనుడు అంటూ కథ చెప్పి నవ్వులు పూయించారు. ఇంతకీ సీఎం రేవంత్ రెడ్డి ఏం కథ చెప్పారు, అందులో సారాంశం ఏంటి…
అభ్యర్థులతో మాట్లాడిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. గతంలో ఉన్న పరిస్థితిని ఒక చిన్న ఉదాహరణ ద్వారా మీకు చెప్పదలుచుకున్నా.. ఎందుకంటే రేపటి నుంచి మీరు చూడబోతున్నారు.. అంటూ ఓ కథ వినిపించారు.
”త్రిలింగ దేశం అని ఒక దేశం ఉండేది. ఆ దేశానికి రాజు చంద్రసేనుడు. ఆ చంద్రసేనుడికి ఒక కొడుకు, అల్లుడు ఉన్నారు. రామసేనుడు, హరిసేనుడు. రామసేనుడికి ఒకటే కోరిక. ఎట్లన్నా చేసి ఆ చంద్రసేనుడిని కింద పడేసి అందులో కూర్చోవాలని. దాని కోసం అన్ని రకాల ప్రయత్నాలు చేశాడు. ఇంట్లో అమ్మతో చెప్పించాడు, భార్యతో చెప్పించాడు, చుట్టాలతో చెప్పించాడు. ఎన్ని ప్రయత్నాలు చేసినా జరగలేదు. చూసి చూసి ఏం చేయాలి అని ఆలోచన చేస్తుంటే.. ఆయనకు హరికర వేణుగోపాల రావు అనే పెద్ద మనిషి ఎదురయ్యాడు. నా కోరిక నెరవేరడం లేదు, ఏం చేయాలి అని అంటే.. ఇలా అయితే కుదరదు. నువ్వు గట్టిగా తపస్సు చేయి. తపస్సు చేస్తే దేవుడు ప్రత్యక్షం అవుతాడు. దేవుడిని కోరుకుంటే నీ కోరిక నెరవేరేలా ఉందని సూచన చేశాడు.
సరే మంచిది అని వెతికితే.. ఆదిలాబాద్ లో వెయ్యి ఊడల మర్రి కనిపించింది. ఇదైతే బాగుంటుంది తపస్సుకి అనుకుని రామసేనుడు అక్కడికి వెళ్లి వెయ్యి ఊడల మర్రి కింద కూర్చుని కఠోరమైన తపస్సు చేశాడు. తంత్రాలన్నీ చదువుతుంటే త్రిలింగ దేశంలోని అందరికీ నిద్ర లేని పరిస్థితులు వచ్చాయి. ఈలోపల హరిసేనుడికి పొన్నం ప్రభాకర్ లాంటి మిత్రుడు చెప్పాడు.. మీ బావమరిది అక్కడ తపస్సు చేస్తున్నాడు.. కుర్చీ పోయేలా ఉంది.. మరి నీ సంగతి ఏంటి అన్నాడు.
ఇదేదో ప్రమాదం వచ్చేలా ఉందని.. ఆయన కూడా అక్కడికే వెళ్లాడు. బావమరిది ఏం చేస్తున్నాడో చూద్దామని. బావమరిది మర్రి చెట్టు కింద కూర్చుని కఠోరమైన తపస్సు చేస్తున్నాడు. బావ కొంచెం తెలివిగల వాడు. దేవుడు అనే వాడు పై నుంచి కిందకు వస్తాడు కదా అని మర్రి చెట్టు ఎక్కి దాని మీద ఆయన కూడా తపస్సుకి కూర్చున్నాడు. దేవుడు వస్తా వస్తా ఫస్ట్ నా దగ్గరికే వస్తాడు కదా అని. మనమే ముందుగా దేవుడితో మాట్లాడదామని. ఆయన కూడా మర్రి చెట్టు ఎక్కి కూర్చుని కఠోరమైన తపస్సు చేశాడు.
ఒక కన్ను పొడిచేయాలని దేవుడిని కోరాడు..
ఇక దేవుడికి కూడా నిద్రకు భంగం కలిగి. వీళ్ల సంగతి ఏంటో చూద్దాం అని వచ్చాడు. వచ్చేటప్పుడు మధ్యలో హరిసేనుడు కనిపించాడు. ఏం భక్తా ఏమి నీ కోరిక అని అడిగాడు. హరిసేనుడికి అనుమానం వచ్చింది. నేను ఏం కోరినా కింద తన బావమరిది ఏం కోరతాడో తెలీదు. ఏం లేదు దేవుడా.. నాకు ఒక కన్ను పొడువు అని అడిగాడు. ఇంత తపస్సు చేసింది నీ కన్ను పొడిపించుకోవడానికా అని దేవుడు అడిగాడు. దాని వెనుకున్న మతలబు నేను చెబుతాను కదా.. నువ్వు నా కన్ను పొడువు అని హరిసేనుడు అన్నాడు. అతడి కోరిక మేరకు ఒక కన్ను పొడిచాడు.
ఆ తర్వాత దేవుడు కిందకి వచ్చాడు. రామసేనుడు దగ్గరికి. బావమరిదికి బావ మీద అనుమానం. నీ కోరిక ఏంటని రామసేనుడిని అడిగాడు దేవుడు. అసలే మనకు తెలివి తక్కువ, ఎక్కువ ఆలోచన చేస్తే అనవసరమైన నష్టం అని భావించిన అతడు.. మా బావ ఏం అడిగాడో దానికి రెండింతలు నాకివ్వు అని కోరాడు. దేవుడు ఈయన రెండు కళ్లు పొడిచేశాడు.
ఆయనకు ఒక కన్ను లేదు, ఈయనకు రెండు కళ్లు లేవు..
హరిసేనుడికి ఒక కన్ను లేదు, రామసేనుడికి రెండు కళ్లు లేవు. దేవుడు వెళ్లిపోయాక ఇద్దరూ కలుసుకున్నారు. ఇలా జరిగిందేమిటి అని బాధపడ్డారు. ఓ పెద్ద మనిషి దగ్గరికి వెళ్లారు. ఆయనకు ఒకటి లేదు, నాకు రెండు లేవు.. మా పరిస్థితి ఏంటని అడిగారు. శుక్రవారం మక్కా మసీదుకి వెళ్లండి, శనివారం బిర్లా టెంపుల్ కి పోండి, ఆదివారం మెదక్ చర్చి దగ్గరికి పోండి.. అక్కడ మెట్ల మీద కూర్చుంటే వచ్చే వాడు పోయే వాడు ఏదో ఒకటి ఇస్తాడని చెప్పాడు. నీకు రెండూ లేవు నువ్వు నడవలేవు.. నువ్వు నన్ను నీ భుజాల మీదకు ఎత్తుకో నీకు దారి చూపిస్తుంటా.. నడుచుకుంటూ పో.. అని బావ.. బావమరిది భుజాల మీద ఎక్కాడు” అంటూ కథ చెప్పి నవ్వులు పూయించారు సీఎం రేవంత్ రెడ్డి.