తెలంగాణాలో కరోనా సెకండ్ స్టేజ్..@21 కేసులు

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాపిస్తోంది. ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా చాప కింద నీరులా విస్తరిస్తోంది. ప్రస్తుతం ఈ వైరస్ సెకండ్ స్టేజ్ లోకి ఎంటర్ అయ్యింది. కేవలం విదేశాల నుంచి వచ్చిన వారిలో కరోనా వైరస్ లక్షణాలు కనిపిస్తున్నాయి. దీంతో పాజిటివ్ కేసుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోంది. రాష్ట్రంలో తొలిసారి మరో వ్యక్తికి వైరస్ సోకింది. దీనినే రెండో స్టేజ్ గా పరిగణిస్తారు. తెలంగాణాలో ఇదే ప్రథమమని చెప్పవచ్చు.
దుబాయి నుంచి వచ్చిన ఓ వ్యాపారి (60)కి కరోనా ఉన్నట్లు నిర్ధారించారు. ఆయన కుటుంబసభ్యుల్లో ఒకరికి వైరస్ లక్షణాలు ఉన్నట్లు గుర్తించారు. దీంతో 2020, మార్చి 21వ తేదీ శనివారం రెండు కేసులు నమోదయ్యాయి. మొత్తం పాజిటివ్ కేసులు 21కి చేరుకున్నాయి. వైరస్ సోకిన వ్యాపారి 2020, మార్చి 14వ తేదీన దుబాయ్ నుంచి వచ్చారు. కుటుంసభ్యులతో నాలుగు రోజులు గడిపారు.
అయితే..జ్వరంతో బాధ పడుతుండడంతో 18వ తేదీన గాంధీ ఆసుపత్రికి వచ్చారు. 19వ తేదీన కరోనా ఉన్నట్లు గుర్తించారు. అప్పటికే కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా విజృంభిస్తోంది. అప్పటి నుంచి గాంధీలో చికిత్స పొందుతున్నాడు. ఇతని కుటుంబసభ్యుల్లో ఒకరికి జలుబు, దగ్గుతో బాధపడుతున్నారు. శుక్రవారం ఆసుపత్రిలో చేరారు. ఇతనికి కరోనా వైరస్ ఉన్నట్లు గుర్తించారు. దుబాయి నుంచి వచ్చిన మరో ప్రయాణికుడిలో కూడా వైరస్ లక్షణాలు కనిపించాయి. బాధితుల ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని, ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు వెల్లడించారు.