CM Revanth Reddy: అది బీఆర్ఎస్ కాదు డీఆర్ఎస్.. దెయ్యాల రాష్ట్ర సమితి- కవిత వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రియాక్షన్
దెయ్యాల నాయకుడు ఫాంహౌస్ లో నిద్రపోతున్నాడు. కొరివి దెయ్యాలను తెలంగాణ పొలిమేర దాటే వరకు తరిమికొట్టాలి.

CM Revanth Reddy: బీఆర్ఎస్ లో దెయ్యాలు ఉన్నాయి అంటూ ఇటీవల ఆ పార్టీ కీలక నేత, ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీ శ్రేణుల్లోనే కాదు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారాయి. కేసీఆర్ దేవుడు, ఆయన చుట్టూ దెయ్యాలు ఉన్నాయి అంటూ కవిత చేసిన కామెంట్స్ బీఆర్ఎస్ శ్రేణులను షాక్ కి గురి చేశాయి. కవిత కామెంట్స్ పై కొన్ని రోజులు మౌనంగా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి.. సమయం చూసి స్పందించారు. కవిత వ్యాఖ్యలను ఆయన క్యాష్ చేసుకునే ప్రయత్నం చేశారు. కవిత చేసిన వ్యాఖ్యలతో బీఆర్ఎస్ పై దాడికి దిగారు సీఎం రేవంత్ రెడ్డి.
యాదాద్రి జిల్లా ఆలేరు నియోజకవర్గంలో అభివృద్ది పనులకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడిన సీఎం రేవంత్.. కవిత దెయ్యాల వ్యాఖ్యల గురించి ప్రస్తావన తెచ్చారు. బీఆర్ఎస్ పై విరుచుకుపడ్డారు. అది బీఆర్ఎస్ కాదు డీఆర్ఎస్.. దెయ్యాల రాజ్య సమితి అని విరుచుకుపడ్డారు రేవంత్ రెడ్డి. ఈ మాట తాను అనలేదని, బీఆర్ఎస్ నాయకురాలే అన్నారని రేవంత్ చెప్పారు.
”బీఆర్ఎస్.. భారత రాష్ట్ర సమితి కాదు, దెయ్యాల రాజ్య సమితి. దెయ్యాల నాయకుడు ఫాంహౌస్ లో నిద్రపోతున్నాడు. కొరివి దెయ్యాలను తెలంగాణ పొలిమేర దాటే వరకు తరిమికొట్టాలి. బంగారు తెలంగాణ ముసుగులో బొందలగడ్డ తెలంగాణ చేశారు. పదేళ్లు రాష్ట్రాన్ని దోచుకున్న వారు మాపై విమర్శలు చేస్తున్నారు” అంటూ నిప్పులు చెరిగారు సీఎం రేవంత్ రెడ్డి.
”చేసిన పాపాలు నీడలా వెంటాడతాయి. పాపాలు చేశారు కాబట్టే మీ పరిస్థితి అలా అయ్యింది. ఈ మాట నేను అనడం లేదు. బీఆర్ఎస్ నాయకురాలే అన్నారు. మా పార్టీలో దెయ్యాలు చేరాయని అన్నారు. సొంతింటి బిడ్డ బీఆర్ఎస్ లో ఉన్నోళ్లు దెయ్యాలు ఉన్నాయి అని అంటుంటే సమాధానం చెప్పలేక దెయ్యాల నాయకుడు ఫామ్ హౌస్ లో నిద్రపోతున్నాడు. అది బీఆర్ఎస్ కాదు, డీఆర్ఎస్.. భారత రాష్ట్ర సమితి కాదు దెయ్యాల రాజ్య సమితి.
తెలంగాణ ప్రజలకు నేను మాట ఇస్తున్నా. ఆ కొరివి దెయ్యాలను పొలిమేరలు దాటేవరకు తరిమి కొట్టే బాధ్యతను 4 కోట్ల మంది తెలంగాణ ప్రజల తరపున, మీ సోదరుడిగా నేను ఆ బాధ్యతను తీసుకుంటా. కచ్చితంగా ఈ కొరివి దెయ్యాలను పొలిమేరలు దాటే వరకు తరిమి కొట్టాలి, అందుకు మీ సహకారం ఉండాలి, నల్గొండ బిడ్డలు ముందు వరుసలో నిలబడాలి” అని విజ్ఞప్తి చేశారు సీఎం రేవంత్ రెడ్డి.
”మూసీ ప్రాంతంలోని ప్రజల కష్టాలు ప్రతిపక్షాలకు కనిపించడం లేదా? గుజరాత్ లో సబర్మతి, ఉత్తరప్రదేశ్ లో యమునా ప్రక్షాళన చేయలేదా? తెలంగాణలో మూసీని అభివృద్ధి చేసుకోవద్దా? మురికిలోనే ఉండాలా? గత పాలకులు 2లక్షల కోట్లు ఖర్చు పెట్టినా ప్రాజెక్టులు పూర్తి చేయలేదు. పదేళ్ల పాలనలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో ప్రాజెక్టులను ఎందుకు పూర్తి చేయలేదు?
మేము ప్రాజెక్టులు పూర్తి చేస్తుంటే కాళ్లలో కట్టెలు పెడుతున్నారు. తెలంగాణను 8లక్షల కోట్ల అప్పుల ఊబిలో పడేశారు. ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తుంటే బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తోంది. ఉద్యోగులకు 1వ తేదీనే జీతాలు ఇస్తున్నాం. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఏరోజైనా 1వ తేదీనే జీతాలు వేశారా?” అంటూ బీఆర్ఎస్ పై నిప్పులు చెరిగారు సీఎం రేవంత్ రెడ్డి.