తెలంగాణ కాంగ్రెస్‌లో ఈ ముగ్గురు సీనియర్ నేతలకు ఛాన్స్ లేనట్లేనా?

Lok Sabha Elections 2024: ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్‌ హైకమాండ్‌ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అన్నదే ఆసక్తికరంగా మారింది.

తెలంగాణ కాంగ్రెస్‌లో ఈ ముగ్గురు సీనియర్ నేతలకు ఛాన్స్ లేనట్లేనా?

Lok Sabha Elections 2024: ముగ్గురూ ముగ్గురే.. పార్టీకి అండగా నిలిచారు. పార్టీనే నమ్ముకున్నారు. అధికారంలోకి వచ్చేవరకు తెరవెనుక ఎంతో కృషి చేశారు. వారి త్యాగాన్ని మరచిపోమని అధినాయకులు ప్రకటనలు చేశారు. కానీ…. సమయం వచ్చేసరికి మాత్రం మళ్లీ త్యాగాలే చేయమంటున్నారు. చట్టసభలకు వెళ్లాలనే ఆ నేతల ఆశలపై నీళ్లు జల్లుతున్నారు.

తెలంగాణ కాంగ్రెస్‌లో కాలం కలిసి రాని నేతలు ఎవరంటే ముగ్గురు నేతల పేర్లు ఠక్కున చెబుతున్నారు… ఆ ముగ్గురు నేతలు ఎవరు? వారి పార్లమెంట్‌ ఆశలు నెరవేరే పరిస్థితి లేదా? వాచ్‌ దిస్‌ స్టోరీ…

ఈ నేతలే..
తెలంగాణ కాంగ్రెస్‌లో మోస్ట్‌ అంటే మోస్ట్‌ సీనియర్‌ లీడర్‌ వీహెచ్‌. ఈయనతోపాటే పార్టీని నమ్ముకున్న మరో సీనియర్‌, మాజీ ఎంపీ మల్లు రవి. మరోనేత అద్దంకి దయాకర్‌.. ఈ ముగ్గురికీ అస్సలు కాలం కలిసిరావడం లేదట.. పార్టీనే నమ్ముకుని.. పార్టీ కోసం ఎన్నో త్యాగాలు.. పోరాటాలు చేసిన ఈ ముగ్గురు నేతలకు ఎప్పుడూ దురదృష్టం నీడలా వెన్నాడుతున్నట్లే కనిపిస్తోంది.

దీంతో చట్టసభలకు వెళ్లాలనే ఆశలు నీరుగారిపోతున్నాయి. వీహెచ్‌, మల్లు రవి.. ఇద్దరూ మాజీ ఎంపీలే.. కానీ, చాలాకాలంగా మాజీలుగా ఉన్న ఈ నేతలు ఈ సారి కచ్చితంగా చట్టసభకు వెళ్లాలని కంకణం కట్టుకున్నారు. ఇక అద్దంకిది కూడా ఇదే పరిస్థితి… అదృష్టం తలుపు తట్టిన సమయంలో దురదృష్టం బ్యాక్‌డోర్‌ ద్వారా ఎంట్రీ ఇచ్చేస్తుండటంతో ఆయన చేతికి అందినట్టే అందిన పదవులు చేజారిపోతున్నాయి. ఇప్పుడు కూడా ఎంపీ సీటు విషయంలో ఈ ముగ్గురికీ నిరాశతప్పదన్న ప్రచారమే ఎక్కువగా జరుగుతోంది.

పార్టీకి వీరవిధేయులైన ఈ ముగ్గురు చాలాకాలంగా లోక్ స‌భ ఎన్నిక‌ల్లో పోటీ చేసే అవ‌కాశం క‌ల్పించాల‌ని పార్టీని కోరుతున్నారు. వీరి విషయంలో పార్టీలో సానుకూల అభిప్రాయాలే ఉన్నా… ఆ నేతలు కోరుతున్న స్థానాల విష‌యంలోనే ర‌క‌ర‌కాల స‌మీక‌ర‌ణాలు అడ్డం ప‌డుతున్నాయ‌నే ప్రచారం జరుగుతోంది. సీనియ‌ర్ నేత వి.హ‌నుమంత‌రావు ఖ‌మ్మం లోక్ స‌భ సీటు కావాల‌ని చాలాకాలంగా కోరుతున్నారు.

కానీ, ఆ సీటు కోసం అదే జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు తీవ్రంగా ప‌ట్టు బ‌డుతున్నారు. డిప్యూటీ సీఎం మ‌ల్లు భ‌ట్టి విక్రమార్క భార్య నందిని, మ‌రో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సోద‌రుడు ప్రసాద్ రెడ్డి ఇదే సీటును ఆశిస్తున్నారు. ఖమ్మం జిల్లావరకు ఆ ఇద్దరు కీల‌క నేత‌లు కావ‌డంతో సీటు రేసులో వీహెచ్ వెన‌క‌బ‌డిపోయినట్లు చెబుతున్నారు.

ఇక్కడి నుంచి గాంధీల కుటుంబం నుంచి ఎవరో ఒకరు పోటీ చేసే చాన్స్‌ ఉందన్న ప్రచారం కూడా వీహెచ్‌ అవకాశాలను దెబ్బతీస్తున్నాయి. అయితే తనకు అవ‌కాశం ఇవ్వక‌పోతే నిరాహార‌దీక్ష చేస్తానంటూ అల్టిమేటం జారీ చేస్తున్న వీహెచ్‌ వ్యవహారం కాంగ్రెస్‌లో కాకపుట్టిస్తోంది.

