Telangana Thalli Statue : ఫ్యూచర్ సిటీ ప్రాంగణం నుంచి.. తెలంగాణ తల్లి విగ్రహాలను ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి..
Telangana Thalli Statue : రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్లలో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాలను సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు.
Telangana Thalli Statue
Telangana Thalli Statue : రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్లలో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాలను సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. ఫ్యూచర్ సిటీలోని గ్లోబల్ సమ్మిట్ ప్రాంగణం నుంచి వర్చువల్ గా సీఎం రేవంత్ విగ్రహాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతోపాటు మంత్రులు పాల్గొన్నారు.
తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో గతంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్టించిన విధంగా.. రాష్ట్రంలోని అన్ని కలెక్టరేట్లలో ఇదే నమూనాను అనుసరించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో తెలంగాణ రాష్ట్రంలో 33 కలెక్టరేట్లలో ఒక్కో విగ్రహానికి రూ.17.50లక్షల చొప్పున మొత్తం రూ.5.8కోట్లతో తెలంగాణ తల్లి విగ్రహాలను ప్రభుత్వం ఏర్పాటు చేయించింది.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్లు పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టరేట్లలో ప్రతిష్టించిన తెలంగాణ తల్లి విగ్రహాలను సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం భారత్ ఫ్యూచర్ సిటీలోని గ్లోబల్ సమ్మిట్ నుంచి వర్చువల్ గా ప్రారంభించారు.
LIVE: Hon’ble Chief Minister Sri A. Revanth Reddy virtually unveils Telangana Thalli Statues at District Collectorates from Telangana Rising Global Summit 2025 venue, Bharat Future City https://t.co/fB6moftXVV
— Telangana CMO (@TelanganaCMO) December 9, 2025
తెలంగాణ తల్లి విగ్రహం మొత్తం ఎత్తు 18 అడుగులు కాగా.. అందులో విగ్రహం ఎత్తు 12 అడుగులు.. దిమ్మె ఆరు అడుగులు. తెలంగాణకు ప్రత్యేకమైన ఆకుపచ్చ చీరను పసుపు పచ్చ బంగారు అంచులతో అలంకరించి, తెలంగాణ సాంప్రదాయానికి నిదర్శనంగా నిలుస్తున్న మొక్కజొన్న, సజ్జ, గోధుమ పంటలను ఆమె ఎడమ చేతిలో అలంకారంగా ఉంచారు.
అలాగే నుదుటిపై ఎర్రటి బొట్టు, చెవులకు కమ్మలు, మెడలో సంప్రదాయ గుండుపూసల హారం, చేతులకు మట్టిగాజులు, కాళ్లకు కడియాలు, ముక్కు పుడక వంటి ఆభరణాలతో తెలంగాణ మహిళా స్వభావాన్ని ప్రతిబింబించేలా తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందించారు.
