హైదరాబాద్ లో కరోనా కాటు : తెలంగాణలో మరో 43 కేసులు

హైదరాబాద్ లో కరోనా కాటు : తెలంగాణలో మరో 43 కేసులు

Updated On : June 23, 2021 / 12:54 PM IST

తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడం లేదు. తగ్గుతూ అనిపిస్తూనే..మరలా కేసులు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. 2020, ఏప్రిల్ 18వ తేదీ శనివారం మరో 43 కేసులు నమోదయ్యాయి. ఇందులో గ్రేటర్ హైదరాబాద్ లో 31 కేసులు ఉన్నాయి. గాజులరామారాంలో ఒకే కుటుంబంలో 11 మందికి వ్యాధి సోకడం ఆ ప్రాంతంలో తీవ్ర కలకలం రేపింది. మొత్తంగా రాష్ట్రంలో 809 కేసులున్నాయి. 186 మంది డిశ్చార్జ్ అయ్యారు. 18 మంది చనిపోయారు.

జోగులాంబ గద్వాల జిల్లాలో ఏడుగురు, సిరిసిల్లలో ఇద్దరు, రంగారెడ్డిలో ఇద్దరు, నల్గొండలో ఒక కేసు నమోదైంది. రాష్ట్ర వైద్య శాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం సూర్యపేట జిల్లాలో 44 పాజిటివ్ కేసులున్నాయి. ఇదిలా ఉంటే..నిమ్స్ స్పెషాల్టీ విభాగంలోని ఓ నర్సుతో పాటు నాలుగో తరగతి మహిళ ఉద్యోగికి కరోనా వైరస్ సంక్రమించిందని శనివారం వైద్యులు గుర్తించారు.

నిమ్స్ ఆసుపత్రిలో కరోనా వైరస్ ఉన్న ఓ మహిళకు చికిత్స చేసిన 8 మంది డాక్టర్లు, నర్సులను క్వారంటైన్ కు తరలించారు. వ్యాధి సోకిన వారి ప్రాంతాలను కంటైన్ మెంట్ ప్రాంతాలుగా గుర్తించారు. కింగ్ కోఠి ఆసుపత్రికి వచ్చిన రిటైర్డ్ పోలీసు అధికారి భార్య (55) శుక్రవారం చనిపోయారు. పరీక్షలు నిర్వహిస్తుండగానే మృతి చెందిందని వైద్యులు వెల్లడించారు.