Handcuffs To Farmer : రైతుకు బేడీలు.. సీఎం రేవంత్ రెడ్డి సీరియస్
ప్రజా ప్రభుత్వం ఇలాంటి చర్యలు సహించదని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు.

Handcuffs To Farmer : లగచర్ల రైతులకు బేడీలు వేయడంపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. రైతు హీర్యా నాయక్ చికిత్స కోసం సంగారెడ్డి ఆసుపత్రికి బేడీలతో తీసుకెళ్లడంపై అధికారులను ఆరా తీశారు. అధికారులపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ప్రజా ప్రభుత్వం ఇలాంటి చర్యలు సహించదని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు.
సంగారెడ్డి జైల్లో ఉన్న హీర్యా నాయక్ అనే రైతు అనారోగ్యం బారిన పడ్డాడు. దీంతో పోలీసులు అతడిని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే, తీసుకెళ్లే క్రమంలో రైతు చేతికి బేడీలు వేసి తీసుకెళ్లడం అనేది వివాదాస్పదంగా మారింది. ఈ ఘటనతో ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు టార్గెట్ చేస్తున్నాయి. అన్నం పెట్టే రైతుకు, అనారోగ్యంతో ఉన్న రైతుకు ఇలా బేడీలు వేసి ఆసుపత్రికి తీసుకెళ్లడం దారుణం అన్నారు. బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. రైతుకు బేడీలు వేసిన ఘటనపై సీఎం రేవంత్ తీవ్రంగా స్పందించారు. అసలు రైతుకు బేడీలు వేయాల్సిన అవసరం ఏమొచ్చిందని పోలీసు అధికారులను సీఎం రేవంత్ ప్రశ్నించారు. దీనిపై పూర్తి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.
ప్రజా పాలనలో రైతుకు బేడీలు వేసి తీసుకెళ్లాల్సినంత అవసరం ఏమొచ్చిందన్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న రైతును ఆసుపత్రికి తీసుకెళ్లే సమయంలో జాగ్రత్తలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. దీనిపై అధికారులను ఆరా తీశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రైతులను అవమానించినా, వారి చేతులకు బేడీలు వేసినా ప్రభుత్వం సహించదని ముఖ్యమంత్రి రేవంత్ తేల్చి చెప్పారు. ఈ ఘటనపై సమగ్ర నివేదికను ఇవ్వాలని పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.
రైతు బేడీకి చేతులు అనే అంశం.. రాజకీయంగా టర్న్ తీసుకునే అవకాశం ఉంది. గత ప్రభుత్వం హయాంలో ఖమ్మంలో మిర్చి రైతులకు బేడీలు వేసిన సంఘటనలో అప్పట్లో ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్.. ఈ అంశాన్ని ఒక ఆయుధంలా మార్చుకుని నాటి ప్రభుత్వంపై విరుచుకుపడింది. అన్నం పెట్టే రైతుకు బేడీలు వేయడం అప్పట్లో తీవ్ర దుమారమే రేపింది. రైతుకు సంబంధించిన అంశం కావడంతో ప్రస్తుత ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. లగచర్ల రైతుకు బేడీలు అంశం ప్రతిపక్షాలకు అస్త్రంలా మారేలోపు ప్రభుత్వం దీనిపై రియాక్ట్ కావడం, అంతే సీరియస్ గా సీఎం రేవంత్ దీనిపై నివేదిక కోరడం హీట్ పెంచింది.
Also Read : బీజేపీ నేతలకు ఆర్.కృష్ణయ్య గుబులు..! కారణం అదేనా?