రైతు భరోసా, పెన్షన్లపై అపోహలొద్దు.. కొత్తవారే దరఖాస్తు చేసుకోవాలి
ప్రజాపాలన దరఖాస్తులు అమ్మేవారిపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

CM Revanth Reddy
CM Revanth Reddy Prajapalana : ప్రజాపాలన దరఖాస్తుల అమ్మకాలపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాపాలన దరఖాస్తులు అమ్మే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, అవసరమైన దరఖాస్తులు అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు. ప్రజా పాలన దరఖాస్తుల సరళి, క్షేత్ర స్థాయిలో పరిస్థితులపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. రైతు భరోసా, పెన్షన్లపై అపోహలు వద్దని, కొత్తగా లబ్ధి పొందాలనుకునేవారే దరఖాస్తు చేసుకోవాలని, పాత లబ్ధిదారులందరికీ యథాతథంగా వస్తాయని రేవంత్ రెడ్డి అన్నారు. ఈ విషయంలో ప్రజలు ఎలాంటి గందరగోళానికి గురికావద్దని తెలిపారు.
రాష్ట్రంలో ఈనెల 28 నుంచి ‘ప్రజా పాలన’ కార్యక్రమం ప్రారంభమైన నేపథ్యంలో ఇప్పటి వరకు జరిగిన గ్రామసభలు, దరఖాస్తుల వివరాలు, ‘ప్రజా పాలన’ దరఖాస్తులు స్వీకరిస్తున్న విధానం, ప్రజల్లో స్పందనకు సంబంధించి పూర్తి వివరాలను సీఎం రేవంత్ రెడ్డి అధికారులను అడిగి తెలుసుకున్నారు. దరఖాస్తుల కొరత లేకుండా అవసరమైనన్ని దరఖాస్తులు అందుబాటులో ఉంచాలని సూచించారు. దరఖాస్తు చేసుకోవాలనుకునేవారికి ఎట్టి పరిస్థితుల్లో ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
దరఖాస్తులను అమ్మేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ‘ప్రజా పాలన’ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు విధిగా భాగస్వామ్యం కావాలని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోను ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ‘ప్రజా పాలన’ క్యాంపుల్లో దరఖాస్తుదారులకు తాగునీరు, సరైన నీడ కోసం టెంట్లు, ఇతర ఏర్పాట్లలో ఎలాంటి లోటు రాకుండా చూడాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు.
'ప్రజా పాలన' దరఖాస్తుల అమ్మకాలపై ముఖ్యమంత్రి శ్రీ @Revanth_Anumula ఆగ్రహం వ్యక్తం చేశారు. దరఖాస్తుదారులకు అవసరమైనన్ని దరఖాస్తులను అందుబాటులో ఉంచాల్సిందేనని అధికారులను ఆదేశించారు.
రైతుబంధు, పింఛన్లపై అపోహలకు గురి కావద్దని, పాత లబ్ధిదారులందరికీ యథావిధిగా ఈ పథకాలు అందుతాయని… pic.twitter.com/ap6WaHP1bX
— Telangana CMO (@TelanganaCMO) December 30, 2023