Gossip Garage : ఏపీలోనే కాదు తెలంగాణలోనూ రాజకీయ ప్రకంపనలు..! కాషాయ పార్టీలో కాక రేపుతున్న ఆర్.కృష్ణయ్య రాక..!
ఒకే ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిచిన ఆర్.కృష్ణయ్య..రెండుసార్లు వరుసగా రాజ్యసభకు వెళ్లారు. ఇప్పుడు బీసీ కార్డ్‌తో తెలంగాణ బీజేపీలో కాక రేపుతున్నారు.

Gossip Garage R Krishnaiah Political Career (Photo Credit : Google)
Gossip Garage : ఆయన రాక బీజేపీలో కాక. ఇది ప్రాస కోసం వాడిన లైన్‌లాగే అనిపించినా..రియాల్టీకి దగ్గరలోనే ఉంది పరిస్థితి. ఆ తెలంగాణ నేత..ఏపీ కోటాలో బీజేపీ రాజ్యసభ సభ్యుడు అయ్యారు. ఇంకేముంది ఆ లీడర్ రాక తెలంగాణ కాషాయంలో కాక రేపుతోంది. ఉన్నట్లుండి ఆయనకెందుకు ఎంపీ పదవి ఇచ్చినట్లు అని కొందరు రుసరుసలాడతున్నారట. ఇంకొందరికి ఆయనొస్తున్నారంటే బీసీ కోటాలో ఇంకో కాంపిటేటర్..మరో పవర్ సెంటర్ తయారవుతుందని గుబులు పట్టుకుందట. ఇంతకీ ఎవరా నేత..? ఆయనొస్తే ఇబ్బందిగా ఫీల్ అవుతున్నదెవరు.?
తెలంగాణ బీజేపీ లీడర్లకు ఆర్.కృష్ణయ్య గుబులు..!
తెలంగాణ బీజేపీ లీడర్లకు ఆర్.కృష్ణయ్య గుబులు పట్టుకుందట. ఏపీ కోటాలో బీజేపీ సభ్యుడిగా రాజ్యసభకు నామినేట్ అయిన ఆర్.కృష్ణయ్య రాక..కమలం లీడర్లను కలవరపెడుతోందట. అసలే తెలంగాణకు చెందిన బీసీ నేత. ఆయనొస్తే తమకు ఎక్కడ కాంపిటేటర్ అవుతారోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పార్టీ బీసీ నినాదం ఎత్తుకోవడంతో..పలువురు నేతలు రాష్ట్ర అధ్యక్ష పదవి మీద..పార్టీ పవర్‌లోకి వస్తే సీఎం పదవి ఇంకొందరు లీడర్లు బోలెడు ఆశలు పెట్టుకున్నారు. ఇప్పుడున్న పోటీనే తలనొప్పిగా ఉందంటే..ఆర్.కృష్ణయ్య మరో పోటీదారుగా ఉంటారని ఇంటర్నల్‌గా చర్చ జరుగుతోందట.
బీసీ సంఘం నేతగా మంచి గుర్తింపు ఉన్న లీడర్..
ఆర్.కృష్ణయ్య..బీసీ సంఘం నేతగా మంచి గుర్తింపు ఉన్న లీడర్. మొదట టీడీపీలో చేరి..ఎల్బీనగర్ నుంచి 2014లో ఎమ్మెల్యే అయ్యారు. అప్పుడు అధికారంలోకి వస్తే బీసీని సీఎం చేస్తామని ఆర్.కృష్ణయ్యను ముందు పెట్టి ఎన్నికలకు వెళ్లింది టీడీపీ. తర్వాత 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చాక జగన్ ఆయనను ఏపీ కోటాలో రాజ్యసభకు పంపారు. కూటమి అధికారంలోకి వచ్చాక..తన రాజ్యసభ సభ్యత్వానికి రిజైన్ చేసి.. ఇప్పుడు మళ్లీ ఏపీ కోటాలో బీజేపీ రాజ్యసభ సభ్యుడు అయ్యారు ఆర్.కృష్ణయ్య. ఇదే ఇప్పుడు తెలంగాణ బీజేపీలో కాక రేపుతోందట.
కనీసం పార్టీ సభ్యత్వం లేని వ్యక్తికి పదవి ఇవ్వడం ఏంటని ఆవేదన..!
ఆర్.కృష్ణయ్యను ఏపీ నుంచి రాజ్యసభకు పంపడాన్ని అక్కడ బీజేపీ నేతలు తీవ్రంగా వ్యతిరేకించినట్లు సమాచారం. పార్టీ కోసం కష్టపడిన చాలా మంది నేతలు ఉండగా ఆర్.కృష్ణయ్యకు ఇవ్వడం ఏంటని అంతర్గతంగా అసంతృప్తిని తెలియజేసినట్టు తెలుస్తోంది. రాకరాక అవకాశం వస్తే పార్టీ నేతలకు కాకుండా కనీసం పార్టీ సభ్యత్వం లేని అతనికి ఇవ్వడం ఏంటని.. అది కూడా పొరుగు రాష్ట్రమైన తెలంగాణ వ్యక్తికి ఇవ్వడం ఏంటని ఏపీ బీజేపీ నేతలు మదనపడుతున్నట్లు తెలుస్తోంది. ఇటు తెలంగాణ కాషాయంలోనూ ఆర్.కృష్ణయ్య రాకపై ఆందోళన వ్యక్తం అవుతోందట.
