Cm Revanth Reddy: వాజ్‌పేయి, ఆర్ఎస్ఎస్ చేయలేని పని మేము చేస్తాం.. రిజర్వేషన్లు సాధిస్తాం- ఢిల్లీ వేదికగా నిప్పులు చెరిగిన సీఎం రేవంత్
కేసీఆర్, కిషన్ రెడ్డి, బండి సంజయ్ మీద కాదు మా సవాల్.. ప్రధాని మోదీ, కేంద్ర ప్రభుత్వానికే నా సవాల్ అంటూ నిప్పులు చెరిగారు రేవంత్ రెడ్డి.

Cm Revanth Reddy: బీసీ రిజర్వేషన్ కు అడ్డుపడితే మోదీని గద్దె దించుతాం అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఎర్రకోటపై మూడు రంగుల జెండా ఎగరేసి బీసీ రిజర్వేషన్లు సాధిస్తామని చెప్పారు. కేంద్రం మెడలు వంచైనా 42శాతం బీసీ రిజర్వేషన్లు సాధిస్తామన్నారు. తెలంగాణలో రిజర్వేషన్లు ఇస్తామంటే గుజరాత్ వాళ్లకు కడుపు మంట ఎందుకు అని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.
గుజరాత్, ఉత్తరప్రదేశ్ లో మేము రిజర్వేషన్లు అడగలేదు అని సీఎం రేవంత్ అన్నారు. మోదీ మోచేతి నీళ్లు తాగుతూ బీజేపీ నేతలు నోళ్లు మూసుకున్నారని రేవంత్ ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ నేతలు మోదీ చెప్పులు మోస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్, కిషన్ రెడ్డి, బండి సంజయ్ మీద కాదు మా సవాల్.. ప్రధాని మోదీ, కేంద్ర ప్రభుత్వానికే నా సవాల్ అంటూ నిప్పులు చెరిగారు రేవంత్ రెడ్డి.
”ఈ కులగణన, జనగణన, 42 శాతం రిజర్వేషన్ దేశ రాజకీయాల్లో సునామీని సృష్టించబోతోంది. ఆ సునామీలో ఎన్డీయే బంగాళాఖాతంలో కలవబోతోంది. నరేంద్ర మోదీ కుర్చీ దిగబోతున్నారు. ఆనాడు గుజరాత్ లో జరిగిన దుర్ఘటనలతో మోదీని ముఖ్యమంత్రి కుర్చీ నుంచి మారుద్దామని వాజ్ పేయి అనుకున్నారు. అది సాధ్యపడలేదు. నిన్న కాక మొన్న ఆర్ఎస్ఎస్ పెద్ద మోహన్ భగవత్ ఒక మాట అన్నారు.
75 సంవత్సరాలు పూర్తైన ప్రతి ఒక్కరు పదవుల నుంచి దిగాలి. అద్వానీని, మురళీ మనోహర్ జోషిని 75 సంవత్సరాల నిబంధన పెట్టి వారిని ప్రధాన మంత్రులు చేయలేదు కాబట్టి మోదీ కూడా రేపు సెప్టెంబర్ 17కు 75 ఏళ్లు పూర్తవుతున్నాయి. వారు ప్రధాని పదవి నుంచి దిగాలని భగవత్ చెప్పారు. కానీ, మోదీ పరమ భక్తుడు నిశికాంత్ దూబే ఒక మాట చెప్పారు. మోదీ కుర్చీ దిగరు, 2029లోనూ ఆయననే ఎన్నికల్లో ప్రధాని అభ్యర్థిగా ఉంటారు అని చెప్పారు.
2029 వరకు మోదీనే కుర్చీలో ఉండాలి. 2029 ఎన్నికల్లో వాజ్ పేయి, ఆర్ఎస్ఎస్ చేయలేని పని మోదీని గద్దె దించే పని మా సోదరుడు, మా నాయకుడు రాహుల్ గాంధీ నేతృత్వంలో ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త దేశం నలుమూలల నుంచి కార్యోన్ముఖులై ఎన్నికల యుద్ధ రంగంలోని మోదీని ఓడిస్తాం. ఢిల్లీ గద్దె నుంచి మోదీని దించుతాం. ఇదే మా శపథం అని చెప్పి జంతర్ మంతర్ సాక్షిగా నేను చెప్పదలుచుకున్నా” అని సీఎం రేవంత్ అన్నారు.