ఇంకాస్త విచిత్రంగా..
మరోవైపు సీనియ‌ర్ నేత మ‌ల్లు ర‌వి ప‌రిస్థితి ఇంకాస్త విచిత్రంగా తయారైంది. రాష్ట్రంలో మూడు ఎస్సీ రిజ‌ర్వుడు లోక్ స‌భ స్థానాలు ఉన్నాయి. రెండు సీట్లు మాదిగ సామాజిక వ‌ర్గానికి, ఒక స్థానం మాల సామాజిక వ‌ర్గానికి ఇవ్వాల‌ని పార్టీ భావిస్తోంది. తెలంగాణలో మాదిగలు ఎక్కువగా ఉన్నందున ఈ విధంగా సీట్లు సర్దుబాటు చేయాలనేది కాంగ్రెస్‌ ఆలోచన… మాల వర్గం కోటాలో పెద్దప‌ల్లి పార్లమెంట్ స్థానాన్ని చెన్నూరు ఎమ్మెల్యే గ‌డ్డం వివేక్ కుమారుడు వంశీ ఆశిస్తున్నారు.

దీంతో ఆటోమెటిక్‌గా మిగ‌తా రెండు రిజర్వుడు నియోజ‌క‌వ‌ర్గాలు వ‌రంగ‌ల్‌, నాగ‌ర్ క‌ర్నూల్ మాదిగ సామాజిక వ‌ర్గానికి కేటాయించాల్సి వ‌స్తోంది. ఈ ఎఫెక్ట్‌తోనే మాల సామాజికవర్గానికి చెందిన మ‌ల్లు ర‌వికి అవ‌కాశాలు స‌న్నగిల్లుతున్నట్లు చెబుతున్నారు. మ‌ల్లు ర‌వి మాత్రం గ‌తంలో తాను రెండు సార్లు గెలిచాన‌ని.. ఇప్పుడు కొత్తగా స‌మ‌స్య క్రియేట్ చేస్తున్నారంటూ మండిప‌డుతున్నారు.

ఇదే సమయంలో తనకు ఎట్టిపరిస్థితుల్లో ఎంపీ సీటు కావాల్సిందేనన్న సంకేతాలు పంపేందుకు… ఆయనకు ఇటీవ‌ల కేటాయించిన ఢిల్లీలో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి పోస్ట్‌కు సైతం రాజీనామా చేసేశారు. నాగ‌ర్ క‌ర్నూల్ నుంచి మ‌ల్లుర‌వికి అవ‌కాశం క‌ల్పిస్తే.. పెద్దప‌ల్లి నుంచి గ‌డ్డం వంశీ ఎగ్జిట్ కావాల్సి ఉంటుంది. దీంతో మ‌ల్లు ర‌వి అంశం పార్టీలో క్రిటిక‌ల్‌గా మారుతోంది.

అద్దం ద‌యాక‌ర్‌ పరిస్థితి?
ఇక మ‌రో సీనియ‌ర్ నేత అద్దం ద‌యాక‌ర్‌. పదవుల దోబూచులాటలో ఎప్పుడూ దయాకర్‌ వెనకబడిపోతున్నారు. అసెంబ్లీ ఎన్నిక‌ల్లో తుంగ‌తుర్తి సీటు, ఆ త‌ర్వాత ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ, రాజ్యస‌భ ఎంపీ వ్యవ‌హారం ఇలా ప్రతిసారి అద్దంకి పేరు తెర‌పైకి రావ‌డం చేజార‌డం ప‌రిపాటిగా మారింది.

అద్దంకికి లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో వ‌రంగ‌ల్ నుంచి అవ‌కాశం క‌ల్పిస్తార‌ని మొద‌ట్లో చ‌ర్చ జ‌రిగింది. ఈయనకు టికెట్‌పై పార్టీలో ఎలాంటి వ్యతిరేకత లేకపోయినా… ఆయన సామాజిక వర్గమే మైనస్‌గా మారిందంటున్నారు. ఈయన కూడా మాల సామాజికవ‌ర్గానికి చెందిన వారు కావడం… ఆ సామాజికవర్గానికి ఒకే స్థానం కేటాయించే అవకాశం ఉండటంతో అద్దంకి అవకాశం కష్టమే అంటున్నారు.

Also Read: పంతం నెగ్గించుకున్న కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి

ఇలా ముగ్గురు కీలక నేతల విషయంలో కాంగ్రెస్‌ హైకమాండ్‌ తీవ్ర తర్జనభర్జన పడుతోందంటున్నారు. పార్టీకి వీరవిధేయులైన ఈ ముగ్గురిని ఎలా సర్దుబాటు చేయాలో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు టీకాంగ్రెస్‌ పెద్దలు. తొలి నుంచి కాంగ్రెస్‌ ఫ్యామిలీ అని చెప్పుకునే వీహెచ్‌కు ఇప్పుడు కాకపోతే మరో అవకాశం ఇవ్వడం కుదరేపనికాదంటున్నారు.

ఇక పార్టీ విపక్షంలో ఉండగా అద్దంకి, మల్లు రవి చేసిన సేవలను దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు తప్పకుండా న్యాయం చేయాల్సివుంటుందన్న సానుభూతి వ్యక్తమవుతోంది. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్‌ హైకమాండ్‌ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అన్నదే ఆసక్తికరంగా మారింది.