ఏపీలోనే కాదు తెలంగాణలోనూ రాజకీయ ప్రకంపనలు..
ఏపీ నుంచి ఆర్.కృష్ణయ్యకు రాజ్యసభ సీటు ఇవ్వడం ఏపీలోనే కాదు తెలంగాణలోనూ రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఆర్.కృష్ణయ్య వల్ల పార్టీకి ఉపయోగం లేకపోగా గతంలో ఆయన వల్ల పార్టీ తీవ్రంగా నష్ట పోయిందని వాపోతున్నారట నేతలు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ బీసీ సీఎంను ప్రకటిస్తే కనీసం మద్దతు తెలపకపోగా కేసీఆర్‌కు మద్దతిచ్చారని చర్చించుకుంటున్నారు కమలం లీడర్లు. హుజూరాబాద్ ఎన్నికల్లో బీసీ నేత అయిన ఈటల రాజేందర్ పోటీ చేస్తే..ఆయనకు మద్దతు ఇవ్వకుండా అధికార పార్టీకి సపోర్ట్ చేశారని గుర్తు చేస్తున్నారు. అలాంటి నేతను బీజేపీ లోకి తీసుకుని రాజ్యసభ సీటు ఇచ్చే అవసరం ఏమొచ్చిందని చర్చించుకుంటున్నట్టు సమాచారం. బీజేపీ జాతీయ నాయకత్వం బీసీలకే రాజ్యసభ సీటు ఇవ్వాలనుకుంటే అందులోనూ తెలంగాణ వ్యక్తికి ఇవ్వాలనుకుంటే చాలామంది బీజేపీకి చెందిన సీనియర్ నేతలు ఉండగా ఆర్.కృష్ణయ్యను తమ మీద రుద్దడం ఎంటన్న గుసగుసలు పార్టీ ఆఫీస్‌లో వినిపిస్తున్నాయి.
బీసీ నాయకత్వానికి ముందు నుంచి ప్రాధాన్యం..
తెలంగాణ బీజేపీ నేతలు ఈ స్థాయిలో ఆర్.కృష్ణయ్యపై అసహనం వ్యక్తం చేసేందుకు మరో కారణం కూడా లేకపోలేదు. తెలంగాణలో బీజేపీ బీసీ నాయకత్వానికి ముందు నుంచి ప్రాధాన్యత ఇస్తూ వస్తోంది. బీసీ నేత అయిన లక్ష్మణ్ పార్లమెంటరీ బోర్డు సభ్యుడితో పాటు యూపీ నుంచి రాజ్యసభకు పంపింది బీజేపీ హైకమాండ్. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తే బీసీని సీఎంను చేస్తామని కూడా ప్రకటించింది. తెలంగాణ బీజేపీలో బీసీ నేతలుగా ఈటల రాజేందర్, బండి సంజయ్‌ను ఎక్స్‌పోజ్ చేస్తూ వచ్చింది. బీజేపీ గెలిస్తే వీరిలోనే ఒకరు సీఎం అవుతారని కూడా పెద్దఎత్తున ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు తెలంగాణకే చెందిన ఆర్.కృష్ణయ్యకు ఏపీ నుంచి రాజ్యసభ సీటు ఇచ్చినా డాక్టర్ లక్ష్మణ్ లాగా తెలంగాణలోనే ఆయనను యాక్టీవ్ చేసే అవకాశం ఉందన్న చర్చ జరుగుతోంది.
బీసీ నేతల స్థానాలకు ఇబ్బంది వస్తుందని ఆందోళన..
ఇప్పుడిదే తెలంగాణ బీజేపీ నేతల్లో ఆందోళన కలిగిస్తుందట. బీసీ నేతగా ఇప్పటికే ఎస్టాబ్లిష్ అయిన ఆర్.కృష్ణయ్య బీజేపీలో యాక్టీవ్ అయితే బీజేపీలోనే బీసీ నేతల స్థానాలకు ఇబ్బంది వస్తుందని ఆందోళన చెందుతున్నట్లు టాక్. దీనికి తోడు ప్రధాని మోదీ తనతో స్వయంగా మాట్లాడారని..తెలంగాణ బీజేపీలో యాక్టీవ్‌గా ఉండాలని కోరారని ఆర్.కృష్ణయ్య సన్నిహితుల దగ్గర చెప్పుకుంటున్నట్టు సమాచారం.
తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే తమ నేత సీఎం అవుతారని అందుకే తెలంగాణలో యాక్టీవ్ కావాలని మోదీ సూచించారని ఆర్.కృష్ణయ్య అనుచరులు చెప్పుకోవడం చర్చనీయాంశం అవుతోంది. ఒకే ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిచిన ఆర్.కృష్ణయ్య..రెండుసార్లు వరుసగా రాజ్యసభకు వెళ్లారు. ఇప్పుడు బీసీ కార్డ్‌తో తెలంగాణ బీజేపీలో కాక రేపుతున్నారు. చూడాలి మరి ఆర్.కృష్ణయ్య ఎఫెక్ట్ తెలంగాణ బీజేపీలో ఎంత వరకు ఉంటుందో.
Also Read : నిధుల సేకరణ, ప్రభుత్వ ఆదాయం పెంచుకోవడంపై సీఎం రేవంత్ ఫోకస్..!